దేవుడి పూజ సఫలం కావాలంటే.. ఎలా పూజించాలి...

 

దేవుడి పూజ సఫలం కావాలంటే.. ఎలా పూజించాలి...

 

 

పూజ.. భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యమైన భాగం.  పూజ చేయడం భక్తి మార్గంలో మొదటి మెట్టు.  దేవుడిని విగ్రహ రూపంలో పూజించడం వల్ల మనిషికి ఏకాగ్రత,  ఓర్పు,  దృఢ చిత్తం వంటివి లభిస్తాయి.  మానసికంగా బలంగా ఉంటారు. అయితే చాలామంది మేము పూజలు చేస్తున్నాం కానీ మాకు ఫలితాలు లేవు అని అంటూ ఉంటారు.  అసలు దేవుడి పూజ ఎలా చేయాలి? ఏ సమయంలో పూజ చేస్తే సరైన ఫలితం ఉంటుంది? ఏ సమయంలో పూజ చేయకూడదు.  తెలుసుకుంటే..

బ్రహ్మ ముహుర్తం..

బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు మేల్కునే సమయం.  ఇది చాలా పవిత్రమైన కాలం గా భావిస్తారు.  బ్రహ్మముహూర్తం రాత్రిలో చివరి భాగం.  బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఆ సమయంలో దేవుడికి దీపం పెట్టి,  పూజ చేస్తుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్త సమయాన్ని పూజకు ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఇది  వ్యక్తి శరీరం,  మనస్సు రెండింటిని సరైన స్థాయిలో ఉంచే సమయం. ఈ సమయంలో చేసే పూజ వల్ల ఏకాగ్రత పెరుగుతుందట. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో ధ్యానం చేయడం,  దేవుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు బ్రహ్మముహూర్తపు దీపంగా పరిగణిస్తారు.

సూర్యోదయం..

సూర్యోదయం లోపు ఇల్లు,  వాకిలి శుభ్రం చేసుకుని సూర్యోదయ సమయంలో దీపం పెట్టుకుని,  దేవుడి పూజ చేయడం కూడా చాలా మంచిది.  ఈ   సమయంలో చేసే పూజ మనసుకు, ఇంటికి ప్రశాంతతను ఇస్తుంది. అయితే బ్రహ్మ ముహూర్తంలో పెట్టే దీపం కంటే ఇది తక్కువ శక్తివంతమైనది.

సూర్యాస్తమయం..

ఉదయం,  సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం సాధారణం.  అయితే సాయంత్రం  ఇల్లు శుభ్రం చేసుకుని 6 గంటల లోపు చాలామంది దీపం పెడుతూ ఉంటారు. కానీ 6 గంటలకు కాకుండా 6 గంటల నుండి 7.30 గంటల మధ్యలో దీపం పెట్టడం మంచిది.  ముఖ్యంగా ఈ సమయంలో శివుడి ముందు దీపం పెట్టడం,  శివ స్త్రోత్రాలు, శివుడికి సంబంధించిన శ్లోకాలు చెప్పుకోవడం,  రుద్రం చదువుతూ శివుడికి రుద్రాభిషేకం లేదా ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో గొప్ప పుణ్యం లభిస్తుంది.

ఏ సమయంలో పూజ చేయకూడదు..

చాలామంది పూజ చేయడానికి ఏ సమయం అయితే ఏంటి? ఎలా పూజిస్తే ఏంటి? భక్తి ప్రధానం కదా అనుకుంటూ ఉంటారు.  కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇంట్లో పూజ చేయకూడదు.  అలాగే దీపం కూడా వెలిగించ కూడదు.  ఈ మధ్యాహ్న సమయాన్ని అభిజిత్ లగ్నం అని అంటారు.  ఈ సమయం చనిపోయిన పెద్దలకు,  పితృదేవతలకు కేటాయించిన సమయం.  ఈ సమయంలో పితృ కార్యాలు చేయడం ఉత్తమం.  కాబట్టి ఈ సమయంలో దేవుడి పూజ మంచిది కాదు.


                                      *రూపశ్రీ.