కృష్ణుడి చేతిలో రాధకూ పరీక్ష తప్పలేదు!

 

కృష్ణుడి చేతిలో రాధకూ పరీక్ష తప్పలేదు!

రాధా కృష్ణుల గురించి ఎన్నెన్నో కథలు ఉన్నాయి. వీరి ప్రేమ అజరామం. ప్రేమకు అసలైన నిర్వచనంగా రాధాకృష్ణుల ప్రేమను అభివర్ణిస్తారు. సాధారణ జనుల పట్ల ఆ కృష్ణుడికి ఎనలేని ప్రేమ, ఆదరభావం ఉంటాయి. అలంటిది కృష్ణుడు కూడా ఎంతగానో ప్రేమించిన రాధ అంటే కృష్ణుడికి ఎంతో ప్రత్యేకం. రాధాదేవిని పరీక్షించాలన్న ఆలోచన ఒకసారి మాధవుడికి కలిగింది. వెంటనే ఆయన ఒక గోపస్త్రీ వేషం ధరించి రాధాదేవిని కలుసుకున్నాడు.

మాయాగోపికను చూడగానే రాధాదేవికి ఆమె మీద అభిమానం కలిగింది. ఆమెకు అతిథి మర్యాదలు చేసి 'మీ పేరేమిటి? మీరెక్కడ వుంటారు?' అని రాధ అడిగింది. 'మా వూరు నందపురి. నన్ను గోపదేవి అంటారు' అని మాయాగోపిక చెప్పింది.

ఆ తరువాత వాళ్ళిద్దరూ చాలాసేపు ముచ్చట్లాడుకున్నారు. చీకటి పడబోతుండగా 'మళ్ళీ రేపు వస్తాను' అని చెప్పి మాయగోపిక వెళ్ళిపోయింది.

అన్నమాట ప్రకారం మాయగోపిక మరునాడు రాధాదేవి దగ్గరకు వెళ్ళి నల్లనయ్యను గురించి చాలా పరుషంగా మాట్లాడింది. 'పొద్దున నేను గోవర్ధనగిరి దగ్గర పెరుగు అమ్ముకునేందుకు వెళుతుంటే శ్రీకృష్ణుడు అడ్డు తగిలి నా చెయ్యి పట్టుకున్నాడు. పెళ్ళి చేసుకోమని బలవంతం చేశాడు. 'చేసుకోక చేసుకోక నీబోటి నల్లవాడ్నీ, గొల్లవాడ్నీ చేసుకోవాలా' అని నేనంటే కోపంతో నా పెరుగుకుండ కాస్తా పగులకొట్టాడు. పెరుగంతా తాగేశాడు. వట్టి అల్లరివాడు. అలాంటివాడ్నీ పెళ్ళి చేసుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు' అంది. ఆ మాటలకు రాధాదేవి చాలా బాధపడింది. 

'అమ్మా? నువ్వు ఆ మహానుభావుడ్ని తూలనాడటం భావ్యం కాదు. ధర్మాన్ని స్థాపించేందుకు, అధర్మాన్ని అంతం చేసేందుకు, శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి ఉద్భవించినవాడాయన. అతను నల్లనివాడన్నావు. ఆ నల్లనయ్య అనుగ్రహం వల్లనే మహర్షులు తమలో వున్న చీకటి తెరలు తొలగించుకోగులుగుతున్నారు. అది నువ్వు గ్రహించినట్లు లేదు. శ్రీ మహాలక్ష్మిని హృదయాన నిలుపుకున్న ఆ పరిపూర్ణుడు, తనకు తానై నిన్ను పెళ్ళిచేసుకుంటానంటే అదేదో మహాపచారంగా భావిస్తున్నట్టున్నావు. అంతటి అపురూపమైన అదృష్టం అందరికీ లభిస్తుందా? ఎన్నివేల జన్మల తపస్సో వుంటే కానీ వేణుగోపాలుడి అనుగ్రహం లభించదు....' అంటూ ఉండగానే రాధాదేవి కళ్ళు కన్నీటి కాలువలయ్యాయి. కంఠం కంపించిపోయింది. అరచేతుల్లో ముఖాన్ని కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మాయాగోపిక రూపంలో వున్న శ్రీకృష్ణుడు మందహాసం చేసి ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.

రాధ ఒళ్ళు పులకరించింది. ఆమెకు దివ్యానుభూతి కలిగింది. 'కృష్ణా! కృష్ణా' అంటూన్న ఆమె చేతులు రెండూ నల్లనయ్య కంఠాన్ని కలువదండలా చుట్టేశాయి. ఇలా రాధాకృష్ణుల ప్రేమ గురించి ఎన్నో కథలున్నాయి.

                                             *నిశ్శబ్ద.