చిన్నికృష్ణా...! నిన్ను చేరి కొలుతు

 


చిన్నికృష్ణా...!  నిన్ను చేరి కొలుతు 

     
                                                  
                                               

దశావతారాలలో  పరిపూర్ణావతారాలు...ఒకటి ‘రామావతారం’..., రెండవది ‘కృష్ణావతారం’. దైవాంశసంభూతుడై నప్పటికీ...పరిపూర్ణ మానవుడుగా జీవించి, ధర్మానికి ప్రతిరూపంగా నిలబడినవాడు....‘ శ్రీరాముడు’. దైవాంశసంభూతుడుగా పుట్ఠి, అడుగడుగునా మానవత్వంలో దైవత్వాన్ని ప్రకటిస్తూ,తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినవాడు ‘శ్రీకృష్ణుడు’.

- శ్రావణ బహుళ అష్టమి... ప్రపంచానికి ఓ మహాపురుషుని అందించిన శుభదినం.

- మధురానగరంలో, కంసుని చెరసాలలో.., దేవకి, వసుదేవులకు అష్టమ పుత్రునిగా ఆ జగన్నాధుడు ‘చిన్నికృష్ణుడు’గా అవతరించిన శుభదినం.

- పుడుతూనే వృషభ లగ్నానికి, అక్కడున్న గురు,చంద్రులకూ..., కర్కాటకంలో ఉన్నరాహువుకు..., సింహంలోనున్న రవికి..., కన్యలోనున్న బుధ,శుక్రులకు...,తులలోనున్నశనైశ్చరునకు..., మకరంలోనున్న కుజ,కేతువులకూ..., తన జన్మ నక్షత్రమైన రోహిణికి..., గౌరవ, మర్యాదలు పెంపొందింప చేసినవాడు ‘చిన్నికృష్ణుడు’.

- జన్మనిచ్చిన దేవకి, వసుదేవులకు పసిప్రాయంలోనే పరమాత్మ తత్త్వాన్ని ప్రబోధించి, తన అవతార లక్ష్యసాధనకై, పుట్టిన మరుక్షణంలోనే అడుగు ముందుకు వేసినవాడు‘చిన్నికృష్ణుడు’.

- చెరసాల తాళాలు ఊడిపడ్డాయి, కావలివారు మత్తులో మునిగారు, బయట హోరుమని వీస్తున్న గాలివానకు తన పడగను గొడుగుగా పట్టాడు ఆదిశేషువు, ఉప్పొంగి ప్రవహించే యమునానది బాలకృష్ణుని పసిపాద స్పర్శకు పులకరించి దారిచ్చి ధన్యత చెందింది. పరమాత్మునకు ప్రతిబంధకాలుండవని నిరూపించినవాడు ‘చిన్నికృష్ణుడు’

- యశోదాదేవికి మాతృత్త్వంలోని మాధుర్యాన్ని, ‘అమ్మా!’ అని పిలిపించుకోవడంలోనున్నకమ్మదనాన్ని రుచి చూపించినవాడు ‘చిన్నికృష్ణుడు’

- తనను చంపడానికి వచ్చిన ‘పూతన’ చనుబాలు త్రాగినందుకు ప్రతిఫలంగా ఆమెకు మాతృస్ధానాన్నిచ్చి, మోక్షసామ్రాజ్యాన్ని అనుగ్రహించినవాడు ‘చిన్నికృష్ణుడు’.

- తన బాల్యచేష్టలతో వ్రేపల్లెలోని ప్రతి ఇంటిని పరవశింపచేసినవాడు ‘చిన్నికృష్ణుడు’.

- పాలకుండలు ఫగిలినా..., వెన్నముంతలు ఖాళీఅయినా...,అత్త,కోడళ్లకు జగడాలు కల్పించినా..., అవన్నీ తన లీలావినోదాలే అని వినోదింపజేసినవాడు ‘చిన్నికృష్ణుడు'

- శకటాసుర, తృణావృత్త, ధేనుకాసుర, బకాసుర, అఘాసురాది రాక్షసులను సంహరించి, లోకక్షేమం కాచిన బాలవీరుడు ‘చిన్నికృష్ణుడు’.

- మట్టిలోనే సర్వసంపదలు, సకల ఔషధులు, సమస్త నిధులు ఉన్నాయన్న నిజాన్ని లోకానికి తెలియచెప్పడంకోసం మట్టిని తిన్నవాడు ‘చిన్నికృష్ణుడు’. - ‘ప్రపంచంలో నేను లేను...,, సృష్టి సర్వస్వం నాలోనేవుంది’ అన్న పరమసత్యాన్నిమనకు తెలియచెప్పడానికే యశోదాదేవికి తన నోటిలో విశ్వాన్ని చూపించిన బాలవేదాంతి ‘చిన్నికృష్ణుడు’.

- కాళీయుని పడగలపై నర్తించి, తన పాదముద్రలు లిఖించి, సర్పజాతి మొత్తానికి అభయప్రదానం చేసిన దయామయుడు ‘చిన్నికృష్ణుడు’.  - గొల్లపడుచులు చెప్పిన నిందలకు అలిగిన తన తల్లి యశోద అమాయక మాతృప్రేమకు రోటికి బందీకృతుడై, మద్దిచెట్లను కూల్చి ‘దామోదరుడు’ అని పేరుతెచ్చుకున్న మహామాయగాడు ‘చిన్నికృష్ణుడు’.

- యమునా నదీతీరాలకు శృంగార సరిహద్దులు వేసి, బృందావనానికి, వెన్నెలరాత్రులకు శృంగార సుగంధాలు అద్ది, తన వేణుగానంతో సంగీతానికి శృంగార రసరాగ గీతాలు నేర్పి, గోపకన్నెల మనసులను శృంగార ఊయలలూపిన శృంగారబాలుడు ‘బాలకృష్ణుడు’.

- గోపకాంతల చీరలు దాచి, ‘ దేహాభిమానం ఉన్నంతవరకూ దైవసాన్నిధ్యం దొరకదు’ అని బోధించి వారి హృదయాలను దోచిన బాలవిరాగి ‘బాలకృష్ణుడు’.

- తనకు విద్యాదానం చేసిన సాందీపమహర్షికి గురుదక్షిణగా మరణించిన ఆయన పుత్రుని సజీవంగా తెచ్చియిచ్చిన ఉత్తమశిష్యుడు ‘బాలకృష్ణుడు’.

- బృందావనం వదిలాడు. మధురానగరం చేరాడు. ధర్మభ్రష్ఠుడైన కంసుని...మేనమామ అనికూడా చూడకుండా సంహరించి, తన తల్లిదండ్రుల చెర విడిపించిన ఆదర్శపుత్రుడు ‘బాలకృష్ణుడు’.

- తనను వలచిన రుక్మిణి మూగప్రేమకు దాసుడై, ఆమెను వలచి, వరించి తెచ్చుకున్నప్రేమమూర్తి ‘శ్రీకృష్ణుడు’.

- ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిది వివాహాలు చేసుకుని, ‘తనను ఏ  విధంగా కోరుకుంటేఆ విధంగానే అనుగ్రహిస్తాను’ అని నిరూపించిన రసిక రాజశేఖరుడు ‘శ్రీకృష్ణుడు’.

- చిన్ననాడు తనతో కలిసి చదువుకున్న సుదాముడిచ్చిన(కుచేలుడు) కేవలం పిడికెడు అటులతో తృప్తి చెంది, అతనికి అష్టైశ్వర్యాలు అనుగ్రహించి, పవిత్ర స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆప్తమిత్రుడు ‘శ్రీకృష్ణుడు’ - ధర్మపక్షాన నిలిచిన పాండవుల పక్షం నిలిచి, కురుక్షేత్ర సంగ్రామం జరగరాదనే ఉద్దేశ్యంతో, పాండవ రాయబారిగా కురుసభలో తన రాజనీతిఙ్ఞతను నిర్భయంగా ప్రకటించిన నిరుపమాన రాజనీతి దురంధరుడు ‘శ్రీకృష్ణుడు’.

 

- కురుక్షేత్ర సంగ్రామ క్షేత్రంలో, స్వజనాన్ని సంహరించలేనని ధనుర్బాణాలను నేలవిడచి, మోహాంధకారంలో మునిగిన పార్థునికి తన విశ్వరూపం చూపించి, ‘ కర్మ చేసే అధికారం    మాత్రమే నీకు కలదుగానీ, దాని ఫలితం పైన నీకు అధికారం లేదు. సర్వ కర్మలకూ నేనే కర్తను, నీవు కేవలం నిమిత్తమాత్రుడవు’ అని గీతోపదేశం చేసిన జగద్గురువు   ‘శ్రీకృష్ణుడు’. శ్రీరాముడు మానవునిగా జీవించినా, మానవ ధర్మాలు పాటించినా, మానవునిగా మాత్రంమరణించలేదు. సరయూనదిలో మునిగి అవతార సమాప్తి చేసాడు.  కానీ,, శ్రీకృష్ణుడుఅలా కాదు. అడుగడుగునా మానవత్వంలో దైవత్వాన్ని ప్రకటిస్తూ వచ్చినా, అంతిమ సమయంలో మాత్రం మానవుడుగానే మరణించాడు. అతని పాంచభౌతిక శరీరానికిఅంతిమ సంస్కారాలు కూడా జరిగాయి. అందుకే శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారుడు.శ్రీకృష్ణునకూ, అష్టమి తిథికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దేవకి, వసుదేవులకు ‘ఎనిమిదవ’ సంతానంగా జన్మించినవాడు ‘శ్రీకృష్ణుడు’శ్రీకృష్ణుడు పుట్టిన చెరసాలకు ‘ఎనిమిది’ ద్వారాలున్నాయి. దశావతారాలలో ‘ఎనిమిదవ’ అవతారం‘శ్రీకృష్ణావతారం’.

శ్రీకృష్ణునకు ‘ఎనిమిది’ మంది భార్యలు.

శ్రీమన్నారాయణుని ‘ఓం నమో నారాయణాయ’ అషాక్షరి మంత్రంలో ‘ఎనిమిది’అక్షరాలు ఉంటాయి.
‘కృష్ణ’ అంటే... ‘భక్తుల ద్ణుఖాలను పోగొట్టేవాడు’ అని అర్థం. ‘‘భక్త ద్ణుఖ కర్షిణ్ణ కృష్ణ్ణ’’
అని ‘శబ్దార్ధ కల్పతరువు’ చెప్తుంది. ‘కృష్ణ’ అని ముమ్మారు స్మరిస్తే చాలు.., సర్వద్ణుఖాలు
సకలైశ్వర్యాలు పొందుతారు అని ‘శ్రీనారదీయ పురాణం’ చెప్తోంది.
అందుకే....మహాకవి అయిన ‘లీలాశుకుడు’...ఇలా అంటాడు.
      ‘‘ మన్దం మన్దం మధుర నినదైర్వేణు మాపూరయన్తమ్‌
        బృన్దం బృన్దావనాభువి గవాం చారయన్తమ్‌
        చరన్తం ఛన్దోభాగ్ణై శతమఖ మఖధ్వంసినాం రాక్షసానామ్‌
         హన్తారం తం కథయ రసనే గోపకన్యా భుజంగమ్‌ ’’
అంటే...‘ ఓ నాలుకా ! మెల్లమెల్లగా వేణుగానంతో పరవశింప చేసేవాడు, బృందావన సీమలలోగోవులను కాచేవాడు, వేదాల వీధుల్లో నిరంతరం విహరించేవాడు, యజ్ఞాలను ధ్వంసం చేసే రాక్షసులను సంహరించేవాడు, యమునానదీ సైకత విహారభూముల్లో గోపకన్నెలతో రాసక్రీడలు జరిపేవాడు అయిన శ్రీకృష్ణుని లీలలను స్మరిస్తేనే నీకు రుచి, గౌరవమూను. మరేం చేసినా
రాదు.’’ అని అర్థం.  అందుకే ‘శ్రీకృష్టాష్టమి’ని  ఓ పండుగగా జరుపుకుందాం. ఆయన చేసిన లీలలను ఓ వేడుకగా చేసుకుందాం. చిన్నికృష్ణుని పాదముద్రలతో ఆ యుగపురుషుని మనసారా స్వాగతించి తరిద్దాం.
               ‘‘ చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
                 బంగారు మొలత్రాడు పట్టుదట్టి
                 సందెతాయితలతు సరిమువ్వ గజ్జెలు
                  చిన్నికృష్ణా ! నిన్ను చేరి కొలుతు ’’
                         

- స్వస్తి-

 

- యం.వి.యస్‌.సుబ్రహ్మణ్యం