కుంభ రాశి
ధనిష్ఠ 3, 4 పాదములు, శతతార, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు (గు, గె, గో, స, సి, సు, సె, సో, దా)
ఆదాయం : 8, వ్యయం : 14 - రాజపూజ్యం : 7, అవమానం : 5
వీరికి ఈ సంవత్సరము, శని జన్మ ద్వితీయ రాశులలో సంచరించుటచే మిక్కిలి శ్రమకరమగు కాలము. ఏకార్యము సానుకూలము గాదు. వృథాకార్యముల యందు అలసట, భార్యాపుత్రాది స్వజన విరోధము, ఆరోగ్యలోపములు బాధించును. అకారణ కలహములు, పాపచింతన కలుగును. చైత్ర వైశాఖములందు, కార్తిక మార్గశిరములందు, గురువు చతుర్ధ, షష్ఠ రాశులయందు సంచరించునపుడు బుద్ధిచాంచల్యము, తేజోహాని, ప్రవాసము, బంధుమూలక వ్యధ కలుగును. శత్రు జ్ఞాతి బాధలు, వ్యాజ్యములు చోర రోగ బాధలు అధికముగనుండగలవు. మిగిలిన సమయమందు పంచమ గురువు అయినందున, చాలావరకు పరిస్థితులు అనుకూలించును. పుత్రవృద్ధి, సుజనమిత్రత్వము, ప్రభు అనుకూలత కలుగును. రాహువు ద్వితీయ, జన్మరాశులలోను, కేతువు సప్తమ, అష్టమ రాశులలోను సంచరించుటచే, వృథావ్యయములు, వృథా వైరములు, అధిక ప్రయాస కలుగును. భార్యాపుత్రాది స్వజన విరోధము, ఆరోగ్యలోపములు, కళత్రవర్గంలో పేచీలు ఏర్పడగలవు. చైత్ర వైశాఖ మార్గశిర పుష్యమాసములయందు కొంత అనుకూల పరిస్థితులుండును. ఆషాఢ శ్రావణ భాద్రపదములయందు అధికముగ జాగ్రత్తగా నుండవలయును.
ధనిష్ఠ వారికి, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు సంచరించును. శతతార వారికి, మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు రాహువు, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు కేతువు సంచరించుదురు. పూర్వాభాద్ర వారికి, సంవత్సరారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తిక బహుళం వరకు | జన్మతారయందు రాహువు సంచరించుదురు. మొత్తము మీద వీరు ఈ సంవత్సరము నవగ్రహశాంతి చేయవలయును. ఆదిత్యహృదయ పారాయణము, సప్తశతీ పారాయణముతో పాటు, గోసేవ, గురుసేవ, హనుమత్పూజా ప్రదక్షిణములు చేయుట ద్వారా, సర్వ దోషములు తొలగి సర్వశుభములు కలుగును.