దేవతల్లాగే ఈమెకీ వయసు పెరగలేదు... (Brooke Greenberg Mystery)
దేవతల్లాగే ఈమెకీ వయసు పెరగలేదు...
(Brooke Greenberg Mystery)
దేవతలకు మనలా వయసు పెరగదు. వాళ్ళు నవయవ్వనంగా, నిత్యనూతనంగా ఉంటారని పురాణ కధలు చెప్తున్నాయి. మన తాతముత్తాతల నాడు ఎలా ఉన్నారో, రేపు మన మునిమనవల కాలంలోనూ దేవతలు అలాగే ఉంటారు.
దేవతల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని పుట్టినట్టు ఉందో అమ్మాయి. అమెరికాలోని, మేరీల్యాండ్ కు చెందిన బ్రూక్ వయసు పెరిగినా ఆమెలో ఇసుమంత మార్పు లేదు. చాలామంది సహజంగా ఉన్నకంటే చిన్నగా కనిపించడం మనకేం కొత్త కాదు. కొందరు యాభయ్యేళ్ళ వయసులోనూ పాతికేళ్ళ వాళ్ళలా కనిపిస్తారు. కానీ బ్రూక్ సంగతి అలా కాదు. అన్నిరకాలుగా పెరగడం ఆగిపోయింది.
బ్రూక్ పెరుగుదల ఆగిపోవడం చూసి ఆమె కుటుంబసభ్యులే కాదు, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బ్రూక్ ను మరుగుజ్జు అమ్మాయిగానో, బోన్సాయ్ మొక్కగానో పరిగణించలేం. ఎందుకంటే మరుగుజ్జువారికి శారీరక పెరుగుదల ఆగినా, వయసు ముదరడం తెలుస్తుంది. కానీ, బ్రూక్ మెదడు, శరీరమూ - రెండూ ఫ్రీజైనట్టు ఆగిపోయాయి. ఎముకలు ఏమాత్రం ఎదగకుండా, అప్పుడే పుట్టిన పాపాయి ఎముకల్లా ఉన్నాయి. మరొకరి సాయం లేకుండా బ్రూక్ నడవలేదు, కనీసం నిలబడలేదు. తన దగ్గరకు వచ్చినవారిని గుర్తుపడితే నవ్వుతుంది. లేదంటే నిశ్చలంగా చూస్తుంది. అంతకుమించి మరే భావాలూ వ్యక్తం చేయదు.
బ్రూక్ ను ఎందరో డాక్టర్లు పరిశీలించారు కానీ, ఎవరికీ ఆమె కేసు అంతుపట్టలేదు. శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే పవర్ఫుల్ మెడిసిన్స్ ఎన్నో వాడి చూశారు. కానీ ఎంతమాత్రం ఫలితం లేకపోయింది. ''అన్నోన్ సిండ్రోమ్'' అంటూ చేతులు ఎత్తేశారు. అసోసియేట్ ప్రొఫెసరు, జాన్స్ హాప్కిన్స్ స్కూల్ వైద్యుడు అయిన లారెన్స్ పాకులా మాట్లాడుతూ ''బ్రూక్ గురించి ఏమీ చెప్పలేం.. ఇదొక మిరాకిల్.. బహుశా ఇలాంటి వింత కేసు ప్రపంచంలో మరెక్కడా ఉండకపోవచ్చు'' అన్నారు.
బ్రూక్ తల్లి కూతుర్ని అల్లారుముద్దుగా చూసుకుంది. కానీ ఒక్కోసారి వద్దనుకున్నా హృదయం మెలిపెట్టినట్టు అయ్యేది. ఒక ఫుడ్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ అయిన బ్రూక్ తండ్రి హోవార్డ్, ఒక సందర్భంలో ''నా కూతుర్ని చూస్తే గుండె పగిలిపోతున్నట్టు ఉంటుంది. రోజురోజుకీ మనలో మార్పు సహజం. కానీ నా కూతురిలో ఎన్నేళ్ళు ఉన్నా మార్పు కనిపించడం లేదు.. చిట్టి బొమ్మలా అలాగే ఉండిపోయింది'' అన్నారు.
30అంగుళాల పొడవు, 30 పౌండ్ల బరువు మాత్రమే ఉన్న బ్రూక్ ఉన్నంతవరకూ అందమైన బొమ్మలా, పరిమళభరితమైన పూవులా ఉంది. అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతే ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నట్టుండి ఓరోజు శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఒక తీపి జ్ఞాపకంగా మిగిలింది.
పరిశోధకులు మాత్రం బ్రూక్ కేసును అలా వదిలిపెట్టలేదు. డి.ఎన్.ఏ. పరీక్షలు చేస్తున్నారు. ఆమె శరీరంలో ఉన్న తేడా ఏమిటో, ఎప్పటికీ మార్పు లేకుండా యవ్వనంగా ఉండిపోయే రసాయనాలు ఏమైనా బోధపడతాయేమో, అది తెలిస్తే, మన వయసు మీదపదకుండా మందులేమైనా కనిపెట్టవచ్చేమో అని ఆరా తీస్తున్నారు.