ఈ రోజే విజయ ఏకాదశి.. సాయంత్రం లోపు ఈ ఒక్క పని చేయండి..!

 

ఈ రోజే విజయ ఏకాదశి.. సాయంత్రం లోపు ఈ ఒక్క పని చేయండి..!

 

హిందూ పంచాంగంలో చాలా తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.  వాటిలో ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది.  ఏకాదశి తిథి విష్ణువుకు ఎంతో ప్రీతి.  సాధారణంగా ముక్కోటి ఏకాదశిని మాత్రమే చాలామంది ముఖ్యమైనదిగా భావిస్తారు. మిగిలిన రోజుల్లో వచ్చే ఏకాదశికి అంత ప్రాముఖ్యం ఇవ్వరు. కానీ ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి కూడా అంతే శక్తివంతమైనది. ఏకాదశిని ఎంతో భక్తితో జరుపుకుంటే ఎనలేని పుణ్యం.. దైవ కృప కలుగుతాయి.  ఫిబ్రవరి నెలలో 24వ తేదీన ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు. చాలా మంది ఈరోజు విష్ణు పూజ,  ఉపవాసం ఉంటారు.  విష్ణు సహస్ర పారాయణ, విష్ణు పురాణం వంటివి కూడ చదువుకుంటూ ఉంటారు. అయితే..ఎన్ని చేసినా చేయకపోయినా విజయ ఏకాదశి రోజు సాయంత్రం లోపు ఒక్క పని చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఆ శ్రీమహా విష్ణువు  అనుగ్రహం లభిస్తుంది.


ఏకాదశి రోజు సాధారణంగానే ఉపవాసం, పూజ చేసుకుంటారు.  రోజంతా ఉపవాసం ఉండి మరుసటిరోజు ఉదయం స్నానం చేసి, సూర్యోదయం తరువాత గంట నుండి గంటన్నర లోపు తులసి తీర్థం తీసుకుని తరువాత ఏదైనా ఆహారం తీసుకోవాలి.  ఇదే సరైన ఏకాదశి ఉపవాసం అనబడుతుంది. ఇలా  ఉపవాసం, పూజ చేసేవారు ఏకాదశి రోజు సాయంత్రం లోపల ఏకాదశి వ్రతం కథ ఉంటుంది.  ఈ వ్రత కథను చదువుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.  ఏకాదశి ఉపవాసం సంపూర్ణ ఫలితం దీనివల్ల వస్తుందని అంటారు.


వ్రత కథ..

ఏకాదశి వ్రత కథ.. త్రేతా యుగానికి చెందినది.   మొదట నారదుడు  బ్రహ్మదేవుడితో విజయ ఏకాదశి గురించి తెల్పండి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విజయ ఏకాదశి పేరుకు తగ్గట్టే చాలా పుణ్యప్రదమైనది.  ఇది ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుంది.  పాపాలు తొలగిస్తుంది. అని చెబుతూ ఏకాదశి వ్రతం గురించి ఒక కథను నారద మునితో  చెబుతాడు.

త్రేతాయుగంలో శ్రీరాముడు తన వానర సైన్యంతో సీతాదేవిని చేరుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సీతమ్మను చేరాలంటే సముద్రాన్ని దాటి లంకను చేరి రావణుని జయించాలి.  దీనికోసం శ్రీరాముడు తన సమస్యను బకదాల్బ్యుడు అనే  మునికి చెప్పి పరిష్కారం కోరాడు. దీనిపై,  మహర్షి శ్రీరాముడితో ఏకాదశి గురించి, ఏకాదశి వ్రత మహత్యం గురించి చెప్పి ఏకాదశి ఉపవాసం ఉండమని చెబుతాడు. అంతేకాదు..

ఏకాదశికి ముందురోజు బంగారం,  వెండి,  రాగి లేదా మట్టి కుండ తీసుకుని అందులో నీరు నింపాలి. ఈ నీటి కుండను మామిడి ఆకులతో అలంకరించాలి.  ఈ కుండను సప్త ధాన్యాలతో అలంకరించిన వేదిక మీద ఉంచాలి. దానిపైన నారాయణుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి.  ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి దళాలు,  గంధం, పువ్వులు, పూలమాల అన్నీ సమర్పించాలి.  ఇవన్నీ సమర్పించి నారాయణుడిని పూజించాలి.  ఆ తరువాత ఆ ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి.  ఆ తరువాత మరుసటి రోజు ఉదయం నదీతీరం కానీ,  కొలను కానీ, సరస్సు కానీ.. వీటిలో ఏది దగ్గరలో ఉంటే దాని ఒడ్డున కుండను ఉంచి అక్కడ కుండను,  నారాయణ మూర్తి చిత్రపటం లేదా విగ్రహాన్ని బ్రహ్మచర్యం పాటించే బ్రాహ్మణుడికి దానం చేయాలి.  ఇలా చేస్తే యుద్దంలో విజయం సాధిస్తావు అని చెబుతాడు.


ఆ మహర్షి చెప్పినట్టే శ్రీరాముడు బ్రాహ్మణుడికి దానం చేసి రావణుడితో యుద్దంలో విజయం సాధించాడు.  అంతటి శ్రీరాముడే రావణుడి మీద యుద్దానికి వెళ్లడానికి, సముద్రాన్ని దాటడానికి,  సైన్యాన్ని కూర్చుకోవడానికి.. తన తమ్ముడిని రక్షించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.  ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. అలాంటి సాధారణ మానవులం ఆ దేవుడి అనుగ్రహం లభించాలంటే ఎంత చిత్తంతో దేవుడిని ఆరాధించుకోవాలో అర్థం చేసుకోవచ్చు.


                                       *రూపశ్రీ.