దానం గురించి వ్యాసుడు చెప్పిన విషయాలు ఇవే..!
దానం గురించి వ్యాసుడు చెప్పిన విషయాలు ఇవే..!
మనం ఇతరులకు సహాయ, సహకారాలు అందించడం, మనకు ఉన్నంతలో కొంత ఇతరులకు ఇవ్వడం మన సహజమైన స్వభావం. మన మనస్సు పవిత్రం అయ్యే కొద్దీ ఈ స్వభావం మనలో పెరుగుతుంది. మనం స్వార్థపరులం అయ్యేకొద్దీ ఈ స్వభావం తగ్గుతుంది. "ఈ కలియుగంలో చేయాల్సిన కర్మ ఒక్కటే ఉంది. అదే దానం" అని వ్యాస మహర్షి చెబుతారు.
మనం ఎందుకు దానం చెయ్యాలి? మనం కష్టపడి సంపాదించుకున్నది మనమే అనుభవించవచ్చు కదా! ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కటే! ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. మనం దానం చేయడం ద్వారా స్వయంగా భగవంతునికి సేవ చేసే సదవకాశం మనకు కలుగుతుంది. "ఇచ్చేవాడు (దాత), స్వీకరించేవాడికంటే (గ్రహీత) అల్పమైనవాడు. ఎందుకంటే స్వీకరించేవాడు ఆ సమయానికి స్వయంగా భగవంతునితో సమానం!" అని స్మృతులు చెబుతాయి. అందుకే మనం చేసే దానం మీదా, దయా, దాక్షిణ్యాల మీదా ఇతరులు ఆధారపడి ఉన్నారన్న అపోహను, అహంకారాన్ని వదిలి, దానం చేసే అవకాశం ఇచ్చినందుకు మనం వారి పట్ల కృతజ్ఞులమై ఉండాలి. దానాన్ని ఇలా వర్గీకరించారు.
ఉన్నతమైన దానం :
అన్ని దానాల కంటే ఉన్నతమైనది 'ఆధ్యాత్మిక జ్ఞానదానం'. తరువాత 'విద్యాదానం'. తరువాత 'ప్రాణదానం'. నాలుగవది 'అన్నదానం'. ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం జనన, మరణాలకు అతీతంగా అనంతమైన ఆనందాన్ని అనుభవించగలం. అందుకే, ఇది అన్నిటికంటే ఉన్నతమైనది. అయితే, ఆకలితో అలమటిస్తున్న వారికి 'వేదాంతం' చెప్పడం అవివేకమే అవుతుంది. అందుకే సరైన వ్యక్తికి, సరైన విధంగా, సరైన సమయంలో దానం చెయ్యాలి.
మనపై విదేశీయులు దాడి చేసినప్పుడూ, మన సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నం చేసినప్పుడూ మనం వారికిచ్చిన బహుమతి ఆధ్యాత్మిక సంపద. ఇప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేది మనదేశమే.
నిస్వార్థదానం..
"ఎవరి చేతులైతే ఎప్పుడూ ఇవ్వడానికై సిద్ధంగా ఉంటాయో వారు ఉన్నతమైన వారు" అని స్వామి వివేకానంద చెబుతారు. ఇతరులకు ఇచ్చే ప్రయత్నంలో ఆకలితో మరణించినట్లయితే ఆ ముహూర్తంలోనే మనం ముక్తి పథానికి చేరుకోగలం. మహాభారతంలో దీనికి చక్కని ఉదాహరణ ఉంది.
ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు అతని భార్య, కొడుకు, కోడళ్ళతో నివసిస్తున్నాడు. వారు చాలా పేదవారు. ఇతరులకు బోధించగా వచ్చిన కాస్త ఆదాయంతోనే వారు జీవితాన్ని గడుపుతున్నారు. ఒకసారి మూడు సంవత్సరాల పాటు 'కరువు' రావడంతో వారి కష్టాలు మరింత పెరిగాయి. వారు కొన్నాళ్ళు పస్తులున్నాక ఒక ఉదయం ఆ పేద బ్రాహ్మణుడు, తాను చాలా కష్టపడి సంపాదించిన కొంత ఆహారాన్ని తీసుకొచ్చి, దాన్ని నాలుగు భాగాలుగా చేశాడు. వారు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎవరో తలుపు కొట్టారు. తలుపు తీసి చూడగా ఒక అతిథి ఎదురుగా నిల్చున్నాడు. బ్రాహ్మణుడు వెంటనే అతన్ని సాదరంగా ఆహ్వానించి, తన వంతు భోజనాన్ని అతని ముందుంచాడు. అతిథి వెంటనే ఆహారాన్ని స్వీకరించి, “నాకు పదిరోజుల నుండి తిండి లేదు. మీరిచ్చిన ఈ కొద్ది ఆహారం నా ఆకలిని మరింత పెంచింది” అన్నాడు. వెంటనే బ్రాహ్మణుని భార్య తన భర్త ఆరంభించిన యజ్ఞాన్ని కొనసాగించడానికై తనవంతు ఆహారాన్ని అతిథికి అర్పించింది. అతను ఇంకా తృప్తి చెందలేదు. బ్రాహ్మణుని కుమారుడు, తరువాత అతని భార్య కూడా తమ వంతు ఆహారాన్ని అతిథికి సమర్పించారు. ఇప్పుడు అతిథి తృప్తి చెంది, వారిని ఆశీర్వదించి, సెలవు తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ నలుగురూ ఆకలితో మరణించారు".
ఇంత నిస్వార్థంగా దానం చేసే స్వభావం మనలో ఎంత మందికి ఉంది? అతిథులను ఆదరించడం మాట అలా ఉంచితే కన్న తల్లితండ్రులను ప్రేమతో చూసుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా మందికి తలకు మించిన భారమవుతోంది. మనం ఎంత దానం చేశామని లెక్కలు పెట్టేకన్నా ఎంత నిస్వార్థభావంతో దానం చేస్తున్నామన్న విషయానికి ప్రాధాన్యమిస్తే గొప్ప వ్యక్తులుగా నిలవగలం.
*నిశ్శబ్ద.