పరమశివుని రూపంలో పరమార్ధం
పరమశివుని రూపంలో పరమార్ధం
మెడలో సర్పం, శిరస్సుపై గంగ - కుండలిని జాగృతిని సూచిస్తున్నాయి. శివనామంలోని మూడుగీతలు - జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. మద్యబింధువు తురీయావస్థకు ప్రతీక. అలానే శివుని మూడో నేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఇడా, పింగళ, నాడులకు సంకేతాలు. పాక్షికంగా మూయబడిన కళ్ళు ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితికి దర్పణం. శివుడు ఆదిగురువు, యోగ గురువు. శివుని వృత్తి భిక్షాటన, ఆసనం పులి చర్మం, ధరించేది గజచర్మం, నివసించేది స్మశానం (వైరాగ్యానికి సూచన) ఆయన దగ్ధం చేసింది మదాకారం.... ఇవన్నీ జన్మ బంధ విమోచనలకు మార్గాలకు సూచనలు.
లింగాభిషేకములో పరమార్ధం :-
పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.
శివలింగం :-
నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం".