రంజాన్ లో ఇతికాఫ్ అంటే ఏంటి...దీని నియమాలు తెలుసా!
రంజాన్ లో ఇతికాఫ్ అంటే ఏంటి...దీని నియమాలు తెలుసా!
రంజాన్ ముస్లిం సోదరుల పవిత్ర పండుగ. రంజాన్ మాసం అంతా ఉపవాసాలు ఉండి చివరి రోజు చంద్రుడి దర్శనంతో పండుగ జరుపుకుంటారు. అయితే ఈ రంజాన్ మాసంలో చాలా ఆరాధన పద్దతులు ఉన్నాయట. రంజాన్ మాసంలో మూడవ అష్రాలో అంటే చివరి పది రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ చివరి 10 రోజులు ఇతికాఫ్ అనే ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన అల్లాహ్ కు ఆయన భక్తులకు మధ్య దూరాన్ని తగ్గించి నరకం నుండి ఉపశమనం కలిగించే ఆరాధన పద్దతి అని అంటారు. చివరి 10 రోజులు ముస్లింలు ఒంటరిగా ఉండి మసీదులో ఇతికాఫ్ పాటిస్తారు. అంటే అల్లాహ్ కు ప్రార్థన చేస్తారు. ఈ ఇతికాఫ్ ను మహిళలు ఇంట్లో పాటిస్తారు. పురుషులు మసీదుకు వెళ్లి అక్కడ పాటిస్తారు.
ఇతికాఫ్ నియమాలు.
ఇతికాఫ్ పాటించడం అంటే కేవలం ప్రార్థన చేయడం కాదు. ఈ 10 రోజులలో ఎవరూ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. కేవలం ఏదైనా పని లేదా ఎవరితో అయినా మాట్లాడాల్సి ఉంటే మాత్రమే బయటకు వెళతారు. సింపుల్ గా చెప్పాలంటే బయటి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆరాధనలో మాత్రమే గడుపుతారు. ఇతికాఫ్ అంటే తనను తాను ఆపుకోవడం లేదా నిగ్రహించుకోవడం.
రంజాన్ లో మూడవ అష్రా ప్రారంభం కాగానే చాలామంది మసీదులకు చేరుకుంటారు. మరికొందరు ఇంట్లోనే ఉంటూ ఇతికాఫ్ చేస్తారు. ఈద్ రోజు చంద్రుడి దర్శనం అయ్యే వరకు ఇతికాఫ్ లోనే గడుపుతారు. ఇతికాప్ నియమాలను పాటిస్తారు.
ఇతికాఫ్ ను ఖచ్చితంగా పాటించాలని లేదు. స్వచ్చందంగా ఎవరికి ఇష్టమైతే వారు దీన్ని పాటించవచ్చు. అయితే ఇలా ఇతికాఫ్ పాటించే వారు ఆ అల్లాహ్ కు దగ్గర అవుతారని వారి నమ్మకం. నాఫిల్ అంటే ఫర్జ్ లాగా ఇది తప్పనిసరి కాదు. కానీ అల్లాహ్ తో అనుసంధానం పెరగడానికి నరకాగ్నిని నివారించడానికి ముస్లింలు రంజాన్లో ఇతికాఫ్ చేస్తారు.
ఇతికాఫ్ వల్ల అల్లాహ్ తో అనుసంధానం మాత్రమే కాదు.. దీనికి తగిన ప్రతి ఫలం కూడా ముస్లిం లకు లభిస్తుంది. 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా, వారు పిల్లలు, యువకులు లేదా వృద్ధులు ఎవరైనా ఇతికాఫ్ చేయవచ్చు. రంజాన్ చివరి 10 రోజుల్లో ఇతికాఫ్ నియమాలను పాటించేవారికి రెండు ఉమ్రా, రెండు హజ్ యాత్రలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
*రూపశ్రీ.