Read more!

తిరుమల లీలామృతం

 

తిరుమల లీలామృతం

తిరుమల అనగానే శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, బాలాజీ....శ్రీవారు, పెరుమాళ్ళు అని వివిధ నామాల్లో పిలవబడే భగవంతుడు అందరికీ గుర్తుకు వస్తాడు. శ్రీనివాసుడి గురించి, తిరుమల గురించి పురాణాల్లో ఎన్నో కథలున్నా అందరికీ గుర్తుకు వచ్చేవి పద్మావతీని  కల్యాణం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భువికి దిగివచ్చి ఆనందాద్రిమీద శ్రీనివాసుడై ఉన్నాడనే కాని, పన్నెండుకు పైగా పురాణాలు శ్రీనివాసుని గురించి, వేంకటాచలం గురించి, అక్కడి తీర్థాల గురించి, వాటి మహిమ గురించి, ఎందరో మహాత్ములు, పాపులు ఎలా సేవించి తరించిందీ వివరించారు.

అందరికీ అందుబాటులో ఉండేటట్లు తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు సునాయాసంగా పారాయణ చేసుకోవడానికి వీలుగా కథలరూపంలో తయారుచేయాలన్న తపనే 'తిరుమల లీలామృతం'.తిరుమల కొండమీద వేంకటేశ్వరస్వామి చతుర్భుజుడు. ఒక చేతిలో శంఖం, ఇంకో చేతిలో చక్రం, ఒకటి వరద హస్తం, ఇంకొకటి కటిహస్తం. ఇది తెలిసిందే. దర్శనం చేసుకున్నప్పుడల్లా ప్రతి భక్తుడూ చూసేదే....మరి ఆ శంఖచక్రాలు నిజంగా స్వామివారి విగ్రహానికి ఉన్నాయా? అన్నది కొంతమంది భక్తులకు మనస్సులో మెదిలే సమాధానం లేని సందేహం. మరి నిజం ఏమిటి?

ఈ రోజుల్లో సామాన్యభక్తుడికి స్వామివారి దర్శనం మహా అయితే ఒక సెకను అదృష్టం బాగుంటే ఐదు సెకండ్లు మరీ సిఫార్సు ఉంటే ఇంకో నిమిషం.ముందు జాగ్రత్తల భక్తుడిగా ఆర్జితసేవలు, అడ్వాన్సు బుకింగుచేసుకుని అర్చనో, తోమాలో, అభిషేకం టిక్కెట్టో తీసుకున్నా లేక విఐపిగా టిక్కెట్టు సంపాదించగలిగినా, అరగంట నుండి గంటవరకూ సేవ జరిగేటప్పుడు కూర్చుని మూలవరుల దర్శనం చేసుకోవచ్చు.

తోమాల అయినా, అర్చన అయినా చూడగలిగింది ముఖ్యంగా స్వామివారికి సమర్పించిన అలంకార నగలనే....గురు, శుక్రవారాల్లో కొన్ని గంటలు తప్పవారంలో ఎప్పుడైనా చూడగలిగింది స్వామివారి ముఖం మాత్రమే....అది కూడా పూర్తిగా కాదు. కర్పూరనామం స్వామివారి కళ్ళు, ఫాలభాగం కప్పివేస్తే, ముఖంలో కొద్దిభాగం మాత్రం చూడగలరు. మిగతా విగ్రహం పాదాలతోసహా పూర్తిగా నగలతో, పట్టువస్త్రాలతో కప్పబడి వుంటుంది.

గురు, శుక్రవారాల్లో మాత్రం నిజపాద దర్శనం, నేత్రదర్శనం...అభిషేక సమయంలో పాలాభిషేకానికి విగ్రహానికి నడుము ప్రదేశానికి లంగోటీలా చిన్న వస్త్రాన్ని సమర్పించినా, సుగంధ పరిమళజలాల స్నానమప్పుడు ఆ లంగోటీ కూడా ఉండదు. స్వామివారి పూర్తి ఆకారాన్ని ఒక ఇరవై నిమిషాలపాటు శుక్రవారం ఉదయం అభిషేకంలో చూడవచ్చు. స్వామివారి విగ్రహాన్ని ఆ సమయంలో చూసినా వర్ణించడం అసంభవం.

కిరీటం నుండి పాదాలవరకు చక్కని శిల్పచాతుర్యంతో ఆభరణాలు, వస్త్రాలు, ఆయుధాలతో అలరారుతున్న మహామూర్తిని చూడవచ్చు. నాగాభరణాలు, జటా జుటాలు, చేతులకు కంకణాలు, మొలలో చిన్న కత్తీ, వక్షస్థలంలో శ్రీమహాలక్ష్మీ...ఇలా స్వామివారి వైభవం చూడాలేకాని మాటలలో చెప్పలేము.