కృష్ణభక్తులకు ఆదర్శం - ప్రభుపాద

 

కృష్ణభక్తులకు ఆదర్శం - ప్రభుపాద

భారతీయుల తత్వచింతనను సాధికారంగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వ్యక్తి వివేకానందులు. ఆ తత్వచింతనలో భాగమైన భక్తిరసాన్ని ప్రపంచానికి రుచి చూపినవారు ప్రభుపాదులవారు. పండుముసలి వయసులో పధ్నాలుగు మార్లు ప్రపంచాన్ని చుట్టిముట్టినా, నలుదిశలా కృష్ణభక్తి వ్యాపించేలా పదులకొద్దీ పుస్తకాలకు కలం పట్టినా.... ధర్మప్రచారంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణభక్తుని పరిచయం.

ఆదినుంచే.. ప్రభుపాదులవారి అసలు పేరు అభయ్‌చరణ్‌. 1896లో బెంగాల్‌ ప్రాంతంలో జన్మించిన అభయ్‌ మనసు చిన్నప్పటి నుంచీ కూడా కృష్ణుని పాదాల మీదే లగ్నమై ఉండేది. అలాగని అభయ్‌ తన చదువుని కానీ బాధ్యతలను కానీ ఏమాత్రం ఏమార్చలేదు. కోల్‌కతాలో ఉన్నతమైన విద్య లభించే పాఠశాలల్లోనే చదువుకున్నారు. స్కాటిష్‌ చర్చ్‌ కాలేజ్‌లో డిగ్రీ పట్టా కోసం చేరారు. చదువులో భాగంగా తత్వశాస్త్రం, ఆంగ్లం, సంస్కృతాల మీద మంచి పట్టుని సాధించారు. అదే సమయంలో గాంధీగారు విదేశీ విద్య, వస్తువులను బహిష్కరించమన్న పిలుపుని ఇవ్వడంతో, డిగ్రీ పట్టాను పుచ్చుకునేందుకు నిరాకరించారు అభయ్‌.

 

పెళ్లి- శిష్యరికం... అభయ్‌కు 22 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. మరో మూడేళ్లకి ఓ పండంటి బాబు పుట్టాడు. ఒక పక్క గృహస్థుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే కృష్ణభక్తిలో మునిగితేలుతూ ఉండేవారు. ఒక చిన్న మందుల దుకాణాన్ని నడుపుతూనే తనకు తగిన గురువు కోసం వెదకసాగారు. అదిగో ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ పరిచయం అయ్యారు. సరస్వతి ఠాకూర్‌ గౌడీయ వైష్ణానికి చెందిన ఆధ్మాత్మికవేత్త. కృష్ణభక్తే ఆధారంగా, చైతన్యమహాప్రభువు చూపించిన భక్తిమార్గమే గౌడీయ వైష్ణవం. ఆ శాఖకు చెందిన సరస్వతి ఠాకూర్‌ వద్ద శిష్యరికంతో అభయ్‌ జీవితమే మారిపోయింది.

ప్రభుపాదగా మారిన అభయ్‌.. అభయ్‌ ఒక పక్క గృహస్థుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే వైష్ణవానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. 1944నాటికి కృష్ణభక్తిని ప్రచారం చేసేందుకు ‘బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌’ అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రిక ఇప్పటికీ నిరాటంకంగా వెలువడుతోంది. ఎప్పుడైతే తన జీవితం చరమాంకానికి చేరుకుందని గ్రహించారో అప్పుడు సన్యాసాన్ని స్వీకరించి ‘అభయ్‌ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద’గా మారారు. అప్పటికా ఆయన వయసు 63 ఏళ్లు. అలా ధర్మ శాస్త్రాలలో సూచించిన నాలుగు ఆశ్రమ ధర్మాలనూ నిజజీవితంలో ఆచరించి చూపారు ప్రభుపాదులవారు.

 

అమెరికాకు పయనం!... ప్రభుపాదుల జీవితం అప్పటివరకూ ఒక ఎత్తైతే, అమెరికాకు చేరుకున్న తరువాత ఆయన సాగించిన కృషి మరో ఎత్తు. 1965లో, 69 సంవత్సారాల వయసులో, కృష్ణభక్తి ప్రచారానికి పాశ్చాత్యతీరాల వైపు ప్రయాణం కట్టారు ప్రభుపాద. అప్పటికి ఆయనకు అమెరికాలో ఎవరూ పరిచయం లేరు. ఆయనకు కనీసం స్వాగతించే నాథుడే లేడు. ప్రభుపాద చేతిలో ఉన్నదల్లా, ఆయన అనువదించిన భాగవత పుస్తకాలే. ఆయన మనసులో ఉన్నదల్లా ఆ భావతంలోని నాయకుడైన కృష్ణుడే!

హరేకృష్ణ ఉద్యమం... అమెరికాకు చేరుకున్న ప్రభుపాద నానాఅగచాట్లూ పడ్డారు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ నిదానంగా ఆయన బోధలు అక్కడి ప్రజలను ఆకర్షించసాగాయి. ఏడాది గడిచేసరికి ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణా కాన్షియస్‌నెస్‌’ (ISKON)ను స్థాపించారు. ఇక అక్కడినుంచి ప్రభుపాదులవారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకో ఏడూ గడిచేకొద్దీ ISKON శాఖోపశాఖలుగా విస్తరించసాగింది. అయినా కూడా ప్రభుపాదులవారు విశ్రమించలేదు. కృష్ణభక్తిని మరింత ప్రచారాన్ని కల్పించేందుకు 14 మార్లు ప్రపంచయాత్రను చేపట్టారు. 80కి పైగా పుస్తకాలను రాశారు. వాటిలో భగవద్గీత మీద ఆయన రాసిన వ్యాఖ్యానం 60కి పైగా భాషల్లోకి అనువాదమై, లక్షలకొద్దీ ప్రతులు అమ్ముడుపోయింది. ఒకానొక సమయంలో ఆ పుస్తకపు ప్రభంజనాన్ని తట్టుకోలేక, దాన్ని నిషేదించమంటూ రష్యాలో ఓ కేసు కూడా నమోదైంది.

 

ప్రస్తుతం ఇస్కాన్‌ ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా శాఖలతో, వందలాది కృష్ణ మందిరాలతో, ప్రభుపాదులవారి స్ఫూర్తిని కొనసాగిస్తోంది. కృష్ణునిలో ఐక్యం కావడమే పరమావధిగా, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు భక్తియోగమే సాధనగా... ఇస్కాన్‌ ప్రతినిధులు ప్రచారాన్ని సాగిస్తున్నారు. భక్తులను ఆకర్షించే తీరులోనూ, ప్రచారపద్ధతులలోనూ అడపాదడపా ఇస్కాన్‌ మీద కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ... వారు చేస్తున్న సేవాకార్యక్రమాలకు ప్రశంశలూ దక్కుతున్నాయి. ఓ సమయంలో ప్రభుపాదులవారు పేర్కొన్నట్లు, ఇస్కాన్‌ వేల సంవత్సారల వరకూ ఇలా విజయవంతంగా నడుస్తూనే ఉంటుందేమో! హరేకృష్ణ!

- నిర్జర