ముత్యాల జపమాల ధరించేవారు ఈ పొరపాట్లు చేయకూడదు!

 

ముత్యాల జపమాల ధరించేవారు ఈ పొరపాట్లు చేయకూడదు..!

ముత్యాలు స్వచ్ఛతకు చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ముత్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముత్యాలు  చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయని నమ్ముతారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు , శాంతికి ప్రతీక. అందువల్ల, ముత్యాల హారాన్ని ధరించడం మానసిక ప్రశాంతతను చేకూర్చి, కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చాలామంది ముత్యాల దండ ధరించడానికి ఇష్టపడుతుంటారు. అయితే ముత్యాల దండ ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాల ప్రకారం ముత్యాల హారాన్ని ధరిస్తే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటో తెలుసుకుంటే..

ముత్యాల హారం ఏ రోజు ధరించాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  సోమవారం చంద్రునికి చాలా శ్రేష్టమైన రోజు. కాబట్టి సోమవారం రోజు  ముత్యాల హారం ధరించడానికి శుభప్రదమైనదిగా భావిస్తారు.

శుద్ది..

ముత్యాల దండ ధరించేముందు దానిని పచ్చి పాలు, నీరు , గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. ముత్యాల దండను జపమాల గా కూడా ధరిస్తారు. ఇలాంటి వారు  జపమాలను శుద్ధి చేయకుంటే శుభ ఫలితాలు కలగవు. చివరగా, జపమాలను శుభ్రమైన నీటితో కడగాలి.

మంత్ర జపం..

జపమాల ధరించి, చంద్ర భగవానుని మంత్రాలను 108 సార్లు జపించాలి. జపమాల ధరించి మంత్రాలు జపించడం విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్ముతారు.

ముత్యాల జపమాల ఎవరికి మంచిది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అందువల్ల, కర్కాటక రాశిలో జన్మించిన వారికి ముత్యాల హారం ధరించడం అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాకుండా, మేష, వృశ్చిక , మీన రాశులలో జన్మించిన వారు కూడా హారాన్ని ధరించవచ్చు.

ప్రత్యేక శ్రద్ద..

ముత్యం పగిలిపోయినా లేదా దాని మెరుపును పూర్తిగా కోల్పోయినా, దానిని మార్చాలి. పగిలిన ముత్యాన్ని ధరించడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని, ఇది జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుందని చెబుతారు.

ముత్యాలను శుభ్రపరచడానికి బేకింగ్ సోడా లేదా వేడి నీటిని ఉపయోగించకూడదు.

ముత్యాలు చాలా మృదువుగా ఉంటాయి, కాబట్టి వాటిని ఇతర రత్నాలతో కలిపి ధరించకూడదు. అలా చేయడం వల్ల ముత్యంపై గీతలు పడవచ్చు.

ముత్యాల హారాన్ని ధరించిన తర్వాత తామసిక ఆహారం తీసుకోకూడదు. ఎవరితోనూ వాదించకూడదు. ఎవ్వరి గురించి తప్పుగా ఆలోచించకూడదు.

                              *రూపశ్రీ.