Read more!

సూర్యచంద్రుల గురించి కృష్ణుడు ఏమి చెప్పాడు?

 

సూర్యచంద్రుల గురించి కృష్ణుడు ఏమి చెప్పాడు?

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్। మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శరీ॥

 శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను  గురించి ఇలా చెబుతాడు. ఆదిత్యులలో విష్ణువును నేను. ప్రకాశించే వారిలో సూర్యుడను, ఆ సూర్యుడి కిరణములను నేను. మరుత్తులలో మరీచిని నేను. నక్షత్రములలో చంద్రుడను నేను అని అంటాడు.

అదితి కుమారులు ఆదిత్యులు. వారు పన్నెండు మంది. వారి పేర్లు.

1. ధాత, 

2. మిత్రుడు, 

3. అర్యముడు, 

4. శక్రుడు, 

5, వరుణుడు, 

6. అంశువు, 

7. భగుడు, 

8. వివస్వంతుడు, 

9. పూషుడు,

10. సవిత 

11.త్వష్ట 

12. విష్ణువు. 


మరుత్తులు ఏడుమంది. 


1. ఆవహ, 

2.ప్రవహ, 

3, నివహ, 

4. పరాహ, 

5. ఉద్వహ, 

6. సంవహ, 

7. పరివహ. 


భాగవత పురాణంలో ఈ మరుద్గణముల గురించి ఒక కథ కూడా ఉంది. కశ్యపునికి ఇద్దరు భార్యలు. దితి, అదితి. అదితి కుమారులు ఇంద్రుడు మొదలగు దేవతలు. దితి కుమారులు హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు. ఇంద్రుడు విష్ణువు సాయంతో తన కుమారులను చంపించాడని కోపంగా ఉంది దితి. తనకు ఇంద్రుడిని చంపే కుమారుడిని ప్రసాదించమని కోరింది దితి, భార్యమాట కాదనలేక ఆ వరం ఇచ్చాడు కశ్యపుడు కానీ కొన్ని నిబంధనలు పెట్టాడు. గర్భంతో ఉండగా ఆ నిబంధనలు అతిక్రమిస్తే, పుట్టే కుమారుడు ఇంద్రుడికి మిత్రుడు అవుతాడు అని అన్నాడు. దితి సరే అంది. ఇది తెలిసిన ఇంద్రుడు పినతల్లి దితి వద్దకు వచ్చాడు. ఆమెకు సేవలు చేస్తున్నాడు. దితి కాదనలేకపోయింది.


దితి ఒక రోజు ఒక నిబంధన అతిక్రమించింది. ఇదే తగిన సమయం అనుకున్నాడు ఇంద్రుడు. దితి గర్భంలో ప్రవేశించాడు. లోపల ఉన్న పిండాన్ని ఏడు భాగాలుగా నరికాడు. ఆ పిండాలు ఏడుస్తున్నాయి. ఏడవకండి ఏడవకండి (మా రుతః అంటే ఏడవకండి. అందుకే వారి పేరు మరుత్తులు) అంటూ మరలా ఒక్కొక్క భాగాన్ని ఏడుగా నరికాడు. మొత్తం నలభైతొమ్మిది భాగాలు అయ్యాయి. వారంతా మమ్మల్ని ఎందుకు నరికావు మేమేం అపకారం చేసాము అని ఇంద్రుని నిలదీసారు. మీరు నన్ను చంపడానికే పుడుతున్నారుకదా! అని అన్నాడు ఇంద్రుడు. మేము నిన్ను ఎందుకు చంపుతాము. మేమంతా నీకు మిత్రులుగా ఉంటాము అని అన్నారు వారు.


అయితే మంచిదే. మీరు దితి కుమారులు దైత్యులు అయినా మిమ్ములను దేవతా గణములలో చేర్చుకుంటాను, మీకు దేవత్వం ప్రసాదిస్తాను అని అన్నాడు ఇంద్రుడు. తరువాత 49 మంది మరుత్తులు, ఇంద్రుడు, దితి గర్భం నుండి బయటకు వచ్చారు. నేను ఒక్క కుమారుడిని అడిగితే ఇంతమంది ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయింది దితి. జరిగిన విషయం అంతా చెప్పి క్షమించమని కోరాడు ఇంద్రుడు. తన కుమారులు దేవతా గణములు అయినందుకు సంతోషించింది దితి. అప్పటి నుండి వారు వాయువుకు అధిష్ఠాన దేవతలుగా, మరుత్తులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ మరుత్తులు 49 మంది ఏడు గణాలుగా విభజింపబడ్డారు. వారినే మరుద్గణములు (వాతశక్తులు) అని అంటారు. ఈ 49 మనలో జీవశక్తిని ప్రసారం చేసే నాడులు అని కూడా అంటారు. ఈ నాడులలో ప్రవహించే జీవశక్తిని మరిచి అంటారు. అందుకే మరుత్తులలో మరీచిని అంటే జీవశక్తిని నేను అని అన్నాడు కృష్ణుడు. ఇది భాగవతపురాణంలో ఉన్న మరుత్తుల కధ.


ప్రకాశించే వారిలో నేను సూర్యుడను అని అన్నాడు. మనకు సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దైవాలు, సూర్యుడు పగలు ప్రకాశిస్తుంటాడు. తన కిరణాలతో వేడిని వెలుగును, ప్రాణశక్తిని జీవకోటికి ప్రసాదిస్తుంటాడు. అందుకే తన కిరణాలతో ఎక్కువ ప్రకాశాన్ని, వేడిని, వెలుగును ఇచ్చేవారిలో సూర్యుడను నేను అని అన్నాడు. అలాగే రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తుంటాయి. నక్షత్రాలు పరిమాణంలో పెద్దవి అయినా మిణుకు మిణుకు మంటూ ఉంటాయి కాని చంద్రుడు మాత్రం పెద్దగా ఉండి ఎక్కువ ప్రకాశాన్ని వెన్నెల రూపంలో వెదజల్లుతుంటాడు. ఓషధులకు, పంటలకు జీవం పోస్తుంటాడు. అందుకే ఎన్ని నక్షత్రాలు ఉన్నా వాటిలో ఎక్కువ ప్రకాశం ఇచ్చే చంద్రుడు. అందుకే రాత్రి పూట ప్రకాశించే వాటిలో చంద్రుడిని నేను అన్నాడు కృష్ణుడు.

                              ◆వెంకటేష్ పువ్వాడ.