మాఘమాసంలో వచ్చే విశిష్టమైన శ్యామలా నవరాత్రులు ఎవరు చేయాలి.. ఎవరు చేయకూడదు!

 

మాఘమాసంలో వచ్చే విశిష్టమైన శ్యామలా నవరాత్రులు ఎవరు చేయాలి.. ఎవరు చేయకూడదు!

హిందూ ధర్మంలో దేవతారాధనకు చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా అమ్మవారిని పూజించడం చాలా ప్రాముఖ్యత పొందింది. తెలుగు ఏడాదిలో చాలామందికి శరన్నవరాత్రులు మాత్రమే తెలుసు. కానీ ఏడాదిలో నాలుగు నవరాత్రులు జరుగుతాయి.  వీటిలో శరన్నవరాత్రులను అందరూ సమూహంగా జరుపుకుంటే.. మిగిలిన నవరాత్రులను గుప్తంగా చేసుకుంటారు. అంటే.. ఎవరికి వారు  ఇళ్లలో చేసుకునే నవరాత్రులు ఇవి.  వీటిలో మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు ముఖ్యమైనవి. శ్యామలా దేవి చాలా మహిమాన్వితమైనది.  అయితే గుప్త నవరాత్రులు కావడం చేత వీటిని ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే విషయం తప్పక తెలుసుకోవాలి.  పొరపాటున కూడా అమ్మవారినిని పూజించే విషయంలో తేలికగా తీసుకుని తప్పులు చేయకూడదని,  దాని వల్ల అమ్మవారి అనుగ్రహానికి బదులు,  ఆగ్హహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతున్నారు పురాణ పండితులు.  దీని గురించి తెలుసుకుంటే..

శ్యామలా నవరాత్రులు..

శ్యామలా నవరాత్రులు చాలా విశిష్టమైనవి.  మాఘమాసపు పాడ్యమి నుండి నవమి వరకు చేసుకునేవే శ్యామలా నవరాత్రులు. శ్యామలా దేవి సాధారణంగా విపరీతమైన శక్తి దేవత.  చాలామంది సాధకులు ఈ అమ్మవారిని వామాచార పద్దతిలో ఆరాధిస్తారు.  ఇందులో సాధనలు చాలా తీవ్రంగా ఉంటాయి.  అయితే సాత్వికంగా కూడా ఈ అమ్మవారిని ఇంట్లో పూజించుకోవచ్చు.  

ఆరాధన..

శ్యామలా దేవిని ఆరాధించడానికి  ఇంట్లో చాలా మంచి వాతావరణం ఉండాలి. ముఖ్యంగా అంటు, ముట్టు ఉండకూడదు.  

ఇంట్లో అమ్మవారి విగ్రహాలను ఎట్టి పరిస్థితులలో పెట్టుకోకూడదు.  కావాలంటే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.  అమ్మవారిని పూజించే రోజుల్లో ఇంట్లో గొడవలు, కొట్లాటలు. ఇతరులను నిందించడం, బాధపెట్టడం, హింసించడం వంటి చేయరాదు. అలాగే అమ్మవారు అంటే ప్రకృతి స్వరూపమే.. ఆ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ప్రకృతిని కూడా గౌరవించాలి. ప్రకృతికి ఎలాంటి నష్టం చేకూర్చకూడదు.  

అమ్మవారికి సాధారణంగా షోడశోపచార పద్దతిలో పూజ చేయవచ్చు.  కుదరని వారు అమ్మవారికి పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు.  అది కూడా కుదరకపోతే ప్రతి రోజు శుద్దిగా ఉంటూ శ్యామలా దండకం,  శ్యామలా అష్టోత్తరం చేసుకోవాలి.

నిప్పుతో ఆటలు వద్దు..

చాలామంది ఆమె అమ్మవారు, మనకు అమ్మ కదా.. మనం తప్పు చేస్తే క్షమించదా,  మనం ఎలా ఆరాధించినా తను మన పూజను స్వీకరించదా అని అనుకుంటారు. అలా అనుకునే చాలామంది అంటు ముట్టు గురించి, మడి పద్దతుల గురించి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా అమ్మను పూజిస్తుంటారు.  

నిప్పుతో చెలగాటం ఆడకూడదని పండితుల అభిప్రాయం.  నేను నిప్పును ముట్టుకుంటాను, కానీ అది కాలకూడదు అంటే కుదరదు కదా అనేది పండితులు చెప్పే మాట.

నైవేద్యం..

శ్యామలా అమ్మవారికి సాధారణంగా వెన్నను నైవేద్యంగా పెడితే మంచిది. ఒక వేళ వెన్న దొరకలేదని,  కుదరని వారు అమ్మవారికి సాధారణంగా నవరాత్రులకు అమ్మవారికి పెట్టినట్టు నైవేద్యం పెట్టవచ్చు.  

ప్రవర్తన..

శ్యామలా నవరాత్రులు చేసుకునేవారు ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఒక వైపు అమ్మవారిని పూజిస్తూ మరొకవైపు ఇతరులతో చెడుగా మాట్లాడటం, చెడుగా ప్రవర్తించడం వంటివి చేస్తే ఆ అమ్మ చూస్తూ ఊరుకోదని అంటున్నారు పండితులు. పిల్లలు చెడు అలవాట్లు,  చెడు సావాసాలు, తప్పులు చేసినప్పుడు కన్నతల్లి ఎలాగైతే దండించి,  నాలుగు పీకుతుందో.. అలాగే తనను ఆరాధించే రోజుల్లో తప్పు పనులు చేసేవారిని శ్యామలా దేవి దండించి తీరుతుంది.  

సాధారణ రోజుల్లో..

శ్యామలా దేవిని సాధారణ రోజుల్లో కూడా పూజించవచ్చు. అమ్మవారిని సాత్వికంగా పూజిస్తూ, ప్రతిరోజూ స్నానం చేసి, శుద్దిగా ఉంటూ, భక్తితో శ్యామలా దండకం పఠిస్తూ ఉంటే ఆ అమ్మ అనుగ్రహం లభిస్తుంది.  

శ్యామలా దేవి జ్ఞానాన్ని ఇస్తుంది,  ఎలాంటి పరిస్థితులలో అయినా సరైన విధంగా ఆలోచించగలిగే శక్తిని ఇస్తుంది. పిల్లలకు అయినా, పెద్దలకు అయినా ఈ అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, యుక్తితో దాటగలుగుతారు. కాబట్టి శ్యామలా నవరాత్రులను వదులుకోకండి.

                                 *రూపశ్రీ.