అమ్మతో కాసేపు

 

 

అమ్మతో కాసేపు

 


గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే.


స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు.

 

పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా.

 

అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు.

 

 

అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి.

 

అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు.

 

ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం.

 

ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం.

 

కళ్యాణి