ఎవరీ మిత్రవింద
ఎవరీ మిత్రవింద
మిత్రవింద పేరు వినగానే అదేదో సినిమాలో ప్రముఖ పాత్రే గుర్తుకువస్తుంది. కానీ ఆ పేరుకి మూలం మాత్రం చాలా కొద్ది మందికే పరిచయం ఉండి ఉంటుంది. కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన మిత్రవిందది ఓ అందమైన ప్రేమకథ. ఇప్పటి సినిమాలని సైతం తలదన్నే అద్భుతమైన గాథ!
కృష్ణునికి అష్టమహిషుల పేరుతో ఎనిమింది మంది భార్యలు ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. వీళ్ల పేర్లు ఏమిటి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా... చాలా సందర్భాలలో మిత్రవింద ప్రస్తావన మాత్రం వినిపిస్తుంది. మిత్రవింద కృష్ణునికి సాక్షాత్తు మేనత్త కూతురు. ఆమె తండ్రి జయసేనుడు అవంతీ రాజ్యానికి అధిపతి.
మిత్రవిందకి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే చాలా అభిమానం. వయసుతో పాటుగా ఆ అభిమానం ప్రేమగా మారింది. కృష్ణునికి కూడా ఆమెంటే ఇష్టమే! కానీ ఆమె సోదరులైన వింద్య, అనువింద్యలకు మాత్రం కృష్ణుడంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. వారిరువురూ దుర్యోధనుడితోనే స్నేహంగా ఉండేవారు. తమ సోదరిని ఆ దుర్యోధనునికే ఇచ్చి కట్టబెట్టాలని కలలు కనేవారు. మిత్రవింద మనసు మాత్రం కృష్ణుని మీదే లగ్నమై ఉండేది.
తమ సోదరిని ఎలాగైనా దుర్యోధనునికి ఇచ్చి కట్టబెట్టేందుకు మిత్రవింద సోదరులు ఒక ఉపాయం పన్నారు. యుక్తవయసుకి వచ్చిన మిత్రవిందకి రాచరికపు సంప్రదాయం ప్రకారం స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని నలుమూలలా ఉన్న రాజ్యాధిపతులందరినీ ఆ స్వయంవరానికి పిలిచారు. కానీ కృష్ణుని మాత్రం కావాలనే ఆ వేడుకకు పిలవలేదు. కృష్ణుడు లేని ఆ స్వయంవరంలో మిత్రవింద గత్యంతరం లేక దుర్యోధనుడినే వరిస్తుందని వాళ్ల వ్యూహం.
మిత్రవిందకు స్వయంవరం జరుగుతున్న విషయం బలరామునికి తెలిసింది. వరసైన తననీ, తన సోదరుడు కృష్ణుడినీ పిలవకుండా దేశంలోని రాజులందరినీ పిలిచిన వైనంతో ఆయనకు ఒళ్లు మండింది. వెంటనే తన సోదరుడు కృష్ణునికి విషయాన్ని చేరవేశాడు. దాంతో ఎలాగైనా మిత్రవిందని దక్కించుకునేందుకు కృష్ణుడు అవంతీ రాజ్యానికి బయల్దేరాడు.
కృష్ణుడు అవంతికి చేరుకున్నాడన్నమాటే కానీ, ఆయన మనసులో చిన్న శంక మెదలసాగింది. మిత్రవింద తనను ప్రేమిస్తున్న విషయం ఎప్పుడూ బాహాటంగా చెప్పలేదు. ఒకవేళ ఆమె మనసులో కనుక తాను లేకపోతే, ఆమెను బలవంతంగా దక్కించుకున్నట్లు అవుతుంది. అందుకని ఆమె మనసులోని మాటలు తెలుసుకునేందుకు తన సోదరి సుభద్రను కూడా తనతో పాటుగా అవంతీ రాజ్యానికి తీసుకువెళ్లాడు. అక్కడ మిత్రవిందతో మాటలు కలిపిన సుభద్ర, ఆమె మనసులో కృష్ణునికి తప్ప మరొకరికి చోటు లేదని తెలుసుకుంది. ఆ మాటతో కృష్ణుడు అడుగు ముందుకు వేసేందుకు మార్గం సుగమం అయ్యింది.
స్వయంవరంలో అందరూ చూస్తుండగానే కృష్ణుడు, మిత్రవిందను తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న మిత్రవింద సోదరులు ఇద్దరూ కృష్ణుని చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అలా చేజిక్కించుకున్న మిత్రవిందను ద్వారకకు తీసుకువచ్చి, శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. అలా కృష్ణుని అష్టభార్యలలో ఒకరిగా మిత్రవింద స్థానం సంపాదించుకుంది. ఆ జంటకి ఒకరు కాదు ఇద్దరు కాదు... పదిమంది పిల్లలు కలిగారు. ఇదీ మిత్రవింద, కృష్ణుల ప్రేమకథ!
- నిర్జర.