జ్యేష్ఠ మాసంలో వారికి వివాహం చేయకూడదా

 

జ్యేష్ఠ మాసంలో వారికి వివాహం చేయకూడదా

 



జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ సంతాన వివాహం చేయవచ్చా, చేయకూడదా అనే సందేహం చాలామందికి వుంటుంది. ఈ మాసంలో సంప్రదాయం ప్రకారం, ముహూర్త శాస్త్ర ప్రకారం ఉన్న వివరణ ఏమిటో చూద్దాం.
జ్యేష్ఠ మాసంలో, జ్యేష్ఠ పుత్రుని, జ్యేష్ఠ పుత్రిక వివాహం చేయకూడదని పూర్వం నుంచి ఆచారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ జ్యేష్ఠులు అంటే ఎవరో తెలుసుకుందాం. మొదట పుట్టిన పుత్రుడు కాని, పుత్రిక కాని జ్యేష్ఠ సంతానం అవుతారు. జ్యేష్ఠ అనేది గర్భానికి సంబంధించినదిగా పరిగణించాలి. మొదటి గర్భంలో పుత్రిక అయినా, పుత్రుడు అయినా వారు జ్యేష్ఠులు. గర్భస్రావమైనా, ప్రథమ సంతానం జీవించకపోయినా, తరువాతి సంతానం జ్యేష్ఠ సంతానం కాజాలదు. ఇక గ్రంథాల ప్రకారం చూసినా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ సంతానానికి ఇతర శుభకార్యాలు నిర్వహించడం కూడా శ్రేష్టం కాదని సూచిస్తోంది. అలాగే జ్యేష్ఠ సంతానానికి జ్యేష్ఠ మాసంతో పాటు, మార్గశిర మాసం కూడా శుభకార్యాలకు ఫలప్రదమైన మాసం కాదు. యజ్ఞోపవీతం, వివాహం, కేశఖండన, వంటి శుభకార్యాలు జ్యేష్ఠ సంతానానికి వారు జన్మించిన మాసంలో జరుపకూడదు.

 



జ్యేష్ఠ సంతానానికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదని ఉన్నా దానికి కొన్ని గ్రంథాల్లో మినహాయింపులు కూడా సూచించాయి. భరద్వాజ మహర్షి ప్రకారం జ్యేష్ఠ మాసంలో కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ఉండే పది రోజులు మినహాయించి మిగతా రోజుల్లో జ్యేష్ఠ సంతానానికి శుభకార్యాలు చేయవచ్చు. ముహుర్త గ్రంథాలను అనుసరించి మూడు జ్యేష్ఠలు నిషిద్ధం. వరుడూ, వధువు ఇరువురూ జ్యేష్ఠ సంతానమే అయితే జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. వధూవరులలో ఒకరే జ్యేష్ఠులు అయిన జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవచ్చు.