విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి

 

విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి!

భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి గీతా సారాన్ని బోధిస్తూ ఎన్నో విషయాలను ప్రస్తావిస్తాడు. అందులో ముఖ్యమైనది కృష్ణుడి విశ్వరూప దర్శనం. అర్జునుడు విశ్వరూప దర్శనం చేసుకోగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పటివరకు కేవలం చిన్న చిన్న నీటి కాలువలు చూసిన మనిషికి ఒక్కసారిగా మహా సముద్రం కనబడితే ఆ మనిషిలో కలిగే ఆశ్చర్యం ఎలా ఉంటుందో అలాగే అర్జునుడి మానసిక స్థితి కూడా మారిపోయింది. 

ఎగసి పడుతున్న సముద్రపు అలలను చూసినప్పుడు ఎలాగైతే భయపడతారో అలాగే కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి అర్జునుడు కూడా భయపడ్డాడు. అప్పుడు అర్జునుడి అంతరంగం ఎలా ఉంది??అనే విషయాన్ని వ్యాసుల వారు ఇలా వివరిస్తారు.
కిరీటినం గదినం చక్రహస్త మిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ౹౹

6ర్తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహూ భవ విశ్వమూర్తే॥॥


ఓ కృష్ణా! ఈ అనంత విశ్వం అంతా నిండి, విశ్వమే నీ రూపముగా కల ఓ విశ్వమూర్తీ! ఓ సహస్రబాహెూ! ఇంక చాలయ్యా! నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను. ఈ భయంకరమైన కాలపురుషుని అవతారం చాలించి, నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి, ఇదివరకటి మాదిరి, ఎంచక్కా పట్టు పీతాంబరాలు, వన మాలలు, కిరీటము, గద, చక్రము, నెమలి పింఛము, ముఖాన చిరునవ్వు సౌమ్యంగా ఉన్న మునుపటి ఆ రూపం ధరించు. అని వేడుకున్నాడు అర్జునుడు.

ఇక్కడ ఒక విషయం ఉంది. చతుర్భుజం అని వాడారు వ్యాసులవారు, కాని ఇంతకు ముందు ఎక్కడా కృష్ణుడు నాలుగు చేతులలో అర్జునుడికి కనపడినట్టు లేదు. కాకపోతే అర్జునుడి మనసులో ఒక ఊహ మెదిలి ఉండవచ్చు అనేకములైన చేతులు, కాళ్లు, తలలు, కళ్లు ఆయుధములు భయంకరమైన నోరు ఆ నోటిలోకి అందరూ క్యూకట్టి వెళ్లడం, దీనికన్నా నాలుగు భుజాలతో ఉన్న రూపం బాగుంటుంది కదా అని అనుకొని ఉండవచ్చు. ఇది అప్పటి అర్జునుడి మానసికస్థితి కాని వేరుకాదు. అసలు కృష్ణుని యొక్క అర్జునుని యొక్క, శారీరక స్థితిలో ఏ మార్పూలేదు కేవలం అర్జునుడు మానసిక నేత్రంతోనే ఇవన్నీ చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి.

దీనిని మరొక విధంగాకూడా శాస్త్రకారులు విశ్లేషించారు. అర్జునుడు అప్పటి వరకు కృష్ణుడిని మామూలు మనిషిగానే భావించాడు. ఇప్పుడు అనేకములైన వేనకు వేల చేతులతో కాళ్లతో ఉదరములతో భయంకరమైన ముఖముతో కాలస్వరూపుడుగా కనపడుతున్నాడు. ఆ రూపాన్ని చూడలేకపోతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణుస్వరూపము అంటే సర్వవ్యాపిత్వము కలవాడు అని తెలుసుకున్న అర్జునుడు కృష్ణుడిని తన విశ్వరూపం ఉపసంహరించి తాను చూడటానికి అలవాటుపడ్డ విష్ణువు రూపమైన చతుర్భుజములు, శంఖుచక్రములు, గద, కిరీటము, వీటితో కూడిన మంగళకరమైన విష్ణురూపాన్ని ధరించమని కోరాడు. అని అనుకుంటూ ఈ సందర్భానికి సరిగా సరిపోతుంది అని శాస్త్రకారులు వ్యాఖ్యానించారు.

◆వెంకటేష్ పువ్వాడ.