Read more!

నీటి అడుగున గుడిని ఎవరు కట్టారో..! (Temple under water)

 

నీటి అడుగున గుడిని ఎవరు కట్టారో..!

(Temple under water)

 

కొన్నాళ్ళ క్రితం ఇండోనేషియా కాపిటల్ సిటీ అయిన జకర్తాలోని పెముటేరన్, బాలి సముద్ర తీరప్రాంతంలో నీటి అడుగున తమన్ పురా (Temple Garden) హిందూ దేవాలయం బయటపడింది. ఏదో చిన్న విగ్రహమో, శిల్పమో తవ్వకాలలో బయటపడితేనే వింతగా చెప్పుకుంటాం. అలాంటిది ఏకంగా ఒక ఆలయం కనిపించడమంటే మహా వింతేగా మరి.

 

ఆ నిర్మాణం దేవాలయం ఆకృతిలో ఉండటమే కాకుండా అందులో పది పెద్ద రాతి విగ్రహాలు దర్శనమిచ్చాయి. పైగా అవి శిలా ఫలకాల మీద అమర్చి ఉన్నాయి. అది ఆషామాషీ దేవాలయం కాదు. భారీగా కట్టినదే. గుడి ముఖద్వారం నాలుగు మీటర్ల ఎత్తున ఉండటమే కాకుండా 29 మీటర్ల లోతులో ఉంది. ఇక చేప్పేదేముంది... కుప్పలుతెప్పలుగా తరలివచ్చిన జన సందోహమే కాకుండా, మీడియా ఆఘమేఘాలమీద పరుగులు తీసింది. దానికి సంబంధించి పత్రికలూ, చానళ్ళు కూడా తెగ కధలు రాశాయి. అందరి నోట్లో ఆ వార్తే. అవకాశం ఉన్నవాళ్ళు స్వయంగా వెళ్ళి చూశారు.

 

ఇండోనేసియా ప్రభుత్వ యంత్రాంగం దాన్ని మిస్టరీగా పరిగణించలేదు. జకార్తా సాంస్కృతిక, పర్యాటక శాఖ శాస్త్రీయ దృష్టితో ఆలోచించాలని ప్రజలకు హితవు చెప్పింది. ఆ దేవాలయం వెనుక ఉన్న మర్మం ఏమిటో, ఆ నిర్మాణం ఎప్పుడు కట్టారో కూపీ లాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టారు. పురావస్తు పరిశోధన శాఖ వారిని రంగంలోకి దింపారు. ఆర్కియలాజికల్ డిస్కవరీ విభాగంవారు, అండర్ సీ విభాగం వారు అసలు సంగతి కనిపెడతామని మాట ఇచ్చారు. ఆచరణాత్మకంగా చేసి చూపించారు.

 

బెంటార్ అనే వ్యక్తికి సముద్రంలో ఈత కొట్టడమంటే మహా ఇష్టం. అతనలా ఈత కొడుతుండగా ఈ దేవాలయం దర్సనమిచ్చింది. దాంతో బెంటారు దాన్ని పునర్నిర్మించాలి అనుకున్నాడు. 2000 సంవత్సరంలో కరంగ్ లేస్తారి ప్రాజెక్టు కింద అమెరికా ఇచ్చిన ఆర్ధికసాయంతో దేవాలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది. అప్పట్లో ఈ విషయం అందరి దృష్టికీ ఎందుకు రాలేదో తెలీదు. 2005లో బెంటార్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోవడంతో లేస్తారి ప్రాజెక్టు ఆగిపోయింది.

 

నీటి అడుగున ఉన్నప్పటికీ ఈ గుడి మహా సౌందర్యాత్మకంగా ఉండటం విశేషం. ఈ దేవాలయం గురించిన మరిన్ని అంశాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా నీళ్ళల్లో దేవాలయం నిర్మించడం అంటే మాటలు కాదు కదా. మనవాళ్ళ ఆశా దృక్పథాన్ని, కళా నైపుణ్యాన్ని, అడ్వెంచర్స్ చేయాలనే నైజాన్ని ప్రశంసిద్దాం.

 

మనచుట్టూ ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలూ విడ్డూరాలూ జరుగుతుంటాయి. కొన్నిసార్లు వాటి మర్మం ఏమిటో అర్ధం కాదు. మరికొన్నిసార్లు ఆ సంఘటన వెనుక కారణం ఏదో ఉంటుంది. అది తెలీక మనకు చిత్రంగా, గమ్మత్తుగా ఉంటుంది. దానికి తోడు పుకార్లు షికార్లు చేసి, పూవు పూసింది అంటే కాయ కాసింది అంటారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు. చిత్రమైన విషయానికి చిలువలూ పలువలూ తోడయ్యేసరికి మరింత మిస్టరీగా మారుతుంది. మిరాకిల్ గా చెప్పుకుంటాం. అలాంటి అంశాల్లో ఇదొకటి.


mysteries in indian temples Jakarta, miracle of underwater temple, Temple Garden in Jakarta, mysteries and miracles of Temples