మీన రాశి

 

 

 

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి

(ది, దు, శం, ఝ, ధ, దె, దొ, చ, చి)

ఆదాయం : 5, వ్యయం : 5 - రాజపూజ్యం : 3, అవమానం : 1

వీరికి ఈ సంవత్సరము శని, వ్యయ జన్మరాశులలో సంచరించును కావున మిక్కిలి శ్రమకరమగు కాలము. ఆరోగ్య లోపములు, బంధు వైరములు, గృహచ్ఛిద్రములు బాధించును. వృథా వ్యయములు కలుగును. వ్యవసాయమందు నష్టమెక్కువ. మానసిక అశాంతి ఎక్కువగానుండును. వృథా వాదనలకు చోటివ్వరాదు. తేజోహాని, మతిభ్రంశము, భయము కలుగును. జనన సమయమున శనిబలము ఎక్కువగా ఉన్నచో అంత బాధ కలుగదు. కార్తిక మార్గశిరములయందు మాత్రము | గురువు పంచమ రాశిలో సంచరించుట వలన శుభుడు. అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించుటతో పాటు పుత్రవృద్ధి, సుజనమిత్రత్వము, ప్రభు అనుకూలత కలుగును. మిగిలిన సమయమున తృతీయ, చతుర్ధ రాశులలో సంచరించును కావున శ్రమ అధికము. ఉద్యోగ భంగము, వృథావైరములు బాధించును. బంధు విరోధములు ఒకప్పుడు బాధించును. స్థానచలనము ఒకప్పుడు కలుగవచ్చును. ప్రారంభమున రెండు మాసములు జన్మరాహువు, సప్తమ కేతువు అయినందున, భార్యాపుత్రాది స్వజన విరోధము, ఆరోగ్య లోపములు బాధించినను, వైశాఖ బహుళం నుండి ద్వాదశ రాహువు, షష్ఠకేతువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. శ్రావణ, భాద్రపద, మాఘ మాసములయందు కొన్ని పనులు నెరవేరును.

పూర్వాభాద్ర వారికి, సంవత్సరారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మనక్షత్రమందు శని, సంవత్సరారంభం నుండి కార్తిక బహుళం వరకు జన్మనక్షత్రమందు రాహువు సంచరించుదురు. ఉత్తరాభాద్ర వారికి, వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మనక్షత్రమందు శని సంచరించును. రేవతి వారికి, మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు సంచరించును. సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు కేతువేద కలదు. వీరు ఈ సంవత్సరము శని గురువులకు, ఆయా సమయములందు కుజునకు శాంతియొనర్చిన మేలు. ఆదిత్యహృదయ పారాయణము, హనుమత్పూజా ప్రదక్షిణములు, గోసేవ, గురుసేవ ద్వారా సర్వారిష్టములు తొలగి శ్రేయస్సునందగలరు.

సూచన : జాతక గ్రహస్థితి, దశాంతర్దశలు, వామ పార్శ్వ సుముఖ వేధలు మరియు అష్టకవర్గ న్యూనాధిక బిందుఫలములు మొదలగు ఇతర కారణములచే స్థూలంగా సూచించబడిన ఈ ఫలితములు ఈషద్వెషమ్యముగా మాత్రమే సంభవించును. నవగ్రహ బలాబలములచే ఇందు కొంత మార్పు కలుగును.