Read more!

విశ్వామిత్రుడి అహంకారానికి వసిష్టుడి వైద్యమిదే...

 

విశ్వామిత్రుడి అహంకారానికి వసిష్టుడి వైద్యమిదే...

యుగధర్మం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. సత్యయుగం నాటి మనుష్యులది సాత్విక స్వభావం. త్రేతాయుగంలో బలాన్ని తక్కువ చేసి, బ్రహ్మతేజమే గొప్పది అంటూ - 'ధిక్ బలం క్షత్రియబలం, బ్రహ్మతేజో బలం బలం' అన్నారు. అర్జునుడు, రావణుడు క్షత్రియ గుణానికి ప్రతీకలు, రజోగుణ సంపన్నులు. బ్రాహ్మణత్వం సంపాదించడానికి విశ్వామిత్రుడు ముప్ఫై ఏళ్ళు కఠోరసాధన చేశాడు. కులం అన్నది పుట్టుకతో వచ్చిందన్న వసిష్ఠుడు తప్ప ఋషులందరూ, విశ్వామిత్రుడు కృతకృత్యుడయ్యాడు అన్నారు. వసిష్ఠుడు మాత్రం ఒప్పుకోలేదు. క్షత్రియుల్లో ప్రస్ఫుటంగా గోచరించేవి క్రోధం, హింసా ప్రవృత్తి.  బ్రాహ్మణుల ప్రధాన గుణాలు  దయ, క్షమ.

ముప్ఫై ఏళ్ళ పాటు తపస్సు చేసి, ఏమీ సాధించలేక పోయానే, క్షత్రియుడిగానే మిగిలి ఉన్నానని దిగులు పడ్డాడు విశ్వామిత్రుడు. దాంతో విశ్వామిత్రుడు క్రుద్ధుడయ్యాడు. ఎవరికీ తెలియకుండా వసిష్ఠుణ్ణి చంపాలని నిర్ణయించుకొని, ఒక చీకటి రాత్రి వసిష్టాశ్రమం ప్రవేశించాడు. వసిష్ఠుడు సమాధిస్థుడై ఉన్నాడు. సమాధిలో ఉన్న వ్యక్తిని వధించకూడదన్న జ్ఞానం మాత్రం తన దీర్ఘకాలం తపస్సు మూలంగా సంపాదించాడు విశ్వామిత్రుడు.. కనుక దాగి ఉన్నాడు.

సమాధి నుండి మేల్కొన్న వసిష్ఠుడు, 'ఆకలి వేస్తున్నది' అన్నాడు. తన పత్ని అరుంధతితో. ఆమె ఒక పండు తెచ్చి ఇచ్చింది. కొద్దిగా ఉప్పు అడిగాడు. ఆశ్రమంలో ఉప్పు లేదన్నది అరుంధతి. ఒక్క క్షణం మౌనం వహించి, 'విశ్వామిత్రుని ఆశ్రమం దగ్గరలోనే ఉంది కదా! వారిని అడిగి పట్టుకురా!' అన్నాడు వసిష్ఠుడు. 'మన వందమంది. కుమారులను వధించిన వారి ఎదుట చెయ్యి చాపడమా? నా వల్ల కాదు. క్షమించండి' అన్నది అరుంధతి. 'అరుంధతీ! విశ్వామిత్రుడు తపఃఫలితంగా రాజర్షి అయ్యాడు. ఇప్పుడు గతాన్ని తలవడమేల' అని ప్రశాంతంగా అన్నాడు వసిష్ఠుడు. వసిష్ఠుని క్షమాపరాయణత చూసి విశ్వామిత్రుడు పశ్చాత్తాపం చెందాడు. ఆయన పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు. 

'విశ్వామిత్రా! నీవు నాకు ఏ అపకారమూ చేయలేదు. కానీ నీ మనస్సుకే అపకారం జరిగింది' అన్నాడు వసిష్ఠుడు. విశ్వామిత్రుడికి కనువిప్పు కలిగింది. 'నీవు ఆదిశేషుని ఆశ్రయించి, గురూపదేశం అర్థించు' అన్నాడు వసిష్ఠుడు.

ఆదిశేషుని ఉపదేశ మొసంగమని వేడుకొన్నాడు. విశ్వామిత్రుడు. 'పిచ్చివాడా! నా తలపై మోస్తున్న భూభారంతో నేను సతమతమవుతున్నాను. ఉపదేశం ఏమి చేయగలను?” అన్నాడు. విశ్వామిత్రుడు తన తపోబలంలో మూడోవంతు ఆదిశేషునికి ఇవ్వగా, ఒక స్తంభం భూమిని ఛేదించుకుని బయటకు వచ్చింది. ఆ స్తంభంపై భూమిని నిలబెట్టి, ఆదిశేషువు ఉపదేశం ప్రారంభించాడు. ఇంతలో ఆ స్తంభం క్రుంగిపోసాగింది. ఆదిశేషువు ఆదరాబాదరాగా పృథ్విని తిరిగి తన శిరస్సులపై పెట్టుకొన్నాడు. విశ్వామిత్రుడు మిగిలిన తపోబలాన్ని ప్రదానం చేశాడు. అయినా ఆ స్తంభం భూభారాన్ని మోయలేక పోయింది.

విశ్వామిత్రుడు తన సమస్త తపోబలం ఉపయోగించి కూడా ఒక స్తంభం క్రుంగకుండా చేయలేక పోయాడు. ఆయన అహంకారం చూర్ణమవుతోంది. అప్పుడు ఆదిశేషుడు, 'విశ్వామిత్రా! ముప్ఫై ఏళ్ళ తపస్సుకే ఇంత అహంకారమా' అని హేళన చేసి, తిరిగి వసిష్ఠుణ్ణి ఆశ్రయించమన్నాడు. వసిష్టాశ్రమంలోకి ఈ మారు ఎంతో వినమ్రభావంతో అడుగుపెట్టాడు. 'రావయ్యా! బ్రహ్మర్షి విశ్వామిత్రా' అంటూ వసిష్ఠుడు, ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అహంకారంతో వశిష్టుని ఆశ్రమంలో అడుగు పెట్టడానికి, వినమ్రతతో అడుగు పెట్టడానికి మధ్య తేడా అదే.. అహంకారం వదిలిననాడు నిజం అర్థం అవుతుంది.

                                        *నిశ్శబ్ద.