బ్రహ్మముహూర్తం ప్రత్యేకత ఏమిటి.. శక్తివంతమైన సమయంగా దీన్ని పరిగణిస్తారు ఎందుకు!
బ్రహ్మముహూర్తం ప్రత్యేకత ఏమిటి.. శక్తివంతమైన సమయంగా దీన్ని పరిగణిస్తారు ఎందుకు!
ఉదయం పూట, ప్రపంచం ఇంకా పూర్తిగా మేల్కొనని సమయంలో, గాలిలో స్వల్ప చల్లదనం, ప్రశాంత భావన నెలకొని ఉంటుంది, దానినే బ్రహ్మ ముహూర్తం అంటారు. ప్రతి వ్యక్తి తమతో తాము అనుసంధానం కావడానికి ప్రకృతి ఒక అవకాశాన్ని అందించే కాలంగా బ్రహ్మముహుర్తాన్ని పరిగణిస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు ఉండే ఈ సమయం, మానసిక , శారీరక సమతుల్యతకు అత్యంత ముఖ్యమైన సమయంగా బ్రహ్మ ముహూర్తాన్ని పరిగణిస్తారు. పొద్దున్నే లేచి చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో దైవ ఆరాధన, ధ్యానం చేయమని పండితులు కూడా చెబుతుంటారు. జీవితంలో విజయాన్ని అందుకున్న చాలామందిలో ఉదయాన్నే లేవడం అనే అలవాటు ఉంటుంది. అసలు బ్రహ్మ ముహూర్తం ప్రత్యేకత ఏమిటి? రోజులో ఉండే 24 గంటల సమయంలోకెల్లా అత్యంత శక్తివంతమైన కాలంగా బ్రహ్మ ముహూర్తాన్ని పరిగణిస్తారు ఎందుకు? తెలుసుకుంటే..
బ్రహ్మ ముహూర్తం ప్రత్యేకత..
ప్రాచీన కాలంలో ఋషులు , సాధువులు బ్రహ్మ ముహూర్తాన్ని ధ్యానానికి , జ్ఞాన ఆర్జనకు ఉత్తమ సమయంగా భావించారు. దీని ప్రాముఖ్యత ఎన్ని శతాబ్దాలు మారినా అలాగే కొనసాగుతోంది. బ్రహ్మ ముహూర్త సమయంలో, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు ఉత్తేజితమవుతుంది , రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం చురుకుగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో చేసే ఏ పని అయినా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం మనస్సును మరింత చురుకుగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజును సానుకూలంగా మొదలుపెట్టడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు మరింత సమతుల్యమైన, శక్తివంతమైన దినచర్యను కలిగి ఉంటారు.
బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలి?
బ్రహ్మ ముహూర్తంలో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా కూర్చోవడంతో ప్రారంభించండి. ధ్యానం మనసును ప్రశాంతపరిచి, ఆలోచనలను స్పష్టం చేస్తుంది. దీని తర్వాత, తేలికపాటి యోగా లేదా ప్రాణాయామం శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటే, ఈ సమయంలో పూజ చేయడం, మంత్రాలు జపించడం లేదా ధ్యానం చేయడం మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
ఈ పొరపాట్లు చేయకూడదు..
చాలామంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటారు. కానీ అలారం మోగగానే అలారం ఆపివేసి తిరిగి నిద్రపోవడం చేస్తుంటారు. ఇది అతిపెద్ద పొరపాటు.
నిద్రలేవగానే మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా ప్రతికూల వార్తలు చూడటం కూడా మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా, కోపం తెచ్చుకోవడం, వాదించడం లేదా ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండటం రోజంతా మానసిక స్థితిని పాడుచేస్తాయి.
అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి భారీ ఆహారం తినడం కూడా మానుకోవాలి.
ఈ పనులకు మంచి సమయం..
బ్రహ్మ ముహూర్తంలో మనస్సు అత్యంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది, అందువల్ల ఇది చదువుకు, సృజనాత్మక కార్యకలాపాలకు అత్యంత అనువైన సమయం. ఏదైనా చేయడానికి లేదా నేర్చుకోవడానికి మనసు చాలా తొందరగా సహకరిస్తుంది. ఈ సమయంలో జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి మెరుగుపడతాయి కాబట్టి, ఇది ప్రత్యేకంగా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం.
ఆధ్యాత్మికత, ఆధునిక ఆలోచనల మేళవింపు..
చాలామంది దీనిని దేవతల సమయంగా భావిస్తారు, ఈ సమయంలో చేసే పూజలు, ప్రార్థనలు విశేషంగా ఫలవంతం అవుతాయని నమ్ముతారు. ఆధునిక దృక్కోణంలో, ఈ సమయం మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనది. ఉదయాన్ని సానుకూలంగా ప్రారంభించడం రోజంతా మెరుగుపరుస్తుంది.
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే అలవాటు ఎలా పెంపొందించుకోవాలి?
ఈ అలవాటును అలవర్చుకోవడానికి, దినచర్యను . సరిచేసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకాన్నితగ్గించాలి. నిద్రలేవడానికి అలారం పెట్టుకోవడం మంచిదే అయినా ఖచ్చితంగా ఉదయాన్నే మెలకువ వచ్చేలాగా సాధన చేయడం మంచిది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు మనసులో గట్టిగా ఉదయం నాలుగు గంటలకు లేవాలి అని సంకల్పం చెప్పుకోవాలి. ఇది మొదటి రోజే పని చేయకపోయినా, క్రమంగా శరీరాన్ని ఉదయాన్నే 4గంటలకు మేల్కొలుపుతుంది. కొన్ని రోజుల సాధన తర్వాత, ఇది జీవనశైలిలో ఒక భాగం అవుతుంది.
*రూపశ్రీ.