అమలకి ఏకాదశి.. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే..!
అమలకి ఏకాదశి.. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే..!
ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిని అమలకి లేదా ఆమ్ల ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు ఉసిరి చెట్టును పూజించడంతో పాటు, ఉసిరి కాయను దానం చేయడం కూడా సాంప్రదాయంగా పరిగణించబడుతుంది. ఈ దానం అనేక యజ్ఞాల ఫలాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి ఫిబ్రవరి 27న వచ్చింది.
ప్రతి ఏకాదశి తిథికి విష్ణువు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అయితే అమలకి ఏకాదశి రోజు విష్ణువుతో పాటు ఉసిరి చెట్టును కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేసినప్పుడే ఈ ఏకాదశి ఉపవాసం, ఆరాధన సంపూర్ణంగా జరిగినట్టు. ఎందుకంటే ఉసిరి చెట్టును హిందూ మతంలో ఎంతో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. ఈ రోజున ఉసిరి కాయలు తినడం అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. ఏకాదశి నాడు ఉపవాసం, పూజ చేయడం వల్ల కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. పనిలో అడ్డంకులు తొలగిపోయి విజయం దక్కుతుంది. మరీ ముఖ్యంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.
అమలకి ఏకాదశి రోజు చేయాల్సిన పనులు..
అమలకి ఏకాదశి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం తప్పనిసరి. విష్ణువును పూజించడంతో పాటు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
శ్రీ కృష్ణుడికి అభిషేకం చేసి "క్రిం కృష్ణాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి. శ్రీకృష్ణుడితో పాటు గోమాతను పూజించాలి. ఆవులను సంరక్షించడానికి గోశాలకు దానం చేయడం ఎంతో మంచిది.
కుంకుమ, గంధం, తీపి పదార్థాలు, నూనె, నెయ్యి, పూలమాలలు, దేవుడి బట్టలు వంటి పూజా సామాగ్రిని దేవాలయంలో దానం చేయవచ్చు.
అమలకి ఏకాదశి నాడు ఉసిరికాయ తినడం చాలా మంచిది. ఈ రోజు ఉసిరి రసం కూడా తాగవచ్చని చెబుతారు. ఉసిరికాయను కూడా దానం చేస్తే ఎంతో పుణ్యం.
ఏకాదశి నాడు అన్నపూర్ణదేవిని కూడా పూజించి, అవసరమైన వారికి, ఆకలితో ఉన్నవారికి ఆహారం దానం చేయడం ఎంతో మంచిది.
రంగభరి ఏకాదశి..
హోలీకి నాలుగు రోజుల ముందు వస్తుంది కాబట్టి దీనిని రంగభరి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడితో హోలీ ఆడటం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. బ్రహ్మ పురాణం ప్రకారం, ఈ రోజున ఉసిరి చెట్టును, విష్ణువును పూజించడం తప్పనిసరి.
యజ్ఞం చేసినంత పుణ్యం..
పద్మ పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణాలు ఉసిరి చెట్టు విష్ణువుకు చాలా ప్రియమైనదని చెబుతున్నాయి. ఈ చెట్టు విష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరికీ నివాసంగా పరిగణిస్తారు. అందువల్ల అమలకి ఏకాదశి నాడు, ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువును పూజిస్తారు. ఈ రోజున ఉసిరి వృక్షాన్ని పూజించి, ఉసిరి కాయలను దానం చేయడం వల్ల అన్ని యజ్ఞాలు చేసి, 1,000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు.
*రూపశ్రీ.