తులారాశి

 

చిత్ర 3,4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు (రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే)

ఆదాయం : 11, వ్యయం : 5 - రాజపూజ్యం : 2, అవమానం : 2

వీరికి ఈ సంత్సరము, చైత్ర శుక్లమందు తిరిగి కార్తిక మార్గశిరముల యందు పంచమశని కావున సంతానమునకు ఇబ్బందులు, మనస్తాపము, స్వజనవిరోధములు కలుగును. సర్వము వ్యతిరేకముగ తోచును. ఆస్తిని కోల్పోవుట, కళత్ర బంధుమూలక వ్యధ, తరచుగానేదో ఒక సమస్య, మర్యాదాభంగకరమయిన విషయములందాసక్తి కలుగును. మిగిలిన సమయములయందు షష్ఠశనియగుటచే విశేషించి అనుకూలమయిన కాలము. తలచిన కార్యములు చాలావరకు నెరవేరును. శుభకార్యానుకూలత యుండును. సుఖము, ధనధాన్యవృద్ధి, ఇష్టబంధు సమాగమము కలుగును. గృహ నిర్మాణమునకు ప్రయత్నములు కలసి వస్తాయి. చైత్ర వైశాఖ శుక్లములందు అష్టమరాహువు వలన అకారణ కలహములు, అపనిందలు కలుగవచ్చును. పిమ్మట భాగ్యగురువు అయినందున చాలావరకు పరిస్థితులు అనుకూలించును. గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్ఠలు కలుగును. కార్తిక మార్గశిరములయందు దశమ గురువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు శ్రమకరముగనుండగలదు. చైత్ర వైశాఖములయందు షష్ఠగురువు, వ్యయకేతువు, పిదప పంచమరాహువు, ఏకాదశ కేతువు అయినందున సకలకార్యములయందు జయము కలుగును. పశులాభము, పుత్రమూలక వ్యధ కలుగును. శ్రావణము మొదలు నాలుగున్నర నెలలు కుజానుకూలత లేదు. మొత్తము మీద గతం కంటే మెరుగుగనుండగలదు.

చిత్ర వారికి, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతార యందు కేతువు సంచరించును. సంవత్సరారంభము నుండి వైశాఖశుక్లం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘశుక్లం వరకు శనివేధ, సంవత్సరారంభం నుండి కార్తిక బహుళం వరకు రాహువేధ కలదు. స్వాతి వారికి, సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు నైధనతారయందు కేతువు, కార్తిక బహుళం నుండి జన్మతారయందు రాహువు కలడు. మరియు రాహువేధ కలదు. విశాఖ వారికి, సంవత్సరారంభము నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తిక బహుళం వరకు జన్మతారయందు రాహువు సంచరించుదురు. కావున ఆయా సమయములందు కుజ, శని, గురువులకు శాంతియొనర్చిన మేలు. గురుసేవ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి పూజ వలన దోషములు తొలగును.