ధ్యాన యోగం రహస్యమిదే...

 

ధ్యాన యోగం రహస్యమిదే...

ధ్యానం అనే మాట పరమపథసోపానాలలో మొదటిది, చివరిది. ఎందుకంటే ఏ యోగానికైనా, ఏ తపస్సుకైనా ఒక ధ్యానముద్ర అవసరం. అది పద్మాసనం కావచ్చు. సుఖాసనం కావచ్చు, సిద్ధాసనం కావచ్చు, శవాసనం కావచ్చు. ఈ నాలుగింటిలో ఏదైనా అనుకూలమే. యోగానికి, తపస్సుకు, ధ్యానానికి అది మొదటి మెట్టు... 'పరమపథ తొలిసోపానం'. చివరి వరకు అది పరమపథమే గదా! చివరిగడి లేదా సోపానం దాటితే పరమపథాన్ని చేరినట్లు. ఆ చివరి మెట్టు వరకు మనం ఉండేది ధ్యానస్థితిలోనే. ఆ మొత్తం 'ధ్యానం' అయితే యోగం వేరు, ధ్యానం వేరు అనవచ్చా? ఉహూ. బొత్తిగా అనకూడదు. 'యోగం' అన్నా ధ్యానమే. 'ధ్యానం' అన్నా యోగమే అవుతుంది. ఒక విధంగా యోగానికి గాని, ధ్యానానికి గాని అంతిమలక్ష్యం ఆనందం. పోనీ సచ్చిదానందం అన్నా సమస్య ఏమి లేదు.

అంత వరకు ఎవరూ భేదించరు. ధ్యానానికి కాలపరిమితి ఉండదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్ని గంటలైనా రోజులైనా ధ్యానంలో గడపవచ్చు. శరీర స్పృహ ఉండదు. కాని చైతన్యం ఉంటుంది. ఏదో అనిపిస్తుంది. అంతలో ఏమీ అనిపించని, ఏమీ కాని శూన్యం మిగులుతుంది. క్షణంలో చైతన్యం, మరుక్షణంలో శూన్యం. అది ధ్యాన స్థితి.

ధ్యానం చేసినంత మాత్రాన ఎవరూ సన్యాసి కారు. కానవసరం లేదు. అలాగే యోగం. యోగానికి సన్యాసానికి అస్సలు సంబంధం లేదు. 'సన్యాసం అన్నది సమాజంలో ఇమడలేనివారి, కేవలం పరమార్థంతో సంసార జీవితంపై విముఖత పెంచుకున్నవారి జీవిత విధానం. సన్యాసులైనా తిండి, తిప్పలు, నిద్ర తప్పవు. ఒక్క మైధున క్రియపట్ల ఆసక్తి ఉంచుకోరు అంతే. 

యోగం, ధ్యానం అన్నవి సంసారపక్షంగా జీవించేవారి ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి. సన్యాసం, తపస్సు సమాజానికి జనావాసాలకు దూరంగా తీసుకుపోతాయి. రెండు వర్గాల వారి లక్ష్యం ఒక్కటే ధ్యేయం ఒక్కటే. ఒకటి సరాగం. రెండవది విరాగం. సుఖాలు, భోగాలు అనుభవించవద్దని ఎవరూ చెప్పరు. మనిషికి ప్రకృతి అవసరాల వంటివే అవి. అలాగే యోగం, ధ్యానం అన్నవి మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. ఆ దృష్టితో పరిశీలిస్తే 'ధ్యానం' నిత్యక్రియల్లో ఒకటి. భోజనం చేయడం నిద్రపోవడం లాంటి అవసరం. ఎంత యోగం చేసినా, ధ్యానం చేసినా ఎంతసేపు చేస్తాం. ఒక గంట, రెండు గంటలు, మిగిలిన ఇరవై రెండు గంటలు మనం కోరిన జీవితం కోరినట్లు అనుభవిస్తాం గదా! ఆలోచన దేనికి?

ఆ లెఖ్కకొస్తే మనం బాధలు, యాతనలు, ఆలోచనలు లేకుండా రోజులో ఎన్ని గంటలు ఉండగలుగుతున్నాం? ధ్యానంలో కూర్చున్న రెండు గంటలైనా వాటిని దూరంగా తరిమి వేస్తున్నాం గదా? పోనీ అవి మన దగ్గరకు రాకుండా, మనల్ని బాధించకుండా తప్పించుకుంటున్నట్లే. అది గొప్ప రిలీఫ్. గొప్ప విశ్రాంతి. అసలు మనం రోజూ ఎన్నిగంటలు యోగంలో గడిపితే అంతకు పదింతలు ఆయుష్షు పెరుగుతుంది. అప్రయత్నంగానే ఆరోగ్యం చక్కబడుతుంది. రిలాక్సేషన్ కు మించిన మందు లేదు. పది, ఇరవై, ముప్ఫయి ఏళ్లు యోగం చేసినవారి ఆయుష్షు పెరుగుతుంది. వారు చక్కని ఆరోగ్యంతో ఉండగలుగుతున్నారు. ఆనందంగా, నిర్విచారంగా జీవిస్తుండడానికి కారణం యోగం. వందల సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవిస్తున్న వారి జీవన రహస్యం ఇదే.

                                   ◆నిశ్శబ్ద.