Read more!

దివ్య తిరుపతి జమలాపురం

 

దివ్య తిరుపతి జమలాపురం

108 దివ్యమైన తిరుపతి క్షేత్రాలలో జమలాపురం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రం నుంచి సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. కలియుగదైవమైన శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసిన గొప్ప క్షేత్రం ఇది. ఇక్కడ స్వామీ సాల గ్రామరూపుడై భక్తులను ఆడుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 625వ సంవత్సరంలో ప్రతాపరుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్ర. ఈ క్షేత్రంలోనే జాబిలిమహర్షి తపస్సు చేసి, ఈ ప్రదేశంలో ప్రతిష్టింజేసాడని మరొక పురాణ కథనం. జమలాపుర క్షేత్రంలో నేటికీ ఈ మహర్షి చేత నిర్మించబడిన పుష్కరిణి సకల పాపహరిణిగా పవిత్రను పొందింది. అనంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని పునరుద్దరించాడు.

పూర్వం అక్కుభట్టు అనే అర్చకుడు స్వామివారిని సేవిస్తుండేవాడు. కాలక్రమంలో ముసలితనం పైబడటం వల్ల స్వామికి పూజా దికాలను చేయలేకపోయేవాడు. అక్కుభట్టు తన అసహాయతకు చింతిస్తూ, 'స్వామీ! నీకు ఆకలైతే నువ్వే కొండ దిగివచ్చి నైవేద్యాన్ని ఆరగించు' అని వేడుకోసాగానే, స్వామివారు అదృశ్యవాణి రూపంలో సరేనన్నారు. అయితే అక్కుభట్టు తాను కొండదిగి వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడరాదని స్వామివారు షరతు విధించారు.

స్వామివారి మాట ప్రకారం అక్కుభట్టు ముందు, ఆయన వెనుక స్వామివారు కొండదిగి రాసాగారు. అప్పుడు ఆ విప్రునికి ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దమేమిటని అక్కుభట్టు వెనక్కి తిరిగిచూడగా, అక్కడ బంగారు రంగులో ప్రకాశిస్తున్న పాదముద్ర కనిపించింది. ఆ విధంగా స్వామివారు సాలగ్రామ రూపమేత్తి 'సూచీగిరి' గా పిలువబడే జమలాపురం  గుట్టపై వెలిశాడు.

ఈ క్షేత్రంలోనే అర్జునుడు, శివుని వేడుకొని తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందడం వల్ల, ఈ ప్రాంతాన్ని విజయక్షేత్రమని కూడా అంటారు. 1900 ప్రాంతంలో తాడేపల్లి ప్రభువైన శివరాజు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ఆలయాన్ని బాగు చేయించారు. అనంతరం 1966వ సంవత్సరంలో మరలా పునర్ నిర్మించారు. 1976లో సంవత్సరంలో మరొకసారి పునర్ నిర్మించారు. 1976లో శృంగేరి పీఠాధిపతులు మహా సంప్రోక్షణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ ఓ కళ్యాణమంటపాన్ని నిర్మించారు. స్వామివారికి నిత్యసేవలు జరుగుతున్నాయి.

చైత్ర శుద్ధ సప్తమి, మహర్నవమి, వసంతనవమి వంటి విశేష పర్వాలలో ఇక్కడి వాతావరణం తిరుమలను గుర్తుకు తెచ్చేవిధంగా ఉంటుంది.