మాఘ స్నానం చేయలేకపోతున్నారా.. ఈ విషయాలు తెలుసా!

 

మాఘ స్నానం  చేయలేకపోతున్నారా.. ఈ విషయాలు తెలుసా!

హిందూ ధర్మంలో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  స్నానం చేయకుండా ఎలాంటి జపం,  తపం చేయరు.  పూజలు,  పునస్కారాలు అన్నీ స్నానం చేసినప్పుడే చేస్తారు. కార్తీక మాసం,  మాఘ మాసంలో వేకువ జామునే స్నానాలు చేయడం పరిపాటి. ఇలా బ్రహ్మ ముహూర్తంలోనే స్నానాలు చేయడం,  దీపారాధన చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం చాలా సులువుగా పొందుతారని చెబుతారు.  మాఘ మాసంలో మాఘ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్య ఫలం గురించి మాఘ పురాణంలోనే వివరించబడింది.  అయితే స్నానం చేయడంలో కూడా పలు రకాలు ఉన్నాయి.  వేకువ జామున లేచి సముద్రం, నది, సరస్సు మొదలైన ప్రాంతాలలో స్నానం చేయలేని వారు కొందరు ఉంటారు.  అనారోగ్యాల కారణంగా లేదా వృద్దాప్యం కారణంగా స్నానం చేయలేని వారు ఉంటారు.  ఇలాంటి వారి గురించి పురాణ గ్రంథాలలో స్నానం చేసే విభిన్న పద్దతులు పేర్కొన్నారు. ఈ విభిన్న పద్దతులలో స్నానం ఆచరించినా సరే.. మాఘ స్నానం ఆచరించినంత పుణ్యం కలుగుతుందట.  ఇంతకీ స్నాన విధానాల గురించి తెలుసుకుంటే..

మాఘ పురాణంలో స్నాన విధానాల గురించి కింది విధంగా వివరించారు..

మంత్ర స్నానం..

వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం మంత్ర స్నానం అవుతుంది.

వాయువ్య స్నానం..

కొందరు అనారోగ్యం కారణంగా స్నానం చేయలేరు,  అలాగే కొందరికి అనారోగ్యం కారణంగా స్నానం నిషేధించి ఉంటారు. అలాంటి వారు ఆవు గిట్టలు తగిలి నేల నుండి పైకి లేచిన దుమ్మును.. దీన్నే గోధూళి అంటారు.  ఈ గోధూళిని శరీరం పైన చల్లుకుంటే అది వాయువ్య స్నానం అని పిలవబడుతుంది.

ఆగ్నేయ స్నానం..

స్నానం చేసే అవకాశం లేనప్పుడు విభూతిని ఒంటికి రాసుకుంటే అది ఆగ్నేయ స్నానంగా పిలవబడుతుంది.

కాపిల స్నానం..

శరీరంలో నడుము నుండి పాదాల వరకు స్నానం చేసి, పై భాగాన్ని తడి బట్టతో తుడుచుకోవాలి. దీన్ని కాపిల స్నానం  అని అంటారు.

ఆతప స్నానం..

ఎండలో నిడబడి సూర్యరశ్మితో శరీరాన్ని శుద్ది చేసుకుంటే దాన్ని ఆతప స్నానం అంటారు.

వారుణ స్నానం..

సాధారణంగా నీటిలో స్నానం చేస్తే దాన్ని వారుణ స్నానం అంటారు.

మానస స్నానం..

విష్ణువును మనసులో స్మరిస్తూ.. స్తుతులతో నామస్మరణ చేస్తూ మనఃపూర్వకంగా భగవత్ ధ్యానంతో ఉండి చేసే స్నానాన్ని మానస స్నానం అని అంటారు.  అన్ని స్నానాలలోకెల్లా ఇది చాలా ఉత్తమమైనదని చెబుతారు.

  శరీర ధ్యాస లేకుండా కేవలం భగవంతుడిని స్మరించడాన్ని మానస స్నానమని కొందరు చెబుతారు.  నీటితో స్నానం చేస్తే అది శరీరాన్ని శుభ్రం చేసినట్టు,  భగవంతుడిని స్మరిస్తే అది మనసును శుద్ది చేస్తుందని, అందుకే దీన్ని మానస స్నానం అని అంటారని మరికొందరు అంటారు.


తెలుసుకోవలసిన నిజం..

మనిషి ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే.. ఆ భగవంతుడిని ధ్యానించడానికి పై స్నాన పద్దతులను పెద్దలు, మునులు ఏర్పరిచారు.  పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తులకు అందుబాటును బట్టి సులభమైనవే.. చాలామంది పుణ్య మాసాలలో స్నానం చేయడం అంటే అదేదో కష్టతరమైన విషయం అనుకుంటారు. కానీ భగవంతుడి మీద మనసు ఉంటే అన్నీ సులువే.. చేస్తేనే భగవంతుడి కృప లభిస్తుంది.

                                             *రూపశ్రీ.