శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని శివాలయం.. ఇక్కడ  శివుడే నేరుగా నైవేద్యం స్వీకరిస్తాడట

 

శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని శివాలయం.. ఇక్కడ  శివుడే నేరుగా నైవేద్యం స్వీకరిస్తాడట!


భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వీటిలో వైష్ణవ ఆలయాలు, శివాలయాలు, శక్తి ప్రదాన ఆలయాలు.. ఇలా చాలా ఉన్నాయి. అందులోనూ.. భారతదేశంలో శైవ క్షేత్రాలు చాలా పురాతనమైనవి. అంతేకాదు.. ఎంతో మహిమాన్వితమైని కూడా ఉన్నాయి.  కొన్ని క్షేత్రాలలో జరిగే అద్భుతాలు చూసినప్పుడు సాధారణ ప్రజలే కాదు.. ఏకంగా శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యానికి లోనవుతారు. ఇక్కడ జరిగే అద్బుతాల వెనుక కారణాలు శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు.  ఇక్కడ నేరుగా పరమేశ్వరుడే నైవేద్యం స్వీకరిస్తాడని, భక్తులకు తిరిగి ప్రసాదాన్ని కూడా ఇస్తాడట.  ఎన్నెన్నో వింతలు ఉన్న ఈ ఆలయం ఏమిటి? ఈ ఆలయం ఎక్కడుంది? ఇక్కడ జరిగే వింతలు ఏంటి? తెలుసుకుంటే..

రుద్రావర్త మహదేవ ఆలయం..

ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్రమైన నైమిశారణ్య ప్రాంతంలో, గోమతి నది ఒడ్డున రుద్రావర్త మహాదేవ ఆలయం ఉంది. శివుడు రుద్ర తాండవం చేసిన తర్వాత  తనను తాను శాంతపరుచుకోవడానికి గోమతి నదిలోకి ప్రవేశించిన ప్రదేశం ఇదేనని చెబుతారు.  ఇక్కడ శివలింగం నదిలో  ఉంటుంది.  భక్తులకు కనిపించదు. ఈ ప్రదేశాన్ని రుద్రావర్త కుండ్ అని కూడా పిలుస్తారు.

ఇది ఒక సాధారణ నీటి కొలనులా కనిపిస్తుంది, కానీ ఇక్కడ జరిగే సంఘటనలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ లోతైన జలాల్లో సాక్షాత్తు శివుడే శివలింగ రూపంలో కొలువై ఉంటాడని ఒక పౌరాణిక నమ్మకం.   ఈ కొలనులో చాలా అద్భుతాలు జరుగుతాయి.

బిల్వ ఆకులు మునిగిపోవడం..

ఆకులు వంటి తేలికైన వస్తువులు నీటిపై తేలడం ఒక సహజ నియమం. అయితే రుద్రావర్త కుండ్ వద్ద దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ శివనామాన్ని జపిస్తూ బిల్వపత్రాన్నినీటిలో వేసినప్పుడు, అది నీటిపై తేలడానికి బదులుగా నేరుగా లోతుల్లోకి మునిగిపోతుంది. ఆ బిల్వపత్రాన్ని సాక్షాత్తు శివుడే స్వీకరిస్తాడని స్థానిక భక్తులు నమ్ముతారు. కానీ బిల్వపత్రం చిరిగిపోయినా లేదా విరిగిపోయినా, అది మునిగిపోదట. ఈ అద్భుతాన్ని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

పాలు నిటారుగా ప్రవహించడం..

సాధారణంగా  నీటిలో పాలు పోసినప్పుడు, అవి వెంటనే చుట్టూ వ్యాపిస్తాయి. అయితే ఈ కొలనులో సమర్పించిన పాలు నీటిలో వ్యాపించకుండా ఒక గీతలా నిటారుగా లోతుల్లోకి ప్రవహిస్తాయి. ఏదో అదృశ్య శక్తి పాలను కిందికి లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కొలనుకు సంబంధించిన ఈ రహస్యం కూడా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.

పండ్లు ప్రసాదంగా తిరిగి రావడం..

ఈ కొలనులో  మరో ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో పండ్లను  సమర్పిస్తారు. ఇక్కడ ఐదు పండ్లను సమర్పిస్తే, వాటిలో కొన్ని నీటిలో మునిగిపోతాయని, కొంతసేపటికి ఒకటి లేదా రెండు వాటంతట అవే నీటిపై తేలుతాయని చెబుతారు. ఈ పండ్లను  మహాదేవుని ఆశీర్వాదంగా భావించి, వాటిని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళతారు.

వ్యాధుల నుండి విముక్తి..

మత విశ్వాసాల ప్రకారం ఈ  కొలనును దర్శించి, పూజించడం వల్ల కోరికలు నెరవేరడమే కాకుండా చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. అందుకే భక్తులు ఏడాది పొడవునా ఇక్కడికి తరలివస్తుంటారు.

                                  *రూపశ్రీ.