పాండవుల మెట్ట
పాండవుల మెట్ట
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పంచారామాలలో ఒకటైన కుమారారామాన్ని మీ లో చాలామంది చూసి వుంటారు. మరి దానికి దగ్గరలో వున్న పాండవుల మెట్ట సంగతి విన్నారా? చాలామందికి తెలియని ఈ క్షేత్రంలో పాండవులు తమ అరణ్య వాసంలో కొంతకాలం గడిపారని కధనం. ఒక చిన్న గుట్టమీద చిన్న చిన్న ఆలయాల సముదాయం వున్నది. పాండవుల పట్ల గౌరవసూచకంగా ఈ గుట్టమీద ఒక చిన్న ఆలయం, గుట్టమీదకు తేలికగా వెళ్ళటానికి మెట్ల మార్గం నిర్మించారు. ఈ గుట్టమీద వున్న రెండు గుహలలోనే పాండవులు నివసించారంటారు. వారు ఇక్కడనుంచి రాజమండ్రిలోని గోదావరిదాకా ఒక సొరంగమార్గంద్వారా వెళ్ళి రోజూ గోదావరిలో స్నానంచేసి వచ్చేవారంటారు. దానికి నిదర్శనంగా ఇక్కడవున్న ఒక సొరంగ మార్గాన్ని చూపిస్తారు. ఇది రాజమండ్రిలోని సారంగధర మెట్టదాకా వుందిట. ప్రస్తుతం ఈ మార్గం రాజమండ్రివైపు మూసివేయబడి అడ్డంగా ఇళ్ళు కట్టారన్నారు.
గుట్టమీద వున్న పెద్ద పాదం గుర్తుని భీముని పాదంగా చెబుతారు. ఇక్కడ పోలియోబారిన పడినవారు తమ ఆరోగ్యంకోసం పూజలు చేస్తారు. పూర్వం ఈ ప్రాంతంలో కోయవారు ఎక్కువగా నివసించేవారు. ఇప్పటికీ వారు తమ పిల్లలకి పాండవుల పేర్లు, ద్రౌపది పేరు పెట్టుకుంటారు.. 1952లో ఈ ప్రాంతంలో నివసించిన శ్రీ సాలూరి వెంకట సుబ్బారావు అనే పుణ్యాత్ముడు ఇక్కడ ఛాయా, పద్మినీ, ప్రభా, ప్రజాదేవీ సమేత శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం నిర్మించారు. పల్లె ప్రజల నమ్మకాలకు, విశ్వాసానికీ ఒక మచ్చు తునక....వేసవికాలంలో పాండవుల గుహ దగ్గర వరద పాయసం చేస్తారు. ఆ పాయసం ఎటు పొంగితే అటు వానలు బాగా పడతాయని ఇక్కడివారి నమ్మకం.
ఇక్కడ వున్న అర్ధ నారీశ్వర శివలింగం కాశీనుంచి తెచ్చి ప్రతిష్టించారు. ఇంకా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, గాయత్రి వగైరా దేవతలకు చిన్న చిన్న ఉపాలయాలు వున్నాయి. పిఠాపురానికి దగ్గరలో వున్న పాండవులమెట్టకి సామర్లకోటనుంచీ, పిఠాపురంనుంచీ కూడా ఆటోలో వెళ్ళిరావచ్చు. సామర్లకోట వెళ్ళినవారు పిఠాపురం, పాండవుల మెట్ట కూడా చూసి రావచ్చు. ఏదో ఒకదానికే సమయంవుంటే మాత్రం పిఠాపురమే వెళ్ళిరండి.అవకాశం వున్నవారు సందర్శించదగ్గ ప్రదేశం.
- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)