Vastu and Painted Walls

 

ఇంటికి సున్నం వేయకపోతే అన్నీ నష్టాలే...

Vastu and Painted Walls


ఇళ్ళకు సున్నం వేయడం చాలా ముఖ్యమని చెప్తోంది వాస్తు శాస్త్రం. నైరుతిలో ఏ గది ఉండాలి, వాయువ్యంలో ఏ గది ఉండాలి అనేవి ఎంత ముఖ్యమో ఇంటికి సున్నం వేయడం కూడా అంతే ముఖ్యం. గోడలకు సున్నం వేసేది కేవలం ఆకర్షణకోసం అనుకుంటే పొరపాటే. సున్నం లేదా రంగులు అందం, ఆకర్షణను తెచ్చే మాట నిజం. ప్రతి సంవత్సరం గోడలకు రంగులు వేయడంవల్ల ఆ ఇళ్ళు ఆనందానికి ప్రతీకలుగా ఉంటాయి.సంతోష సంబరాలకు నిలయాలుగా మారతాయి. సిరిసంపదలు తాండవిస్తాయి. ఇది వాస్తు నిపుణుల మాట. ఇంటికి లేదా కార్యాలయానికి సున్నం వేయకపోతే అన్నీ నష్టాలే అని చెప్తున్నారు.

 

చాలామంది ఇళ్ళకు, ఆఫీసులకు రంగులు వేయడంలో అలసత్వం చూపిస్తారు. ''ఇప్పుడేమయింది, ఇంకొన్నాళ్ళు పోయాక వేయొచ్చులే'' అని సంవత్సరాల తరబడి వాయిదాలు వేస్తూ ఉంటారు. కొందరు ఖర్చుకు వెనకాడితే, ఇంకొందరు అశ్రద్ధ, నిర్లక్ష్యాలతో సున్నం గురించి పట్టించుకోరు. అలాంటి ఇళ్ళు పాతగా, కళావిహీనంగా ఉంటాయి. అప్పుడే నిద్ర లేచిన ముఖాలు ఎలా ఆకర్షణ, చురుకుదనం లేకుండా ఉంటాయో అలా కాంతిహీనంగా ఉంటాయి. రోజూ స్నానం చేసి ఉతికిన దుస్తులు వేసుకుంటే ఎంతో తేటగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. గోడలకు రంగులు కూడా అంతే. రంగులు వెలిసిపోయి, మాసిపోయిన గోడలు వికారంగా ఉంటాయి. గోడలు పటుత్వం తగ్గి, కూలిపోవడానికి కూడా కారణం అవుతాయి. కొన్ని సంవత్సరాలపాటు రంగులు వేయని ఇళ్ళు వెలవెలబోతూ నిరాశాజనకంగా కనిపిస్తాయి.

 

కొందరు ప్రతి సంవత్సరం నియమం తప్పకుండా ఇంటికి సున్నం వేయిస్తారు. ఆకర్షణీయమైన రంగులతో ఇళ్ళను, ఆఫీసులను ముస్తాబు చేస్తారు. అవి కమనీయంగా, రమణీయంగా ఉంటాయి. సున్నం గోడలకు రక్షణ కలగజేస్తుంది. అలాంటి గృహాల్లో అన్నివిధాలా సంతోషం తాండవిస్తుంది. ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. పరస్పర అనురాగంతో, ఆరోగ్యంతో, సిరిసంపదలతో ఎంతో ఉల్లాసంగా ఉంటారు.

 

ఇళ్ళు, షాపులు, ఆఫీసులకు ఏటా రంగులు కనుక వేయకపోతే అక్కడ లాభాలు, సంతోషాలు ఉండవు. వచ్చే సంపదలు కూడా ఆమడ దూరం పారిపోతాయి. సంతోష సరాగాల స్థానంలో ఈర్ష్యాద్వేషాలు అంకురిస్తాయి. ఉన్నవి పోయి, కొత్తవి రాక లేమి తాండవిస్తుంది. బాధలు, వేదనలు చుట్టుముడతాయి. ఏవో విరోధాలు, తగాదాలతో వాతావరణం అంతా అనారోగ్యకరంగా, విషాదభరితంగా తయారౌతుంది.

 

కనుక ఇళ్ళకు, కార్యాలయాలకు ఏటా సున్నం వేయించాలి. కనీసం మూడేళ్ళకోసారి అయినా వేయాలి.లేకుంటే ఆర్ధిక నష్టాలు, అనర్ధాలు కలుగుతాయి.

 

Painted walls and vastu, houses and offices painted, painted houses bring happiness, painted walls health and wealth, Colours to home