తులసి మాల ధరించేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి..!
తులసి మాల ధరించేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి..!
హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రదాన్యత ఉంది. తులసిని దైవంతో సమానంగా పూజిస్తారు. తులసి ఆకులను ఇతర దేవతారాధనలో ఉపయోగిస్తారు. ఇక ఆయుర్వేదంలో తులసిని గొప్ప ఔషధంగా చెబుతారు. అయితే ఆధ్యాత్మికత, దైవభక్తి మెండుగా ఉన్నవారు తులసి మాల ధరించడం, తులసి మాలతో జపం చేయడం చేస్తుంటారు. దీని వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తులసి మొక్కతో తయారయ్యే తులసి మాలను ధరించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి.
తామసిక ఆహారం..
తులసి మాల ధరించే వ్యక్తి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. స్వచ్చమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మసాలాలు, మాంసాహారం, మద్యం అస్సలు ముట్టరాదు.
శుద్ది..
తులసి జపమాలను నేరుగా ధరించకూడదు. దీన్ని మొదట గంగా జలంతో శుద్ది చేయాలి. ఆ తరువాత ఆరబెట్టాలి. నీరు ఆరిపోయిన తరువాతే తులసి మాల ధరించాలి.
రుద్రాక్షతో..
తులసి మాల ధరించేవారు మెడలో ఇతర మాలలు ధరించరాదు. కొందరు అతి భక్తి కొద్దీ మెడలో తులసి మాల, రుద్రాక్ష మాల రెండూ కలిపి ధరిస్తుంటారు. ఇంకొందరు రెండింటిని కలిపి మాలగా తయారు చేసుకుంటారు. ఇలా చేయకూడదు. తులసి మాలను మాత్రమే ధరించాలి. లేకపోతే అశుభ ఫలితాలు ఉంటాయి. సమస్యలు ఎదురవుతాయి.
జపమాల..
తులసి మాలను కేవలం మెడలోనే కాకుండా చేతికి కూడా ధరించవచ్చు. రోజులో దీన్ని అలాగే ఉంచుకోవచ్చు. ఏదైనా పనులు చేసే సమయంలో తులసి మాలను తీసివేసి స్నానం చేసి శుద్ది చేసిన తరువాత మళ్లీ దీన్ని ధరించాలి.
మంత్రాలు..
తులసి జపమాల ధరించిన వ్యక్తి ప్రతి రోజూ విష్ణువుకు సంబంధించిన మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల తులసి మాలతో కలిగే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. విష్ణువుకు తులసి అంటే ప్రీతి కాబట్టి తులసి జపమాలతో విష్ణు మంత్ర జపం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది.
*రూపశ్రీ.