నేచురల్ ఫ్లోర్ క్లీనర్ ఇలా తయారుచేసుకోండి..
నేచురల్ ఫ్లోర్ క్లీనర్ ఇలా తయారుచేసుకోండి...
మార్కెటింగ్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఇంట్లో రకరకాల ఫ్లోర్ క్లీనర్స్ వాడేస్తున్నారు. వీటిలో ఉండే స్ట్రాంగ్ కెమికల్స్ వల్ల ఫ్లోర్ శుభ్రంగా ఉండటం మాటేమో కానీ, రకరకాల జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో కేన్సర్‌లాంటి తీవ్రమైన సమస్యలూ వస్తాయని పరిశోదనలు సూచిస్తున్నాయి. అందుకే మనమే ఓ ఫ్లోర్ క్లీనర్‌ని తయారుచేసుకుంటే ఏడాదికి రెండు మూడు వేలు ఆదా అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. కెమికల్ క్లీనర్స్‌తో పోల్చుకుంటే వీటివల్ల లాభాలు కూడా ఎక్కువే!
* నేచురల్ ఫ్లోర్ క్లీనర్ కోసం పటిక, ఉప్పు, కర్పూరం బిళ్లలు ఉంటే సరిపోతుంది. పటిక ఫ్లోర్ మీద ఉండే చిన్న చిన్న క్రిములను చంపే యాంటిబయాటిక్‌లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు ఉన్నవారు పటికతో ఫ్లోర్ శుభ్రం చేస్తే, పిల్లలకి ఎలాంటి అలెర్జీలు రాకుండా ఉంటాయి.
* ఉప్పుతో మార్బుల్ ఫ్లోరింగ్ తళతళలాడిపోతుంది. చీమలు, చిమట్లు నేల మీద పాకకుండా చేస్తుంది.
* ఇక కర్పూరం ఓ గొప్ప రిపెల్లంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు అంత త్వరగా ఇంట్లో రావు. పైగా కర్పూరం వల్ల మంచి వాసన కూడా వస్తుంది.
ఈ పదార్థాలన్నీ నీటిలో వేసి అవి కరిగిపోయేదాకా ఉంచాలి. తర్వాత వాటిని కాస్త సర్ఫ్, ఫినాయిల్ కలిపిన నీళ్లలో కలిపి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ క్లీనర్ వాడి చూడండి. ఆ తర్వాత ఇంక మీరు కెమికల్స్ జోలికి పోనేపోరు.