ఈ 7 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేస్తే శుభ ఫలితాలు

 

ఈ 7 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేస్తే శుభ ఫలితాలు

ఆషాడ పౌర్ణమి ఎంతో విశిష్టమైన రోజు.. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి జూలై 28వ తేదీ సాయంత్రం 6:18 గంటలకు ప్రారంభమై, జూలై 29వ తేదీ బుధవారం రాత్రి 8:05 గంటలకు ముగుస్తుంది.అందుకే 2026లో ఆషాఢ పౌర్ణమిని జూలై 29వ తేదీ బుధవారం నాడు జరుపుకుంటారు. దీనిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా గురు పూజ,  దేవాలయాలలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, చంద్రుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. గురు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి చేకూరుతాయని చెబుతారు. ఇలా దానాలు చేయడం వల్ల  భగవంతుడు కూడా సంతోషిస్తాడట. గురు పౌర్ణమి రోజు ఏ దానాలు చేయాలి? తెలుసుకుంటే..

తెలుపు రంగు వస్తువులు..

ఆషాఢ పౌర్ణమి రోజున తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. ఇది  జాతకంలో చంద్రుడిని బలపరుస్తుంది, తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

వస్త్రదానం..

ఆషాఢ పౌర్ణమి రోజున పేదలకు కొత్త లేదా శుభ్రమైన బట్టలు దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. కుటుంబంలో , సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందట,  అలాగే సానుకూల శక్తి లభిస్తుందట.

చదువుకునే పిల్లల కోసం..

ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటారు. అందువల్ల, ఈ రోజున పుస్తకాలు, పెన్సిళ్లు లేదా ఇతర విద్యాభ్యాసన సామగ్రి వంటి విద్య , జ్ఞానానికి సంబంధించిన వస్తువులను దానం చేయడం చాలా ఫలప్రదం. ఇది జ్ఞానం , ఆలోచించే విధానం మొదలైన విషయాలలో మెరుగ్గా ఉండేందుకు శక్తిని ఇస్తుందట.  

ఇష్టమైన వస్తువులు..

ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఎవరికి వారు వారికి ఇష్టమైన వస్తువులను పేద పిల్లలకు దానం చేయవచ్చు. ఇది  జీవితంలోకి ఆనందాన్ని, సానుకూల శక్తిని తీసుకువస్తుంది.

ఆహారం..

ఏది దానం చేసినా తృప్తి ఉండదు.. అదే ఆహారం దానం చేస్తే తృప్తి కలుగుతుంది అంటారు. అందుకే ఆషాఢ పౌర్ణమి రోజున ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదా ఆహార పదార్థాలను దానం చేయడం చాలా మంచిది. అన్న సంతర్పణ నిర్వహించడం చాలా మంచిది. ఆహార దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభించి, జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.

 

                        *రూపశ్రీ.