హనుమంతుడు లేని రామాలయం
కడపజిల్లా మండలకేంద్రం ఒంటిమిట్టలో శ్రీసీతారామలక్ష్మణులు ఒకే శిలలో ఉన్నారు. కాబట్టి ఏకశిలానగరమని పేరు గాంచింది. భారతదేశంలో హనుమంతుడు లేని రామాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించినా, రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంటాయి. ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. పాత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు నిర్మించారని పురావస్తుశాఖ వారు తెలిపారు. మృకుండ మహర్షి, శృంగి మహర్షి యోగరక్షణ చేయాల్సిందిగా రాముని ప్రార్థించగా రాముడు, సీతా, లక్ష్మణులను తో కూడి యోగరక్షణ చేశాడని, అందుకు ప్రతిగా మృకుండ మహర్షి, శృంగి మహర్షి సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఎకశిలగా చెక్కించారని, జాంబవంతుడు ఈ ఏకశిలా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశాడని స్థల పురాణం చెబుతుంది.