శివుడిని ప్రార్థిస్తే శనిదేవుడు ఇబ్బంది పెట్టడని చెబుతారు ఎందుకు!

 

శివుడిని ప్రార్థిస్తే శనిదేవుడు ఇబ్బంది పెట్టడని చెబుతారు ఎందుకు!

 

శని దేవుడిని న్యాయ ప్రధాత అని అంటారు. మనిషి చేసిన మంచి చెడు కర్మలకు తగిన ఫలితాలు ఇచ్చేది శనిదేవుడే.  శనిదేవుడిని చాలామంది చెడ్డ గ్రహం అంటారు. కానీ నిజానికి శనిదేవుడు మనిషి తప్పును సరిదిద్ది సరైన మార్గంలో పెడతాడు. శనిదశ ఏదైనా జీవితంలో ఉన్నప్పుడు కనిపించే కష్టాలు, కన్నీళ్లు.. శని గ్రహ దశ పోయాక మాయం అవుతాయి.  ఇంకా చెప్పాలంటే.. జీవితంలో ఎవ్వరికైనా శని గ్రహ దశ రాకముందు, వచ్చిన తర్వాత కంటే.. శనిగ్రహ దశ పూర్తైన తర్వాత జీవితంలో కనిపించే మార్పు చాలా ఆశ్చర్యపరుస్తుంది. పురాణాలలో దేవుళ్లకు కూడా గురువులు ఉన్నారు.  అలాగే శని మహాత్ముడికి కూడా గురువు ఉన్నాడు. ఆయనే పరమేశ్వరుడు అని చెబుతారు.  అలాగే పరమేశ్వరుడిని పూజించే వారికి శని బాధలు ఉండవని కూడా చెబుతారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

శని దేవుడు పరమేశ్వరుడి శిష్యులు ఎలా అయ్యాడంటే..

పురాణాల ప్రకారం, శని దేవుడు సూర్యుడు , ఛాయాదేవిల కుమారుడు. పుట్టినప్పుడు శని దేవుడు చాలా నల్లని రంగులో ఉండటంతో, సూర్యుడు శనిదేవుడిని తన కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించి, అవమానించాడు. తల్లి అవమానం, తండ్రి ప్రవర్తనతో మనస్తాపం చెందిన శని దేవుడు శివుని కోసం కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. మండుటెండ, చలి, వానలను సైతం లెక్కచేయకుండా, ఆకలిదప్పికలతో సంవత్సరాల తరబడి శివుడి తపస్సు చేశాడు. అతని కఠోర తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై, ఒక వరం కోరుకోమని శని దేవుడిని అడిగాడు.


కర్మఫల దాత..

శని దేవుడు తన తండ్రి అయిన సూర్య దేవుని కంటే ఎక్కువ శక్తిమంతుడిగా, గౌరవనీయుడిగా నిలిచే ఒక పదవిని, అధికారాన్ని ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు. అప్పుడు మహాదేవుడు శని దేవుడిని నవలోకాలలో అత్యున్నత స్థానమిస్తూ, అతడిని "కర్మ ప్రదాత" మరియు "న్యాయ ప్రదాత "గా నియమించాడు. శని దేవుడు కేవలం మానవులనే కాకుండా, దేవతలను కూడా వారి కర్మల ఆధారంగా శిక్షిస్తాడని లేదా మంచి కర్మలు చేసిన  వారికి మంచి ఫలితం  ఇస్తాడని శివుడు వరం ఇచ్చాడు.

సాక్షాత్తు శివుడు కూడా తప్పించుకోలేడు..

పరమేశ్వరుడికి,  శని దేవుడికి సంబంధించిన  చాలా ఆసక్తికరమైన కథ ఉంది, శని దేవుడు తన గురువైన శివుడిని చూడాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు ఒక సంఘటన జరిగిందట.


పురాణం ప్రకారం, ఒకసారి శని దేవుడు శివుని వద్దకు వెళ్లి, "ఓ గురుదేవా, రేపు నేను మీ రాశిలోకి ప్రవేశించబోతున్నాను, అందువల్ల నా దిష్టి మీపై కూడా పడుతుంది" అని అన్నాడట,

పరమేశ్వరుడు చిరునవ్వుతో, "ఎంతసేపు నాపై నీ దృష్టిని ఉంచుతావు?" అని అడిగాడట. దానికి శని దేవుడు, "ఒక పావు ప్రహరం (సుమారు మూడున్నర గంటలు)" అని బదులిచ్చాడట..

శని దేవుని ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి, మహాదేవుడు ఒక ఉపాయం పన్నాడు. మరుసటి రోజు, ఆయన ఏనుగు వేషంలో మర్త్య లోకానికి (భూలోకానికి) వచ్చి అడవిలో దాక్కున్నాడట. పావుగంట తరువాత, మహాదేవుడు తన దైవ స్వరూపానికి తిరిగి వచ్చి, శని దేవునితో నవ్వుతూ  "చూడు శనీ, నీ చెడు దృష్టి నాకు హాని చేయలేకపోయింది." అన్నాడట.

దీనికి శనిదేవుడు చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు, "ఓ ప్రభూ! నా చూపు ప్రభావాన్ని చూడండి. నా చూపు కారణంగా, విశ్వనాథుడు తన దైవ రూపాన్ని విడిచిపెట్టి, పావుగంట సేపు జంతు రూపంలో (ఏనుగు) మారి అజ్ఞాతంలో జీవించవలసి వచ్చింది." శనిదేవుని ఈ నిష్పాక్షిక న్యాయానికి పరమేశ్వరుడు చాలా సంతోషించి, శనిదేవుడిని ఆలింగనం చేసుకున్నాడట. ఇదీ శనిదేవుడికి,

శివుడిని పూజించే వారిని శనిదేవుడు ఏం చేయడా?

జ్యోతిష్యం , పురాణాలు స్పష్టంగా చెబుతున్నదాని ప్రకారం శివుడిని పూర్తీ భక్తితో పూజించే వారికి శని దేవుని వలన ఎన్నడూ ఇబ్బంది కలగదట. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి:

గురు-శిష్య సంబంధం..

 శని దేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు. సనాతన సంప్రదాయంలో, శిష్యుడు తన గురువుకు గానీ, గురువును భక్తితో పూజించే వారికి గానీ ఎన్నడూ హాని చేయడట. ఎవరైనా శివుడిని పూజిస్తే, శని దేవుడు వారిపై తన చెడు దృష్టిని ప్రసరింపజేయడట.

కర్మ ప్రక్షాళన..

 శివభక్తి మనిషిలో సానుకూల శక్తిని నింపుతుంది , వారిని చెడు పనులకు దూరంగా ఉంచుతుంది. శని దేవుడు చెడు పనులను మాత్రమే శిక్షిస్తాడు కాబట్టి, ఆయన శివ భక్తులు చేసే మంచి పనులకు ఎప్పుడూ శుభ ఫలితాలను ప్రసాదిస్తాడట.

శని దోషానికి సులభమైన నివారణలు..

ఏలినాటి శని, శని మహా దశ, శని అంతర్దశ, శని దోషం వంటివి  ఉన్నప్పుడు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శివుడిని శరణు వేడటమే ఉత్తమ మార్గం.

శివలింగ అభిషేకం, బిల్వపత్ర సమర్పణ,  ప్రతి శనివారం శివలింగంపై నల్ల నువ్వులు కలిపిన నీటిని సమర్పించడం, 'ఓం నమః శివాయ' జపం.. ఇలా చాలా పరిహారాలు శని దోషం తొలగడంలో సహాయపడతాయి.

ప్రతిరోజూ లేదా ముఖ్యంగా శనివారాల్లో మహా మృత్యుంజయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల అన్ని రకాల శని దోషాలు శాంతిస్తాయి.

శనివారం నాడు శివ , శని ఇద్దరి చాలీసాలను పఠించడం చాలా మంచిదని చెబుతారు.  

 

                                             *రూపశ్రీ.