తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
తిరుమల కొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు. ఈ అమ్మ తిరుపతి సమీపంలోని తిరుచానూరు (అలిమేలి మంగాపురం)లో కొలువుదీరివున్నారు. ప్రతీ ఏటా తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగం ఆ చివరిరోజు పంచమితీర్థం కూడా ఉంటుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఒక రోజు అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి ఉద్యానవనంలో సేకరించిన పుట్టమన్నును సాయంత్రం శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువస్తారు. నవధాన్యాలను పుట్టమన్నులో వేసి అంకురార్ఫణకు శ్రీకారం చుడతారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా గురువారం సాయంత్రం స్వామి ఉత్సవర్లైన సేనాధిపతి వారిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చుట్టూ ఊన్న నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు. అనంతరం ఆలయ పూజారులు ఆలయంలో పుణ్యాహవచనం, రక్షాబంధనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశ్వస్సేనుల ఊరేగింపు ముందు తిరువీధుల్లో దేదీప్యమానమైన వెలుగు జిలుగుల మధ్య గజ, తురగ, నంది కదులుతుండగా భక్తుల కోలాటాలు, భగవన్నామ స్మరణ మధ్య అత్యంత వైభవంగా ఊరేగింపును నిర్వహిస్తారు.
శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును. శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు. వెంకటేశ్వర మహాత్మ్యం కధ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించిన సుందరి") మరొక కధనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది.