మకర రాశి
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ, ధనిష్ఠ 1, 2 పాదములు (బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గ, గీ)
ఆదాయం : 8, వ్యయం : 14 - రాజపూజ్యం : 4, అవమానం: 5
వీరికి ఈ సంవత్సరము, ప్రారంభమున మరియు కార్తిక మార్గశిరముల యందు ద్వితీయశనియగుటచే ధనవ్యయము, తేజోహాని, అకారణ కలహములు కలుగును. స్వజన విరోధము, పాపచింతన కలుగును. మిగిలిన సమయమందు తృతీయశని, ఏలిననాటిశని తొలగుటచే, చాలావరకు అనుకూలమయిన కాలము. ఋణవిముక్తి, భూ గృహ సంపాదన, ఉద్యోగప్రాప్తి కలుగును. స్వబుద్ధితో యత్నించిన కార్యములు సిద్ధించును. భ్రాతృవర్గములో గల వ్యాజ్యములు, పేచీలు పరిష్కరించబడును. చైత్ర వైశాఖములయందు పంచమ గురువు అగుటచే చాలావరకు పరిస్థితులు అనుకూలించును. పుత్రవృద్ధి, సుజనమిత్రత్వము, ప్రభు అనుకూలతయుండును. పిదప షష్ఠగురువు అగుటచే, శత్రు జ్ఞాతిబాధలు, వ్యాజ్యములు, చోర రోగ బాధలు కలుగును. కార్తిక మార్గశిరములయందు సప్తమగురువు అగుటచే అనుకూల పరిస్థితులుండును. చైత్ర వైశాఖములయందు తృతీయ రాహువు, భాగ్యకేతువు అగుటచే తలచిన కార్యములు నెరవేరును. భ్రాతృద్వేషము, మర్యాదాహాని, పాడిపంటలకు ఇబ్బంది ఒకప్పుడు కలుగును. అటు పిమ్మట ద్వితీయ రాహువు, అష్టమకేతువు అయినందున, వృథావైరములు, వ్యయములు, అధికప్రయాస కలుగును. కుజుడు సప్తమాది ద్వితీయాంత రాశులలో సంచరించును కావున అనుకూలుడు కాదు. ప్రారంభమున నాలుగు మాసములు, చివర మూడు మాసములు మరింత జాగ్రత్త అవసరము.
ఉత్తరాషాఢ వారికి, సంవత్సరారంభము నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించును. ధనిష్ఠ వారికి, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు సంచరించును. మొత్తము మీద వీరు ఆయా కాలములయందు గురు రాహు కేతువులకు, కుజునకు శాంతియొనర్చిన మేలు. గురుసేవ, హనుమత్పూజా ప్రదక్షిణములు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పూజ వలన సమస్త దోషములు తొలగును.