వడక్కునాథన్ ఆలయంలోని నేతి శివలింగం

 

వడక్కునాథన్ ఆలయంలోని నేతి శివలింగం

 


మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప శివాలయాలు ఉన్నాయి కదా. వాటిలో కొన్ని ఆలయాల గురించి తెలుసుకుంటే అవునా ఈ ఆలయాల్లో ఇన్ని వింతలూ ఉన్నాయా అనిపించక  తప్పదు. అలాంటి వింత ఉన్న మరో ఆలయమే కేరళలోని ట్రిచూర్ దగ్గరలో ఉన్న వడక్కునాథన్ దేవాలయం. ఇక్కడి విశేషం ఏమిటంటే అన్ని అలయాలలోలాగా శివ లింగం దర్శించుకోవటానికి వీలుపడదు దానికి కారణం ఎప్పుడు ఈ లింగం నేతితో కప్పబడి ఉండటమే.

 

ఆలయ చరిత్ర ఏమిటంటే పరశురాముడు క్షత్రియులని తుదముట్టించాకా తన పాప ప్రక్షాళన కోసం ఒక యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దక్షిణ కింద తన భూమినంతా దానం ఇచ్చేసాడట. తను మళ్లీ తపస్సు చేసుకోటానికి తగిన భూమిని ఇమ్మని సముద్రుడిని కోరాడట. అప్పుడు సముద్రుడు  కేరళ ప్రదేశాన్ని పరశురామునికి తపస్సు చేసుకోటానికి అనువుగా ప్రసాదించాడట. పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్లి శివపార్వతులని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడట. శివుడు పరివార సమేతుడై వచ్చి ఒక మర్రి చెట్టుకింద అంతర్దానమయ్యాడట. దానినే శ్రీ మూల స్థానం అని పిలుస్తారు. ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కాలక్రమంలో కొచ్చిన్ రాజవంశీయులు ఆలయం కట్టాలని నిర్ణయించుకుని అక్కడ నుంచి శివలింగాన్ని జాగ్రత్తగా తీసి ప్రస్తుతం ఉన్న దేవాలయంలో ప్రతిష్టించారట. ఈ ఆలయానికి 1600 సంవత్సరాల చరిత్ర ఉందని చెపుతారు.

 

 

అప్పటి నుంచి శివలింగానికి అభిషేకం చెయ్యటానికి నేతిని వాడేవారు. అదే ఆచారం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. అయితే విశేషం ఏమిటంటే ఇన్నేళ్ళ నుంచి నేటితో అభిషేకాలు చేస్తూ వస్తున్నా ఆ నెయ్యి కాస్త కూడా కంపు కొట్టదట. ఈగలు వాలవట. ఆ నెయ్యి కరగదట. ఎంతటి ఎండాకాలం అయ్యి ఎండలు మండిపోయినా శివలింగానికున్న నెయ్యి కాస్త కూడా కరగాకపోవటం నిజంగానే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్య ఔషదంగా తలచి వాళ్ళ మందుల తయారీలో కూడా వాడుతుంటారు.  ఈ ఆలయ ప్రాంగణం లోనే గోవులుకాసే కృష్ణుడి విగ్రహాని కూడా మనం చూడచ్చు.

 

కైలాసంలో శివుడు మంచు పర్వతాల మధ్యలో ఉన్నట్టు ఇక్కడి ఆలయంలో శివుడు నేతి మధ్యలో చల్లగా ఉంటాడు. తన చల్లని చూపులతో మనని ఎప్పటికి రక్షిస్తూ ఉంటాడు.


...కళ్యాణి