కృష్ణాష్టమి ఈ ఆలయాలలో ప్రత్యేకం

 

కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తుంది. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారు. అయితే కొన్ని ఆలయాలలో జన్మాష్టమి, మరింత సంబరంగా సాగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా తపించిపోతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఇవిగో...

ఉడిపి
ఉడిపి (కర్ణాటక)లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. అందుకని ఎక్కడెక్కడి వైష్ణవులో ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇక జన్మాష్టమి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు.

ద్వారక
ద్వారక అంటే మోక్షాన్ని కల్పించే ద్వారం అన్న అర్థమట. సాక్షాత్తు ఆ కృష్ణుడు పాలించిన ఈ రాజ్యంలో ‘ద్వారకాధీశుని’ పేరుతో కృష్ణుని ఆలయం ఉంది. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలోని స్వామివారికి షోడశోపచారాలు చాలా వేడుకగా జరుగుతాయి. అర్థరాత్రి 11 గంటలకు స్వామివారిని ఉత్సవభోగం పేరుతో ఆడంబరంగా అలంకరిస్తారు. ఆ సమయంలో భక్తులు ఎవ్వరినీ దర్శనానికి అనుమతించరు. ఆ భోగం ముగిసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం లబిస్తుంది. ఇక ఆలయం వెలుపల కూడా భక్తుల దర్శనాదర్థం, బాలకృష్ణుని ఊయలలో ఉంచుతారు.

గోవా
గోవాలో పోర్చుగీసు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హిందువుల శాతం కాస్త తక్కువే! కానీ కృష్ణాష్టమి వచ్చిందంటే మాత్రం... గోవా యావత్తూ రంగులమయం అయిపోతుంది. అందుకు కారణం లేకపోలేదు. గోవాలో ఉండే కొద్దిమంది హిందువులకూ అక్కడి కృష్ణాలయం అంటే చాలా ఇష్టం. శతాబ్దాల తరబడి ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ఆ ఆలయంలోని విగ్రహాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు. గోవా రాజధాని పానాజీకి సమీపంలోని మాషెల్‌ అనే పట్నంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే... ఇక్కడ అంతరాలయంలో విగ్రహం దేవకీమాత కృష్ణుని ఎత్తుకున్నట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం ఉండే ఆలయం ఇది ఒక్కటే!

బృందావన్‌
కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిందీ, రాసలీలలు సాగించిందీ ఇక్కడే. జన్మాష్టమి సందర్భంగా ఈ బృందావనం అంతా రాసలీలల ప్రదర్శనలతో సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా బృందావనం సమీపంలోని మధువన్ అనే యమునాతీరంలో కృష్ణుడు రాసలీలలు చేశాడని నమ్మకం. ఇప్పటికీ అక్కడ రాత్రివేళలలో ఆ కన్నయ్య రాసలీలలు చేస్తూ దర్శనమిస్తాడట. జన్మాష్టమి సందర్భంగా ఈ మధువన్‌ అంతా నృత్యసంగీతాలతో హోరెత్తిపోతుంది. కానీ రాత్రివేళ మాత్రం కృష్ణుని ఏకాంతానికి భంగం కలగకుండా నిశ్శబ్దంగా మారిపోతుంది.

మధుర
దేశమంతా కృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిగితే... ఆయన జన్మించిన ప్రదేశంలో ఇంకెంత వేడుకగా సాగాలి. మధురలో ఆయన జన్మించిన చోటుగా భావించే ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ ఆలయంలో ఈ పండుగ చాలా ఆర్భాటంగా జరుగుతుంది. జన్మాష్టమి సందర్భంలో మధురలోని ఆలయాలు అన్నింటికీ ఒకే రంగుని వేస్తారట. ఈ పండుగనాడు స్వామివారికి 56 నైవేద్యాలు (చప్పన్నభోగం) అందించడం మరో విశేషం.


ఇవే కాదు... గురువాయూరు, నవద్వీప్, పూరీ వంటి అనేక పుణ్యక్షేత్రాలలో జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

 

- నిర్జర.