పరమాత్ముడిని చేరుకోవడానికి సరైన సమయం.. ధనుర్మాస రహస్యం ఇదే..!
పరమాత్ముడిని చేరుకోవడానికి సరైన సమయం.. ధనుర్మాస రహస్యం ఇదే..!
ధనుర్మాసం డిసెంబర్ 16 తేదీ నుండి ప్రారంభమవుతోంది. ఇది జనవరి నెలలో మకర సంక్రాంతి వరకు ఉంటుంది. సూర్యుడు ధనురాశిలో సంచరించే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. అయితే ధనుర్మాసం గురించి పురాణాల ప్రకారం చూస్తే చాలా లోతైన అర్థాలు, దైవ సంబంధ రహస్యాలు ఉన్నాయి.
ఉపనిషత్తులలో ధనుస్సు అంటే ప్రణవం అని అర్థమట. ఈ ప్రణవాన్నే అందరూ ఓంకారం అని పిలుస్తారు. ఓంకారాన్నే చాలామంది పరబ్రహ్మం అని కూడా అంటారు. ఆ పరబ్రహ్మమే పరమాత్మ. ఆ పరమాత్మను చేరుకోవడానికి చాలామంది ఓంకారాన్ని ఉపాసిస్తారు. పరమాత్మను చేరుకోవడానికి ఓంకారాన్ని ధ్యానించడమే సరైన మార్గమని ఉపనిషత్తులు కూడా పేర్కొంటున్నాయి.
ద్వాపర యుగం విషయం చెప్పుకుంటే ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పొందడానికి గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. ఈ కాత్యాయని వ్రతాన్నే ధనుర్మాస వ్రతం అంటారు. ఈ విషయం తెలుసుకున్న ఆండాళ్.. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పిస్తుంది.
సూర్యుడు మార్గశిర మాసంలో ధనురాశిలో ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉన్న ముప్పై రోజుల సమయాన్ని ధనుర్మాసం అని అంటారు. మార్గశీర్షంలో ప్రారంభమైన ఈ మాసం మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. సాధారణంగానే మార్గశిర మాసాన్ని అన్ని మాసాలలోకి శీర్షం వంటిది అంటే.. తల వంటిది అని అంటారు. అందుకే మార్గశీర్ష మాసం అని కూడా అంటారు.
మార్గం అంటే దారి. భగవంతుడిని చేరడానికి భక్తులు ఎన్నో మార్గాలు ఎంచుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే.. మాసాలకు శీర్షం వంటిది అయిన ఈ ధనుర్మాసంలో చేసే పూజ, వ్రతం, దైవ ఆరాధన, దైవ ఉపచారాలు చాలా తొందరగా దేవతలకు చేరతాయట. ఈ కారణంగా దీన్ని మార్గశీర్ష వ్రతం అని కూడా అంటారు. అంతేకాదు.. స్నాన వ్రతం అని కూడా అంటారు. శ్రీవ్రతం అని కూడా అంటారు. ఇంతటి శక్తి కలిగిన ఈ మాసంలో దైవ ఆరాధనను అస్సలు వదులుకోకుండా దైవ కృపను సొంతం చేసుకోవాలి.
*రూపశ్రీ.