తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజు ...

 

తిరుచానూరు పద్మావతి అమ్మవారి

 

బ్రహ్మోత్సవాల మొదటిరోజు ...

 

 

 

ఈశానం జగతోస్య వేంకటపతేర్విషోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థ్సల నిత్యావాసరసికాం తత్‌ క్షాంతి సంవర్థినీమ్‌,
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్ఞ్యలాం భగవతీం పందే జగన్మాతరమ్‌

 


అని పద్మావతీ అమ్మవారిని భక్తులు స్తుతిస్తారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి ఏటా కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇంతకీ ఈ బ్రహ్మోత్సవాలను కార్తీక మాసంలోనే ఎందుకు నిర్వహిస్తారు?. వాటికి ఆపేరు ఎందుకొచ్చిందంటే ... శ్రీపద్మావతీ అమ్మవారు కార్తీక మాసం... శుక్లపక్షం... పంచమి తిథి రోజు శుక్రవారం ఉత్తారాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఆమె జన్మనక్షత్రం ఆధారంగా కార్తీక మాసంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. మొదటిసారి బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరొచ్చింది. 

 

 

 


వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి". చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలైన స్త్రీమూర్తి అని అర్థం.

 

 

 


మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.

 

 

 


తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమవుతాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అమ్మవారిని, ధ్వజపటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు చేర్చి కొలువుదీరుస్తారు. 8.30 నుంచి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ధనుర్లగ్నంలో 9.40 గంటలకు ఆగమ శాస్త్ర పండితుడు తిరుమలాచార్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, అష్టదిక్పాలకులను, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమ్మవారికి స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ జరుగుతుంది.

 

 

 

 

రాత్రి 7 గంటలకు అమ్మవారిని వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీరుస్తారు. అనంతరం పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని పిల్లనగ్రోవి చేతపట్టిన గోపాలకృష్ణుడి రూపంలో అలంకరిస్తారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారిని తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాలు, కేరళ సంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ల ప్రబంధం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.