పాలక్కాడ్ లో చిత్రమైన చెట్టు (Mysterious Tree in Palakkad-Kerala)

 

నమ్మలేని నిజాలు (Unbelievable Facts)

పాలక్కాడ్ లో చిత్రమైన చెట్టు

(Mysterious Tree in Palakkad-Kerala)

 

కేరళ, పాలక్కాడ్ పశ్చిమ కొండ ప్రాంతంలో.. వందల చెట్ల మధ్య ఓ సుందర మహావృక్షం. పక్కనే చిన్న కొలను. అందులో తామరలు. ప్రకృతి కాంత అందాలను ఆరబోస్తూ కనువిందు చేస్తోంది. అటు మేఘాలు, ఇటు ఈ చెట్టు పోటీపడి కొలను అద్దంలో తమ సౌందర్యాన్ని చూసుకుంటున్నాయి. ఇంతవరకే అయితే ఇక చెప్పుకోవాల్సింది ఏముంది? కానీ అసలు చిత్రం అది కాదు.

పాలక్కాడ్ లోని ఆ చెట్టు నిండా బోల్డన్ని సుందర చిత్రాలు తీర్చిదిద్ది ఉన్నాయి. ఏ అజ్ఞాత శిల్పి ఈ చెట్టుపై ఇన్ని జీవాలను సజీవంగా చేక్కాడో గానీ, ఆతని కళా నైపుణ్యానికి శిరసు వంచి నమస్కరించాలి. ఒకే ఒక చెట్టుమీద ఎన్నో పక్షులు, జంతువులూ అందంగా, అద్భుతంగా ఉన్నాయి. పైగా ఆ మహా నిపుణుడు, ప్రతిఫలం ఏమీ ఆశించకుండా సుదూరంగా ఉన్న ఈ వృక్షంమీద ప్రయోగం చేశాడు. వహ్వా అనిపించేట్లు అద్వితీయంగా చెక్కాడు?! తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ శిల్పి చిరునామా తెలిస్తే ఎందరెందరో తమ తలుపులు, కిటికీలకు కార్వింగ్ చేయించుకోవడం ఖాయం.

చెట్టు మీద కోతి ఉంటే అది సాధారణం. కానీ చెట్టులో కోతి భాగమైపోతే..

పాము, తేలు, కుక్క, గుడ్లగూబ అనే తేడా లేకుండా ఎన్ని జంతువులు ఎంత సామరస్యంగా ఒదిగిపోయాయో!

వావ్.. ఒకదానితో ఒకటి పోటీపడి భలేగా చెట్టు ఎక్కేస్తున్నాయి కదూ!

కుందేలు, కోతి.. ఎంత పొందిగ్గా కూర్చున్నాయో!