శ్రీ కృష్ణాష్టమి
శ్రీ కృష్ణాష్టమి
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణజయంతి, శ్రీ జయంతి అనికూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే క్షిష్ణాష్టమిగానూ నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణజయంతిగానూ వ్యవయరించాలని ధర్మశాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. తిథీ నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం గానీ బుధవారం గానీ అయితే మరీ ప్రసస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తోంది.
కృష్ణాష్టమినాడు అభ్యంగన స్నానమాచరించాలి. తులసీదళాలు వేసిన నీటితో ఆచమించాలి. ఆరోజు ఉపవాసముండాలి. సాయంత్రం గృహమధ్యమున గోమయంతో అలికి రంగవల్లి తీర్చాలి. దానిమీద బియ్యం పోసి మంటపం ఏర్పరచి నూతన కుంభం ఉంచాలి. ఆ కొత్త కుండను గంధపుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్టించాలి. ముందుగా దేవకీదేవి ప్రార్థనం, తర్వాత కృష్ణప్రార్థన. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీదేవికి నివేదనం చేయాలి. కొన్ని ప్రాంతాలలో దీనిలో శొంఠి కూడా కలుపుతారు.
అర్థరాత్రి వరకు పూజ. పాలు, పెరుగు, వెన్న కృష్ణునికి నైవేద్యం. చంద్రోదయ సమయాన బయటికి వెళ్ళిఅక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్పచందన సంయుక్తమైన శంఖంచేత నీటిని తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. కృష్ణాష్టమినాడు వెండితో తయారుచేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాదికాలతో ఆర్ఘ్యం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం. తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి.
అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది. మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది. శ్రీ కృష్ణుని బాల్యచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది. పాపపుణ్యాల వాసనేలేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి. కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు.కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలయిన ఉట్లమీది పాలు, పెరుగు, వెన్న దొంగిలించుటను అనుకరించే, జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు.
గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్నికృష్ణుడు ఎక్కికూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి ఈ ఉత్సవం. పోన్నపూలంటే ఆ కృష్ణునినికి ఇష్టమని ఆ పూలతో పూజచేస్తారు. దీనినే "పొంనమాను సేవ'' అని అంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా కొలువుదీర్చుతారు. దాన్ని 'గోకులాష్టమీ ఆస్థానం'గా వ్యవహరిస్తారు. సర్వభూపాల వాహనంపై స్వామి వారిని తిరుమల మాడవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గోకులాష్టమి ఆస్థానానికి తీసుకువస్తారు. పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తుండగా మరోవైపు ఉత్సాహభరితంగా 'ఉట్ల పండగ' జరుగుతుంది. దీన్ని శిక్యోత్సవం'గా వ్యవహరిస్తారు.
మధుర, ద్వారక, బృందావనం, ఉడిపి, పూరీ, గురువాయూరు తదితర క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. యాడుకుల భూషణుడు అర్థరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్నికృష్ణుడి విగ్రహానికి మంగలస్నానం చేయించి పట్టుదట్టీ కట్టి, సందేట తాయత్తులూ, సరిమువ్వగజ్జెలూ బంగారు మొలతాడుతో ముద్దుకృష్ణుడిగా అలంకరిస్తారు. అనంతరం ఊయలసేవ, పవళింపు పూజలు అయిన తరువాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం