కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి

 

కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి?

 


హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా!

శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసకోవాలి.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.

కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్లు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు... బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి, ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది.

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.

ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తల్చుకుంటూ... పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లులాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్‌ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించిచి, ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. మరి ఈ కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారు?

 

- నిర్జర.