సతీదేవి నాలుక పడిన ప్రదేశం.. జ్వాలాముఖి ఆలయ వైభవం గురించి తెలుసా!
సతీదేవి నాలుక పడిన ప్రదేశం.. జ్వాలాముఖి ఆలయ వైభవం గురించి తెలుసా!
దేవీ పురాణం దుర్గాదేవి యొక్క 51 శక్తిపీఠాల గురించి వివరిస్తుంది . జ్వాలాముఖి ఆలయం ఈ శక్తిపీఠాలలో ఒకటి. జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు జ్వాలా దేవిగా దర్శనం ఇస్తారు. చైత్ర నవరాత్రుల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు జ్వాలా దేవిని సందర్శిస్తారు. నవరాత్రుల సమయంలో, నిజంగా అద్భుతమైన దృశ్యం కనబడుతుంది. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఉంది. మత విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో నెయ్యి లేదా వత్తులు లేకుండా తొమ్మిది సహజ జ్వాలలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఈ జ్వాలలను చూడటం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. సతీదేవి నాలుక పడిన ప్రదేశమే జ్వాలాముఖి ఆలయ ప్రాంతం అని చెబుతారు. జ్వాలాముఖి ఆలయం గురించి పూర్తీగా తెలుసుకుంటే..
సతీదేవి నాలుక పడిన ప్రదేశం..
పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు తనను యజ్ఞానికి ఆహ్వానించకపోయినా యజ్ఞానికి హాజరై.. తండ్రి ఇంట్లో జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత మహాదేవుడు ఆమె దేహాన్ని తీసుకుని విశ్వ ప్రదక్షిణ ప్రారంభించాడు. నారాయణుడు తన చక్రం సహాయంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా నరికాడు. సతీదేవి శరీర భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి నాలుక పడిన ప్రదేశమే జ్వాలాముఖి ఆలయంగా ప్రసిద్ధి చెందింది, దీనిని సతీదేవి నాలుకకు ప్రతీకగా భావిస్తారు.
జ్వాలాముఖి ఆలయ రహస్యం..
ఆలయం లోపల నెయ్యి లేదా వత్తి లేకుండా తొమ్మిది జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. ప్రధాన జ్వాలను మహాకాళి దేవి స్వరూపంగా భావిస్తారు. అది నిరంతరం వెలుగుతూ ఉంటుంది. మత విశ్వాసం ప్రకారం, జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించడం వల్ల భక్తులు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు.
అంతేకాకుండా జ్వాలాముఖి అమ్మవారు అన్ని కోరికలను తీరుస్తుందని చెబుతారు. వివాహంలోని అడ్డంకుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆలయంలోని తొమ్మిది ప్రదేశాలలో జ్వాలలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి, వీటిని నవ దేవతలకు చిహ్నాలుగా భావిస్తారు.
*రూపశ్రీ.