Kalagnanam 25

 

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 25

Kalagnanam 25

 

ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను. విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.

కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.

ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి. బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.

సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’

సమాధి తర్వాత తిరిగి దర్శనం

నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

********

బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

కందిమల్లాయపాలెం – చింతచెట్టు

కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు, సూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి, జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండి, తినడానికి పనికి రాకుండా వుంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి, గడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది.

 

Life story of Veerabrahmendra swamy part 25, Potuluri predictions and his autobiography, Potuluri Veerabrahmendra Swamy in history, Brahmamgari Kalagnanam jeevitha charitra part 25, predictions about world by potuluri