శ్రీరాముడు చేసిన హనుమంతుని పూజ

 

 

శ్రీరాముడు చేసిన హనుమంతుని పూజ

 

పూర్వము శ్రీ రాముడు లక్ష్మణునితో కలిసి సీతను వెదుకుతూ ఋష్యమూకపర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ రాముడు సుగ్రీవునితో, హనుమంతునితో స్నేహము చేసెను. అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్పాడు ... "ఓ రామచంద్రా నీ భక్తుడను, సీతను వెదికే పనిని అప్పగించిన నీవు నేను ఒక మాట చెపుతాను విను'' అని చెప్పసాగాడు. "దేవేంద్రుడు తన వజ్రాయుధంతో నా దవడ మీద కొట్టడంతో నా దవడ వాచింది. అప్పటినుండి నన్ను హనుమంతుడు అని పిలుస్తున్నారు. వజ్రాయుధం దెబ్బతో మూర్ఛపోయిన నన్ను చూసి నా తండ్రి వాయుదేవుడు నా కుమారుడిని ఎందుకు కొట్టావు అని దేవేంద్రునిపై అలిగి గాలి వీచాకుండా చేసాడు. అప్పుడు లోకమంతా గాలిలేకపోవడంతో లోకమంతా స్తంభించిపోయింది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలు ప్రత్యక్షమై ఓ ఆంజనేయా నీకు అంతులేని పరాక్రమములు సంతరించుగాక, చిరంజీవిగా వర్థిల్లుగాక, రామకార్యము నెరవేర్చాల్సిన వాడివి నువ్వే, హనుమద్ర్వతమున నాయకుడవైన నిన్ను గొప్పగా ప్రతిష్టించి ఎవరు పూజిస్తారో వారికి సర్వకార్యాలు నెరవేరుతాయని వరమిచ్చి దీవించారు. సీతాన్వేషణలో ఉన్న నీవు ఈ వ్రతము ఇప్పుడు చేయకూడదని కూడా చెప్పారు అని చెప్పెను. కానీ రామ నా నీకు నచ్చినచో కార్యాన్ని సాధించడానికి ఆ వ్రతమును ఇప్పుడే చేయి'' అని పలికెను.
అప్పుడు ''హనుమంతుడు సత్యమే చెప్పాడు అని ఆకాశవాణి'' పలికింది. అది విన్న రాముడు హనుమంతుని వ్రతాన్ని చేయడానికి అంగీకరించి హనుమంతున్ని ఇలా అడిగాడు ఓ హనుమా .. ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు? దానిని ఎప్పుడు ఆచరించవలెను? చెప్పు అని అడిగాడు.
అప్పుడు హనుమంతుడు ఇలా చెప్పసాగెను ... "మార్గశిర మాసమున శుక్లపక్షమున జయప్రదమగు త్రయోదశి యందు పదమూడు ముళ్ళుగల తోరమును పసుపురంగు దానిని కలశమునందు ఉంచి, పిదప నన్ని ఆవాహన చేసి పూజించాలి. పసుపుపచ్చని గంధము, పుష్పములు, అలాంటి ద్రవ్యములే ముఖ్యమయినవి. 'ఓం నమో భగవతే వాయునందనాయ' అను మంత్రమును ఉచ్చరిస్తూ పదమూడు ముళ్ళువేసి ఆ మంత్రముతోనే షోడశోపచార పూజ చేయాలి. తరువాత శ్రోత్రియుడు అనే వాడికి ఉపచారములు చేసి ఉత్తమముగా వాయనమును పదమూడు అప్పములతో ఇవ్వాలి. గోధుమ అన్నమును ఇవ్వాలి. దక్షిణతో కూడిన తాంబూలము సమర్పిస్తూ సంపన్నులకు అన్నదానము చేయవలెను. ఈ వ్రతము ప్రారంభంలోనే కోరికలు నెరవేరుతాయి. దీనిని ప్రయత్న పూర్వకముగా పదమూడేడులు ఆచరించాలి. దీని ఉద్యాపన పదమూడు హనుమ ప్రతిమలతో పూర్తిచేయాలి అని చెప్పాడు. అప్పుడు రాముడు, లక్ష్మణునితోనూ, సుగ్రీవునితోనూ ఆ వ్రతాన్ని ఆచరించాడు. అదే విధంగా సుగ్రీవుడు, విభీషణుడు రాముడు ఆచరించిన విధంగానే ఆ వ్రతాన్ని చేసి మంచి సత్ఫలితాలను పొందారు. అప్పటినుండి లోకములో హనుమద్ర్వతము ప్రసిద్ధమైనది.