శ్రీకృష్ణుడికి సంతానం కలిగేలా వరమిచ్చినది ఈయనే?
శ్రీకృష్ణుడికి సంతానం కలిగేలా వరమిచ్చినది ఈయనే?
పురాణాలలో కొన్ని కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి అయితే మరికొన్ని ఎంతో ప్రాశస్త్యం పొందినవి. వాటిలో శ్రీకృష్ణునికి సంతానం కలగలేదని. అప్పుడు ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్ధించాడనీ కొందరు చెబుతారు. శ్రీకృష్ణుడు ఈశ్వరుని ప్రార్థించడం వల్ల ఈశ్వరుడి కృప వల్లనే శ్రీకృష్ణునికి సంతానం కలిగిందనీ చెబుతారు. దీని గురించి ఒక కథనం కూడా ఉంది.
ద్వాపరయుగములో దేవకి వసుదేవుల అష్టమ గర్బాన శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. అతడికి ఎనిమిది మంది భార్యలు. పదహారువేల మంది గోపికలు, వీరందరితోనూ సరస సల్లాపాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు తేలియాడుతున్నాడు. కాని అతనికి సంతానం మాత్రం కలుగలేదు. ఒకరోజున అష్ట భార్యలందరూ శ్రీకృష్ణుని చుట్టూ చేరి "నాధా! భువనైక మోహనుడవయిన నిన్ను భర్తగా పొందటం మా అదృష్టం. అయితే స్త్రీకి ఎన్ని సౌఖ్యాలు ఉన్నా, భోగభాగ్యాలు ఉన్నా, సంతానం లేకపోవడం ఆనేది చాలా పెద్దలోటు. తల్లి కాని స్త్రీకి లోకంలో గౌరవము లేదు. కాబట్టి మాకు బిడ్డలను ప్రసాదిందు స్వామి..!!" అన్నారు.
ఆ మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత "శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదు. ఈశ్వరానుగ్రహం లేనిదే ఏ పనీ జరగదు. అందుచేత నేను తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందుతాను" అని తన భార్యలకు చెప్పి తపోవనానికి బయలుదేరాడు.
హిమాలయ పర్వతాలలో ఉప మన్యువు యొక్క ఆశ్రమం ఉన్నది. శ్రీకృష్ణుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి తాను వచ్చిన సంగతి గురించి వివరంగా చెప్పాడు. ఉపమన్యువు చాలా సంతోషించి శ్రీకృష్ణునితో "స్వామీ… నేను శివపంచాక్షరీ మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం జపిస్తూ తపస్సు చెయ్యి" అని అన్నాడు.
శ్రీకృష్ణుడు సరేనని చెప్పడంతో ఉపమన్యువు శివపంచాక్షరీ మంత్రోపదేశం చేశాడు.
శ్రీకృష్ణుడు నియమనిష్టలతో చాలాకాలం పాటు శివపంచాక్షరీ నామం జపిస్తూ తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలో కోరుకోమన్నాడు.
దానికి శ్రీకృష్ణుడు "చంద్రమౌళీశ్వరా! నీ అనుగ్రహం నా మీద ఉంటే చాలు" అన్నాడు. ఆ మాటలకు మహదానందం చెందినవాడై పరమేశ్వరుడు "శ్రీకృష్ణా! నీవారందరూ సంతానవంతులవుతారు. మొత్తము నీకు స్త్రీ పురుష సంతానము లక్షా ఇరవై ఒక్క వేల రెండు వందలు ఉంటుంది. లోకైక పూజ్యుడవు అవుతావు, ఇంకా యుద్ధంలో సర్వదా విజయలక్ష్మి నిన్ను వరిస్తుంది" అని చెప్పి అంతటితో ఆగక 'పాంచజన్యము' అనే శంఖాన్ని, 'కౌముదకి' అనే గదను, 'నందకము' అనే ఖడ్గాన్ని, ‘శార్జము' అనే ధనస్సునూ అక్షయ తూణీరాలను ఇచ్చాడు. ఇంకా అనేకానేక వరాలు కూడా ఇచ్చి దీవించాడు.
ఆ విధంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్ముడు సంతానవంతుడు అయ్యాడు. ఇదీ కృష్ణుడికి సంతానం కలగడం వెనుక ఉన్న కథ.
◆నిశ్శబ్ద.