మహాశివతత్త్వం

 

మహాశివతత్త్వం

 

 

విందు భోజనాలప్పుడు విరూపాక్షునికి ఆహ్వానం ఉండదు. విషాహారం తినాల్సి వచ్చినప్పుడు మాత్రం అతనికే అగ్రాసనం. పట్టుపీతాంబరాలు పంపిణీ చేసేటప్పుడు పరమశివుణ్ణి ఎవరూ పట్టించుకోరు. కరిచర్మం కట్టబెట్టాల్సివచ్చినప్పుడు మాత్రం ఆ వెర్రిబాగులవాడే అడ్డంగా దొరుకుతాడు. గంగస్నానాలకు అందరూ తయారే. ఆ అమ్మ ఫెళఫెళమంటూ భూమికి దిగేటప్పుడు మాత్రం ఈశ్వరుడే నెత్తికెత్తుకోవాలి. శంకరుడంతటి బోళా భగవంతుడు వేరెక్కడా కానరాడు. శంకరునివంటి అల్పసంతోషి మరోచోట అగుపించడు. అలాంటి భక్తసులభుడు దొరకడమూ కష్టమే. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చు కుంటాడు శివుడు. అయినా ఆయనను పల్లెత్తుమాటయినా అనని మహాఇల్లాలు పార్వతి. మోకరిల్లి మొరపెట్టుకుంటే చాలు ... వశుడై పోతాడు ... పరవశుడైపోతాడు.

 

 

భస్మాసురుడు అలాగే కదా... నీలకంఠుణ్ణి బుట్టలోవేసి వరాన్ని పొందింది! ఎవరి తలమీద చెయ్యిపెడితే వాడే బుగ్గయి పోతాడన్న భరోసా దక్కించుకున్నది! శివుని శిరస్సుమీదనే హస్తాన్ని ఆనించి వరబలాన్ని పరీక్షించుకోదలిచాడు. అప్పుడిక ఆ రాక్షసుని బారిన బడకుండా తప్పించుకునేందుకు నానాయాతనా పడ్డాడు. పరుగు లంకించు కున్నాడు. ఇక్కడే ఒకానొక ధర్మసూక్ష్మం కూడా దాగి ఉందని గమనించాలి. చెడ్డవాడిపట్ల చతురతతో మెలగడం మనిషిదనం. దుర్మార్గుణ్ణీ ప్రేమించ గలగడం దైవత్వం. గిరిజాపతి అసలైన దైవం గనుకనే అసురుల విషయంలోనూ ప్రేమను ప్రకటించగలిగాడు. ఆ దిశగా యోచన చేసి తీరాలంటూ మానవాళికి చెప్పకనే చెప్పాడు.

పేదల నేస్తం...

 

 

 

భారతావని ఇప్పటికీ బీదల దేశమే. ఉన్నవారికి బాగానే ఉంటుంది. లేనివారికి అసలేమీ ఉండదు. ఈ లేనివాళ్లే నేలమీద దండిగా ఉన్నారు. వీరంతా ఖరీదైన పూజలు చేయలేరు. విలువైన నైవేద్యాలూ అర్పించలేరు. కడుపులో ఆకలి అలమటిస్తుంటే, గంట కొట్టి హారతులెక్కడ ఇవ్వ గలరు! ఇలాంటి బడుగులకు త్రినేత్రుడే సరైన వేలుపు. చక్రపొంగలి అవసరం లేదు. పులిహోర ప్రసక్తేలేదు. పాయ సాన్నాలు చేయించనక్కరలేదు. నాలుగు చెంబుల నీళ్లు గుమ్మరిస్తే శివుడు వారి వశమైపోతాడు. నాలుగు మారేడు దళాలు తేగలిగితే పట్టలేనంత సంతోషపడిపోతాడు. ఆ మీదట విభూది తీసుకుని ఆయనకో బొట్టు పెట్టి మన నుదుటన కాసింత పూసుకుంటే ఇకనేం, మనకు వెన్నుదన్నవుతాడు. అందుకే బలహీనులకు ప్రీతికరమైన దైవస్వరూపమై యుగాలు గడుస్తున్నా విరాజిల్లుతున్నాడు.

నిరాడంబరుడు...

 

 

 

మహేశ్వరుడు నిరాడంబరుడు. చర్మం కట్టుకుని తిరుగుతుంటాడు. బిచ్చమెత్తు కుని బతుకుతుంటాడు. కాష్టాలవాడలో కాపురముంటాడు. ఆభరణాలు వేసుకోడు. విషపునాగులను మెడనిండా మాలలుగా ధరించి చిందులేస్తుంటాడు. రుద్రాక్షల్ని దండలుగా గుచ్చుకుని అలంకరించుకుంటాడు. శివుని సిగపాయలో చంద్రుడున్నాడని ఆనందిద్దామంటే అదీ కుదరదు. ఆ జుట్టును పట్టుకు వేలాడే శశాంక, వెన్నెలసోనలు కురిపించే నిండు జాబిలేం కాదు. కళలు తప్పిన సన్నని చంద్రరేఖ. రంకెలేసే ఎద్దునెక్కి ఊరేగుతాడు. శివుణ్ణి సేవించే వారయినా నాడెమయినావారా అంటే... నందికి నందీ అంతే. భృంగికి భృంగీ అంతే. ఒకటో రకం ప్రమథ గణం. చూసి రమ్మంటే కూల్చి, కాల్చి, పీల్చి వచ్చే రకం. ఈ స్కంధావారాన్ని పట్టుకునే పర్వత రాజింటికి పెళ్లికొడుగ్గా ధూంధాంగా తరలి వెళ్లాట్ట రుద్రమూర్తి. విడిదింట ఈ దండు మొత్తాన్నీ చూసి పెళ్ళిపెద్దలు గాభరా పడిపోయారట.

 

 

పర్వతరాజు వీరిని ఎలా సంభాలించుకురాగలడోనని, పార్వతి జీవితం ఇకమీదట ఎలా సాగుతుందోనని వాపోయారట. ఇంత నాసిరకం జీవితాన్ని గడుపుతున్నవాడు ఏం సందేశ మివ్వగలడని ఆయనను గురించి మనం సందేహపడవచ్చు. అక్కడే ఉంది అసలు కిటుకు. కలియుగంలో మానవుల సంగతి చంద్రమౌళికి తెలిసినట్టుగా మరొకరికి తెలీదు. వంద చెబితే ఒకటో రెండో అర్థమయ్యే జాతి మనది. రీతి మనది. అంతకు మించిన మందబుద్ధి మనది. కాబట్టే తాను దిగజారినట్టు కనిపిస్తూనే, ఆకాశం మీద నడవకండర్రా, నేలమీద నడవండి, మామూలు మనుషులుగా మెలగండి, అంతర్ముఖులై జీవించండి అనే హితోక్తులను తన వర్తన ద్వారా ఆయన అందరికీ చెబుతున్నాడన్నమాట.

మహాదేవుడు..

 

 

ఈశ్వరునిలోనూ మనిషికి మల్లేనే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కోపం, కరుణ హాస్యం, లాస్యం, ప్రేమ, అనుగ్రహముంటుంది. తనను ఒకింటివాడిగా చేద్దామని ప్రయత్నించిన మన్మథుణ్ణి దహించి వేస్తాడు శంకరుడు. ఆ మదనుని సతి రతీదేవి బ్రహ్మవద్దకు వెళ్ళి మొరపెట్టుకున్న తరువాత కానీ శంకరుడు మదనుడికి మరోజన్మ దక్కింది. ఈశ్వరుడు కోపంతో చేసినా, చేసిన ప్రతీ పనీ జగత్కళ్యాణ కారకమవుతుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఇలా శివునికీ మనలాంటి లక్షణాలే ఉన్నాయంటే అందుకో హేతువు లేక పోలేదు. ఎవరైనా ఎవరితోనయినా సరిపోల్చుకోవాలంటే పోలికలుంటేనే సులువవుతుంది. మనలాంటి వాడే శివుడూ అను కుంటేనే అతగాణ్ణి పలకరిస్తాం, నమస్క రిస్తాం. ఆయనలోనికి వెళ్లడం మొదలెడతాం. ఆయన తత్వాన్ని మన సత్వంగా మలచుకుంటాం. మహనీయులుగా రూపాంతరం చెందుతాం. ఇంతటి మార్మిక, తార్కిక సిద్ధాంతం పార్వతీసతిలో లీనమై ఉంది. సాక్షాత్తూ శంకర భగవత్పాదులే ‘‘శివ’’ అనే రెండక్షరాలు పలికితే పాపాలన్నీ పటాపంచలయి పోతాయని చెప్పారు. ఇహపరాల్లో భోగాలన్నీ పొంద గలుగుతామనీ తెలిపారు.

స్త్రీ వాది..

 

 

శివుణ్ణి మించిన స్త్రీ పక్షపాతి మరొకరుండరు. ఆకాశంలో సగం ఆడవారని మనం ఇప్పుడు చెబుతున్నాం. యుగాలనాడే ఈ వాదన వినిపించడమే కాదు, ఆచరణకు దిగిన అష్టమూర్తి ఆయనే. తనలో సగభాగాన్ని అర్థాంగి కిచ్చానంటూ ఈశ్వరుడెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా, స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది. అలా ఆమె కలవడానికి అనువుగా మనసా వాచా కర్మణా తనను తాను మార్చుకో గలిగాడు. అంతెందుకు! ఇంటి ద్వార పాలకునిగా పార్వతమ్మ నియమించుకున్న బాలుణ్ణిత్రిశూలంతో రెండు ముక్కలుగా చేసేస్తాడు శంకరుడు. విషయం తెలిసి ఘొల్లుమంటుందామె. తల్లడిల్లిపోతాడు అభవుడు. భార్యకు తనవల్ల కలిగిన దుఃఖానికి పరితపించిపోతాడు. ఆమె ఆనందం కోసం ఏనుగు తలను తెచ్చి మరీ పిల్లాడికి అతికించి వినాయకునిగా అక్కున చేర్చుకుంటాడు. గణపతిగా అధికారాన్ని కట్ట బెడతాడు.

 

 

సతికి అంతగా విలువనిచ్చే పతి శివుడు. ఇంకా చెప్పాలంటే. ప్రదోషవేళలో నటరాజుగా నృత్యకేళీవిలాసాల్లో తేలుతున్నప్పుడూ శంకరుడు ఒంటరి కాదు. తానొక్కడే ఆడిపాడి ఆనందించడు. తుహినదుహితతో కలిసే నర్తిస్తూ మహదానందభరితుడవుతాడు. భార్యను తనతో కలిసి నృత్యం చేసేందుకు అంగీకరించిన అరుదైన ప్రేమస్వామి ఆయనే. ఆ ఆటను చిత్కళగా భావించి గౌరవిస్తాడు. అర్ధనారీ శ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఈ నిప్పు కంటి దైవానికి మించిన మహిళావాది ఎవరుంటారు!

ఆది దంపతులు..

 

 

 

శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీ దేవి హిమవంతుని కూతురు. కలిగిన వారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగ భాగ్యాలు అనుభవించింది. జంగ మయ్యను చేరాక అదంతా మటు మాయమైపోతుంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ అంటూ ఊరంతా తిరుగుతుంటారు భర్తగారు. వల్లకాడులో సంసారం నడపమంటాడు. రూపం కూడా ఎగుడు దిగుడు నేత్రాలతో ఉంటుంది. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా ఆయనను పల్లెత్తుమాటయినా అనని మహాఇల్లాలు పార్వతి. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పెనిమిటి ఈ పని చేశాడని అర్థం చేసుకోగలిగింది. భృంగివంటి సేవకులకు తనకంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న సమయాలు ఎదురైనా మరోలా అనుకోలేదు. ఉడుక్కో లేదు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచని ఆయన వర్తనను గర్వంగా చెప్పుకుంది.

 

 

క్షీరసాగరమథనం వేళ అమృతం పుడితే ఎవరో తాగుతారట. కామధేనువు, కల్పతరువు బయల్పడితే ఇంకెవరో తీసుకుని సుఖిస్తారట. కాలకూటం వెలువడి నప్పుడు ఎవరూ పట్టించుకోరట. తన భర్తే దానికి ఎదురేగి తటాలున మింగేయాలట. కట్టుకున్నవాడు చేస్తున్న పని ప్రపంచానికి మేలు చేసేదయినప్పుడు తన పసుపు కుంకుమలకు ఢోకా ఉండదన్న ధైర్యం ఆమెది. లయకారకుడయిన పతిని ఏ విషమయినా ఏం చేయగలుగుతుందని తనకు తనే సమాధానం చెప్పుకుంటుంది. తను సర్వమంగళ అయినప్పుడు చింత ఎందుకని సంభాళించుకుంటుంది. శివుడు నిశ్చలంగా విషాన్ని సేవిస్తుంటే పక్కన అంతకంటే నిశ్చింతగా నిలవగలుగుతుంది. స్థాణువులాంటి భర్తను రాగమయునిగా, అనురాగమయునిగా చేయగలుగుతుంది.

 

 

శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను ప్రశ్నించనూ లేదు. తనకేమీ ఆశలు లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట, బాట. ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆమెవే అనుకునేవాడు. ఈశ్వరుడు జడధారిగా, తోలుదుస్తులతో నడయాడినా అమ్మవారు ఎప్పుడూ అలా ఉండదు. మహారాణిలా ఉంటుంది. ఏడువారాల నగలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆది దంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.