కృష్ణపక్షం

 

కృష్ణపక్షం

శ్రావణ బహుళ అష్టమిని దేశంలోని అనేక ప్రాంతాలలో శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కనుక ఈ రోజును శ్రీకృష్ణాష్టమి అని, శ్రీకృష్ణుడు చిన్నతంలో గోకులంలో పెరిగాడు కనుక గోకులాష్టమి అని, ఆయన జన్మించిన రోజు కనుక జన్మాష్టమి అని పిలుస్తారు. ఈ శ్రీకృష్ణాష్టమిని దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక్కో రీతితో సంప్రదాయబద్ధమైన భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. శ్రీకృష్ణుని బాల్య లీలలను గుర్తుతెచ్చుకుంటూ కొన్ని ప్రాంతాలలో ఉట్టి కొడుతూ ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉదయమే లేచి తలస్నానం చేసి, శ్రీకృష్ణుని అడుగులు పోలిన పాదముద్రలను ఇంటిలోకి వస్తున్నట్లు ముగ్గులు వేస్తారు. వైష్ణవులు రోజంతా ఉపవాసముండి రాత్రి పూజ, వ్రతం చేస్తారు. ఇటువంటి సంప్రదాయమే దక్షిణాది రాష్ట్రాలలో కనిపిస్తుంది. శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం. పరమానందాన్ని పంచిపెట్టిన అవతారం. బాల్య లీలతో అందరినీ పరవశింపజేసి, భగవద్గీతను అందించిన జ్ఞానమయుడు. రాజనీతిజ్ఞుడు. శ్రీకృష్ణుని యోగీశ్వరుడు అనే పేరు కూడా ఉన్నది. యోగాలకు ఆయన అధిపతి కాబట్టి అలా పిలుస్తారు.

దశావతారాలలో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. కృష్ణుని అవతార....దశావతారాలలో సంపూర్ణ మానవావతారం. ఈ అవతారానికి ముందున్న రామ, పరశురామ, వామన అవతారాలు మానవావతారాలే అయినప్పటికీ ఆ అవతారాలలో లేని పరిపూర్ణత శ్రీకృష్ణావతారంలో కనబడుతుంది. ఒక మానవునిలో ఉండే కపటోపాయల వద్ద నుండీ దైవం ప్రదర్శించే లీలల వరకూ మహావిష్ణువు, కృష్ణావతారంలో ప్రదర్శించారు. శ్రీ కృష్ణుని జననం దగ్గర నుండే ఈ లీలా వినోదం ప్రారంభమైంది. ఆయన పుట్టుక చెరసాలలో జరిగింది. అప్పుడు మొదలు, ఆయన గోకులానికి చేరడం వరకూ శిశుప్రాయంలోనే చేసిన లీలలు చర్వితచర్వణం.

బాలకృష్ణుడిగా శకటాసుర, పూతన వంటి రాక్షసులను అంతమొందించాడు. ఇవన్నీ శ్రీమహావిష్ణువు లీలలే...శ్రీ మహావిష్ణువు ఆర్తత్రాణపరాయణుడు...ఈ ఆర్తత్రాణపరాయణ్వానికి గజేంద్ర సంరక్షణ ఒక ఉదాహరణ. ఈ సంఘటనను తీసుకుంటే.... గజేంద్రుడు మొసలివాత పడ్డాడు. సకల ప్రయత్నాలు చేసి, ఓడాడు. "నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్/ రావే ఈశ్వర/ కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా" అని మొత్తుకున్నాడు.

అప్పుడు స్వామీ ఎలా ఉన్నాడు. 'రామావినోది' అయి ఉన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలలో ఉన్నాడు. "విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యన గుయ్యాలించి సంరంభియై"

సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్భత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణాన నోత్సాహియై
స్వామి గజప్రాణం రక్షించాలనే ఆవేశంలో బయలుదేరాడు! ఎలా? లక్ష్మికి చెప్పడు. రెండు చేతుల్లో శంఖచక్రాలు ధరించడు. భ్రుత్యులను పిలవడు. గరుడుని కోసం చూడడు. చెవుల మీద పడిన జుట్టును సవరించడు. లక్ష్మీదేవి చన్నుల మీద చెంగునైనా వదలడు.

ఈ పద్యాన్ని గురించి ఒక కథ వుంది. భక్త శిఖామణి పోతనామాత్యునికి ఈ పద్యం సందిగ్ధం అయింది. గంటం తాళ పత్రాలు వదిలాడు. నదీతీరానికి వెళ్తానని భార్యతో చెప్పి వెళ్ళాడు. అటువెళ్లాడో లేదో మరలి వచ్చాడు. గంట అందుకుని, పద్యం పూర్తిచేశాడు. భార్యతో అన్నం పెట్టించుకుని భోజనం చేసి, వెళ్లాడు. అప్పుడు పోతన పద్యం స్ఫురించిందని వచ్చాడు. భార్య చకితురాలయింది. ఇప్పుడే కదా పద్యం పూరించి, భోజనం చేసి వెళ్లారు అన్నది. పోతన గబగబా పద్యం చదివాడు. అతనికి కన్నీరు మున్నీరయింది.

"ఎంత అదృష్టవంతురాలవే! ఆ వచ్చిన వాడు రాముడు. నీకు దర్శనం ఇచ్చాడు! నీ చేత భోజనం చేశాడు!! నేనెంత పాపాత్ముణ్ణి !!! నాకు దర్శనం సహితం ఇవ్వలేదు" అని తలబాదుకొని ఏడ్చాడు.
"సిరికింజెప్పడు...." అంత మహత్తరం అయిన పద్యం!!!
శ్రీనాథ మహాకవి పోతనకు బావ. అతడు ఈ పద్యం విన్నాడు. ఆ శ్రీహరి వట్టిచేతుల్తో గజేంద్రుని ఎలా రక్షిస్తాడు! బావా అని ఎగతాళి చేశాడు!

శ్రీనాథుడు, పోతన భోజనాలు చేస్తున్నారు. ఇంతలో  బావిలో ఏదో పడిన చప్పుడు. శ్రీనాథుని కూతురు బావిలో పడ్డదని వార్త. శ్రీనాథుడు పెరుగన్నం చేత్తో బావి దగ్గరకు పెరుగేత్తాడు. "బావా! తాడూ బొంగరం లేకుండా ఎలా కూతురిని రక్షిస్తావ"ని పోతన పరిహాసం చేశాడు. అప్పుడుగాని శ్రీనాథునికి తండ్రి యాతన "సిరికింజెప్పడు..." పద్యం అర్థం కాలేదు.
బావిలో పడ్డది బండ. శ్రీనాథుని కూతురు కాదు.
"సిరికింజెప్పడు..." గురించిన కథ. అది అంత గొప్ప పద్యం. ఆ పద్యం ఆపన్న ప్రసన్నులను గురించి జగత్పిత శ్రీమన్నారాయణుని ఆవేదన, ఆతురత, ఆత్రం వ్యక్తపరుస్తుంది.

ఉన్నవాడు, ఇవ్వగలడూ పరాత్పరుడే. కాబట్టి భగవానుని ప్రార్థించే ఏ కార్యమైనా ప్రారంభించాలి. ఏ కార్యం ప్రారంభించడానికైనా, ఏకాగ్రత అవసరం. మనసు మరొక చోట ఉన్నవాడు కార్యం సాధించజాలడు. అతడు విఫలుడు అవుతాడు. క్రుంగుతాడు. కుల్తాడు. కార్యారంభంలో ప్రార్థన ఏకాగ్రత ప్రసాదిస్తుంది. ఏకాగ్రతతో కార్యం సఫలం అవుతుంది. జీవితం విజయవంతం అవుతుంది. ఇటువంటి ఘటనే  మరొకటి ద్రౌపదీ మానసంరక్షణ. ఆ సందర్భంలోనూ ఇంతే... ద్రౌపది మొరవిన్న వెంటనే ఆమెకు రక్షణ చేకూర్చాడు. ఒకటా, రెండా?  శ్రీకృష్ణావతారంలో మహావిష్ణువు ప్రదర్శించిన లీలలకు అంతులేదు. ఒక యుగసంధి కాలంలోని ఆయన అవతారం...మానవాళికి ఎన్నో విషయాలు బోధించింది. అందులో ప్రధానమైనది కష్టాలలోనే కాదు...సుఖాలలోనూ నిరంతరం భగవన్నామస్మరణలో కాలం గడపాలి. భగవంతుడు నన్ను కష్టాల నుండీ సంరక్షించగలడో లేదో అన్న సంశయం పనికిరాదు. మనసున భగవంతుని మీద లగ్నం చేసి, ఆర్తిగా ఆయనను ప్రార్థిస్తే...ఆయన మన మొర తప్పక వింటాడు. విని మనలను రక్షిస్తాడు. ఈ సత్యం గ్రహించి...నిరంతరం భగవంతుని మీద మనసు పెట్టండి.